దిగుబడులపై దిగాలు

ABN , First Publish Date - 2021-10-14T05:45:48+05:30 IST

ఓ యేడు నష్టం వచ్చినా.. మరో యేడు ఆదుకోకపోతుందా అన్న ధీమాతో పత్తి పంటను సాగు చేసిన రైతులు పంట దిగుబడులపై దిగులు చెందుతున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే సరికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తోంది. పంటలను ముసురుకుంటున్న చీడ పీడలు, అధిక వర్షాలతో దిగుబడులపై అన్నదాతలు ఆశలు వదులుకుంటున్నారు.

దిగుబడులపై దిగాలు

అధిక వర్షాలు, నకిలీ విత్తనాలతో పత్తి రైతుల ఆందోళన

పెట్టుబడులు నిండక అప్పులపాలవుతున్న అన్నదాతలు

పంట నష్టంపై చేతులెత్తేస్తున్న జిల్లా అధికారులు

20 నుంచే పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్‌, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): ఓ యేడు నష్టం వచ్చినా.. మరో యేడు ఆదుకోకపోతుందా అన్న  ధీమాతో పత్తి పంటను సాగు చేసిన రైతులు పంట దిగుబడులపై దిగులు చెందుతున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే సరికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తోంది. పంటలను ముసురుకుంటున్న చీడ పీడలు, అధిక వర్షాలతో దిగుబడులపై అన్నదాతలు ఆశలు వదులుకుంటున్నారు. జిల్లాలో 3లక్షల 83వేల 251 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. దీంతో 25లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి సారి అంచనాలకు మించిన దిగుబడులు వస్తున్నా ఈ సారి మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. గత పక్షం రోజులుగా పంట చేతికి రావడంతో అధికారులు ఈ నెల 20నుంచి పత్తి పంట కొనుగోళ్లకు సన్నద్ధమవుతున్నారు.

ఎకరాన 5 క్వింటాళ్లు..

ఈ యేడు అధిక వర్షాల కారణంగా పంట ఎదుగుదల పై తీవ్ర ప్రభావం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట ఎర్రబారిపోయి ఎదుగుదల నిలిచి పోయింది. కొన్నిచోట్ల పంట ఏపుగా పెరిగినా.. పత్తి కాయలు నల్లబారి పోయి నాణ్యత లేకుండా పోయాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నల్లరేగడి నేలల్లో ఎకరాన 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడులు వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం 3 నుంచి 5 క్వింటాళ్ల లోపే దిగుబడులు వస్తున్నాయని అన్నదాతలు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రతతో దిగుబడులు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పంటను తొలగించి రెండవ పంటగా రబీలో శనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సిక్సర్‌ నకిలీ విత్తనాలతో జిల్లా వ్యాప్తంగా 50వేల ఎకరాలలో పంట నష్టపోయినట్లు రైతులు చెబుతున్న అధికారులు మాత్రం పంట నష్టం జరుగలేదంటూ చేతులేతేస్తున్నారు. 

కనిపించని ధీమా..

ఎన్నో ఆశలతో పత్తి పంటను సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలోను రైతుల్లో ధీమా కనిపించడం లేదు. ఊహించని రీతిలో పంట తీవ్రంగా దెబ్బతినడం, పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తాయో రావోనన్న బెంగ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎకరాన రూ.30వేలవరకు ఖర్చు చేసిన 3 నుంచి 5 క్వింటాళ్ల లోపే దిగుబడులు వస్తున్నాయని దీంతో పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పటికే దళారుల వద్ద అప్పు చేసి మరి పంటను సాగు చేసిన దిగుబడి లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే గడిచిన నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి వరకు మూడు నాలుగు సార్లు చేతికొచ్చే పంట ఒకే సారికి పూర్తి కావడంతో రైతులు అప్పుడే పంటను తొలగిస్తూ నేలను చదును చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ నష్టం నుంచి గట్టెక్కె ప్రయత్నం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ యేడు క్వింటాలు పత్తి ధర రూ.7,300 నుంచి రూ.7,800  వరకు ధర పలుకుతున్న ఆశించిన దిగుబడులు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధర ఉన్నా ఏం లాభం..?

: కంది నర్సింహులు (రైతు, తలమడుగు)

ఈ సారి ధర ఎక్కువగానే ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఏం లాభం ఉండాలా లేదు. అధిక వర్షాలకు పత్తి పంట పూర్తిగా ఎర్రబడి పోయి నేలమీదనే కనిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి పంటను తీసిన మరోసారి వస్తుందని భరోసా మాత్రం కనిపిస్త లేదు. దీంతో పత్తి కోసం వేచి చూసే కన్న ప్రత్యామ్నాయ పంటగా శనగను సాగు చేసుకోవడం మేలనిపిస్తుంది. కనీసం శనగ పంటతోనైనా నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-10-14T05:45:48+05:30 IST