భయం గుప్పిట్లో డెంగ్యూ పేషెంట్లు

ABN , First Publish Date - 2021-08-20T06:39:39+05:30 IST

నిర్మల్‌ జిల్లాను డెంగ్యూ జ్వరాలు చుట్టుముట్టాయి.

భయం  గుప్పిట్లో  డెంగ్యూ పేషెంట్లు
ఆసుపత్రిలో డెంగ్యూ పేషెంట్లు

భయం గుప్పిట్లో శివారు ప్రాంతాలు 

పల్లెలపైనా పడగ 

ఆసుపత్రుల్లో సరిపోని మంచాలు 

తోడవుతున్న మలేరియా

రోగులతో దవాఖానాలు కిటకిట 

భయాందోళనలో బాధితులు 

నిర్మల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాను డెంగ్యూ జ్వరాలు చుట్టుముట్టాయి. గత కొద్దిరోజుల నుంచి డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారంతా అటు సర్కారు ఇటు ప్రైవేటు దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆసుపత్రులన్ని డెంగ్యూ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ గణనీయంగా తగ్గిపోతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణంలోని అనేక స్లమ్‌ ప్రాంతాలు డెంగ్యూ జ్వరాలతో గజగజ వణికిపోతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెంగ్యూ జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళనకరమవుతోంది. వైద్య,ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 58 మందికి డెంగ్యూజ్వరాలు సోకినట్లు చెబుతున్నారు. అయితే అధికారుల లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్న వాదనలున్నాయి. అధికారులు డెంగ్యూ జ్వరాల లెక్కలను దాచి పెడుతున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు భైంసా, నిర్మల్‌ ఏరియా ఆసుపత్రుల్లోనూ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగ్యూ జ్వరాలతో భాధపడుతున్న వారు చికిత్సలు పొందుతున్నారు. అయితే అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా ఈ ఆసుపత్రుల్లో బెడ్‌లు సరిపోవడం లేదంటున్నారు. మంచాలు సరిపోక ఆరుబయటనే జ్వరబాధితులకు చికిత్సలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడం, పందులు స్వైరవిహారం చేయడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. దోమల కారణంగానే డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం పట్టణంలోని పలు స్లమ్‌ ప్రాంతాలకు చెందిన స్థానికులు పెద్దఎత్తున కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే డెంగ్యూజ్వరాలు విస్తరిస్తున్నాయంటూ వారు ఆరోపించారు. వారం రోజుల్లోగా పారిశుఽధ్యాన్ని మెరుగు పర్చడమే కాకుండా పందులను నివారించి దోమల బెడదను తగ్గించాలని అలాగే జ్వరాలతో భాధపడుతున్న వారందరికీ మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ స్థానికులు డిమాండ్‌ చేశారు. కాగా ఓ వైపు విపరీతమైన వర్షాలు కురుస్తున్న కారణంగా దోమల తీవ్రత అధికమవుతోంది. స్లమ్‌ ప్రాంతాల్లోనే కాకుండా పాష్‌కాలనీల్లో కూడా దోమల బెడద తప్పడం లేదంటున్నారు. పంచాయతీ ఇటు మున్సిపల్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుఽధ్య పనులు చేపట్టకపోవడం, అలాగే మురికి గుంతలను పూడ్చకపోవడం, దోమల నివారణ మందులను స్ర్పే చేయకపోవడంతోనే సమస్య తీవ్రరూపం దాల్చుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కరోనా నుంచి తప్పించుకున్నా మళ్లీ కొత్తముప్పు

గత ఐదారు నెలల నుంచి కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులపాలైన జనం మళ్లీ డెంగ్యూజ్వరాలు విభృంభిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ కరోనా మాదిరిగానే డెంగ్యూజ్వరాలు క్రమంగా విస్తరిస్తుండడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా స్లమ్‌ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిలో ఒకరిద్దరు కన్నా ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ జ్వరాల పీడితులున్నారంటే అతిశయోక్తి కాదంటున్నారు. వైద్యాధికారులు ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు వెనకాడుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాసంక్షోభం నుంచి కోలుకుంటున్న సాధారణ జ్వరం మళ్లీ డెంగ్యూజ్వరాలు వెంటాడుతుండడంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కరోనాసోకిన వారి కూడా చాలా మందికి మళ్లీ డెంగ్యూ జ్వరాలు సోకుతుండడంతో వారి ఆరోగ్యపరిస్థితులు మరింతగా సన్నిగిల్లే ప్రమా దం ఉందంటున్నారు. 

కిటకిటలాడుతున్న ఆసుపత్రులు 

కాగా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వారంతా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పరీక్షలు చేసుకున్న వారందరిలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగానే జ్వరాలతో భాధపడుతున్న వారందరిలో కూడా డెంగ్యూ పాజిటివ్‌గా వస్తోందంటున్నారు. అటు ప్రభుత్వాసుపత్రులు ఇటు ప్రైవేటు ఆసుపత్రులన్నీ డెంగ్యూ జ్వరాల బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలతో భాధపడుతున్న వారిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతుండడం ఆందోళనకరం గా మారుతోందంటున్నారు. ప్రస్తుతం ఒక బాటిల్‌ రక్తంతో సమానంగా ఉన్న ప్లేట్‌లెట్స్‌ విలువ రూ.12వేల వరకు ఖరీదవుతోందని చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయిన వారికి ఇలాంటి రక్తం బాటిల్స్‌ను రెండు మూడుకు పైగా అందించాల్సి వస్తోందని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న డెంగ్యూ బాధితులు కనీసం రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు. 

డెంగ్యూకు తోడవుతున్న మలేరియా

డెంగ్యూ జ్వరాలకు తోడు మలేరియా జ్వరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అధికారికంగా 58 మంది డెంగ్యూ జ్వరాలకు గురైనట్లు చెబుతుండగా ఒక మలేరియా కేసు నమోదైనట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అలాగే 166 మందికి పైగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడిస్తోంది. ఈ లెక్కలకు వాస్తవిక లెక్కలకు ఎక్కడా పొంతన లేదంటున్నారు. ప్రైవేటు దవాఖానాల్లో కుప్పలు తెప్పలుగా డెంగ్యూ, వైరల్‌ జ్వరాలతో భాధపడుతున్న వారు కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెబుతున్నారు. 


Updated Date - 2021-08-20T06:39:39+05:30 IST