వీఎస్‌ఎస్‌ భవనాలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2021-12-27T03:44:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉన్న వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్‌) భవనాలకు రక్షణ లేకుండా పోతోంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా భవనాలు నిరుప యోగంగా మారగా వాటి స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.

వీఎస్‌ఎస్‌ భవనాలకు రక్షణ కరువు
లోగో

- అన్యాక్రాంతం అవుతున్న నిర్మాణాలు
- నిద్రావస్థలో అటవీశాఖ అధికారులు
మంచిర్యాల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉన్న వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్‌) భవనాలకు రక్షణ లేకుండా పోతోంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా భవనాలు నిరుప యోగంగా మారగా వాటి స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. అట వీ సంపద, దానిపై ఆధారపడే ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందజేయడం ద్వారా అడవులను కాపాడేందుకు సుమారు 20 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వన సం రక్షణ సమితి భవనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. వివిధ గ్రామాల్లో అటవీశాఖ అధ్వర్యంలో నిధులు కేటాయించి భవన నిర్మా ణాలు చేపట్టింది. అటవీ భూములుగానీ, స్థలాలు అందుబాటులో లేనిచోట గ్రామాల నుంచి సేకరించిన ఆబాది భూముల్లో నిర్మాణం చేపట్టారు. ఒక్కో భవన నిర్మాణానికి అప్పట్లో మూడు, నాలుగు గుంటల స్థలాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ భవనాల్లో అడవుల్లోకి వెళ్లే రైతులు, ఇతరులకు ఇక్కడ అవగాహన సమావేశాలు నిర్వహించేవారు. తునికాకు సేకరణకు అవ సరమైన కొమ్మ కొట్టే పనులకు శిక్షణ తరగతులు సైతం నిర్వహించే వారు. కొంతకాలం పాటు భవనాలను సక్రమంగా వినియోగించినప్ప టికీ కాలక్రమేణ అవి నిరాధరణకు గురవుతున్నాయి.

నిరుపయోగంగా భవనాలు..
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వీఎస్‌ఎస్‌ భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఈ భవనాలను పట్టించుకోవడం లేదని ప్రజలు చెబు తున్నారు. దీంతో ఇతరుల కళ్లు వాటిపై పడ్డాయి. ఒకవేళ అటవీశాఖ భవనాలను వినియోగించలేని పరిస్థితి ఉంటే ఇతర ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తే సబబుగా ఉండేది. ప్రస్తుతం అధిక శాతం గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేస్తూ నిర్ణయించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో ఎప్పటి లాగే అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటికి నెలనెలా కిరాయలు చెల్లిస్తున్న ప్రభుత్వం వీఎస్‌ఎస్‌ భవనాలను అందుకు వినియోగించుకుంటే సబబుగా ఉం టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికారులు కృషి చేస్తే భవనాలు వినియోగంలో ఉండడంతోపాటు వాటి స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వరకు వన సంరక్షణ సమితి భవ నాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.. అప్పట్లోనే లక్షలు వెచ్చించి ఈ భవనాలను నిర్మించారు. భవనాలన్నీ గ్రామాలను ఆనుకొని ఉన్నాయి. ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ స్థలాలు ఆక్రమణకు గురి అవుతున్నాయి. ఒక్కో గుం ట ధర కనీసం రూ. 5 లక్షలు పలుకుతుండడంతో కొందరు వ్యక్తులు స్థలాలను గుట్టు చప్పుడు గాకుండా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలో 26 జూన్‌ 2000 సంవత్సరంలో వీఎస్‌ఎస్‌ భవనాన్ని నిర్మించారు. అప్పటి పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యురాలు సుగుణకుమారి, అప్పటి లక్షెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ భవనం పరిధిలో దాదాపు నాలుగు గుంటల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల భవనం తోపాటు స్థలాన్ని కొందరు గుట్టు చప్పుడు గాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వీఎస్‌ఎస్‌ భవనాలు, స్థలాలు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది.

అందుబాటులో లేని రికార్డులు..
వీఎస్‌ఎస్‌ భవనాలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులు అటవీశాఖ అధికారుల వద్ద అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తు తం జిల్లాలో ఎక్కడా కానరావడం లేదు. వీఎస్‌ఎస్‌ భవనాల రికార్డుల కోసం ‘ఆంధ్రజ్యోతి’ వారం రోజులుగా జిల్లా అటవీశాఖ కార్యాల యంలో సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రికార్డులు అందు బాటులో లేవని స్వయంగా అధికారులే చెబుతుండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాకు సంబం ధించిన రికార్డులను శాఖ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రికార్డులు ఇంతవరకు జిల్లాకు చేరలేదు. అసలు జిల్లాలో వీఎస్‌ఎస్‌ భవనాలు ఎన్ని ఉన్నాయో కూడా అటవీ అధికారులకే తెలియని పరిస్థితి నెల కొందంటే అతిశయోక్తికాదు. అటవీ సంపద రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల వైఖరిలో మాత్రం  మార్పు రావడం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-12-27T03:44:09+05:30 IST