తగ్గుతున్న తృణధాన్యాల సాగు

ABN , First Publish Date - 2021-09-04T04:44:05+05:30 IST

వర్షాధార పంటలకు జిల్లాలోని మారుమూల మండలాలను కేరాఫ్‌గా చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం మండలంలో చిరు(తృణ) ధాన్యాల పంటల సాగు అంతరించి పోతోంది. ఒకప్పుడు విస్తారంగా పండించిన చిరుధాన్యాలను వదిలి వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

తగ్గుతున్న తృణధాన్యాల సాగు

- కొర్రలు, సజ్జలు, రాగులపై రైతుల అనాసక్తి

- ఎక్కడా ఎకరం మించి సాగు చేయని రైతులు

- వాణిజ్య పంటలపైనే ఆసక్తి

- ప్రభుత్వం నుంచి రైతులకు అందని ప్రోత్సాహం

చింతలమానేపల్లి, సెప్టెంబరు 3: వర్షాధార పంటలకు జిల్లాలోని మారుమూల మండలాలను కేరాఫ్‌గా చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం మండలంలో చిరు(తృణ) ధాన్యాల పంటల సాగు అంతరించి పోతోంది. ఒకప్పుడు విస్తారంగా పండించిన చిరుధాన్యాలను వదిలి వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రజల ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు రావడం మరెన్నో కారణాలతో రైతులు చిరుధాన్యాల సాగుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. దశాబ్దం క్రితం వరకు అక్కడక్కడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో సాగైనా ప్రస్తుతం ఎకరం లోపే చిరు ధాన్యాలు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. 

చింతలమానేపల్లి మండలంలో మొత్తం 26,694 ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, ఆహార ధాన్యాలు 4945.38 ఎకరాలు, వాణిజ్య పంటలు 20,983.68 ఎకరాలు, పప్పు ధాన్యాలు 765ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే రాగులు, కొర్రలు, సజ్జలు వంటి పంటలు ఎక్కడా ఎకరాల్లో సాగవడం లేదు. ఒక వేళ సాగు చేసినా రైతులు తమ సొంతానికి ఎరకం, అరెకరం లోపు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వాణిజ్య పంటలదే పెత్తనం..

పంటల సాగు విస్తీర్ణంలో అధికభాగం వాణిజ్య పంటలే ఆక్రమిస్తు న్నాయి. ఈ పంటలతో అధిక లాభాలు రావడం, ఆధునిక పద్ధతులతో సాగు చేసే అవకాశం ఉండడంతో రైతులు ఈ పంటల వైపే ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా పత్తి పంట సాగు గణనీయంగా పెరిగింది. చింతలమానేపల్లి మండలంలో దశాబ్దం క్రితం ఐదు వేల ఎకరాల లోపు మాత్రమే పత్తి పంటలు సాగవగా, గతేడాది 21,615 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం 20,983 ఎకరాల్లో పత్తి పంట సాగవుతున్నట్లు అధి కారులు చెబుతున్నారు. ఈ పంటలతో అధిక పెట్టుబడులు అదే విధంగా దిగుబడులు వస్తున్నాయి. దీంతో ఆదాయం సమకూరుతోంది. కాలం కలిసి రాక కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి ఖర్చులు రాక రైతులు ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. అయినా వాణిజ్య పంటల సాగు వైపే రైతులు పరుగులు పెడుతున్నారు. 

అధిక పోషక విలువలు..

చిరు ధాన్యాలు, పప్పుదినుసుల్లో అధిక పోషక విలువలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి చిరు ధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్‌, ఆస్తమా, కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల తీవ్రత పెరుగకుండా చిరు ధాన్యాలు పని చేస్తాయి. కరోనా పరిస్థితుల్లో చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకొని ఎందరో బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్న సందర్భాలున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన చిరుధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహించి,  గిట్టుబాటు ధరను, అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తే సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

రైతులు ముందుకు రావాలి..

- రాజేష్‌, ఇన్‌చార్జీ మండల వ్యవసాయ అధికారి, చింతలమానేపల్లి

చిరుధాన్యాల సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తే మా వంతు సహాయం అందజేస్తాం. ప్రస్తుతం మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్‌ ఉంది. వీటిలో పోషక విలువలు కూడాఎక్కువే. చిరు ధాన్యాల సాగుతో పెట్టుబడులు భారీగా తగ్గుతాయి. రసాయన ఎరువులు, మందుల వాడకం కూడా తగ్గుముఖం పడుతుంది. 

Updated Date - 2021-09-04T04:44:05+05:30 IST