దర్జాగా దందా
ABN , First Publish Date - 2021-12-29T06:47:54+05:30 IST
జిల్లాలో మొరం అక్రమ తవ్వకాలతో మైనింగ్ మాఫియ మరింత రెచ్చి పోతోంది. అధికారుల అలసత్వంతో మొరం, కంక ర, ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ అమ్మేసుకుంటున్నారు. రోజురోజుకు పెరిగి పోతున్న పట్టణీకరణతో మొరం, కంకర, ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు అక్రమార్కులు అదేపనిగా తవ్వేస్తూ అక్రమ సంపాదనకు ఎగబడుతున్నా రు.
జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
విచ్చలవిడిగా మొరం అక్రమ తవ్వకాలు
క్వారీలకు అధికారిక అనుమతులు కరువు
అక్రమ సంపాదనకు ఎగబడుతున్న అక్రమార్కులు
మైనింగ్ శాఖ అధికారుల మౌనం.. కరువవుతున్న పర్యవేక్షణ
సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపం
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
తాజాగా బోథ్ మండలంలో 9 ట్రాక్టర్లు, ఒక టిప్పర్ పట్టివేత
ఆదిలాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) జిల్లాలో మొరం అక్రమ తవ్వకాలతో మైనింగ్ మాఫియ మరింత రెచ్చి పోతోంది. అధికారుల అలసత్వంతో మొరం, కంక ర, ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ అమ్మేసుకుంటున్నారు. రోజురోజుకు పెరిగి పోతున్న పట్టణీకరణతో మొరం, కంకర, ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు అక్రమార్కులు అదేపనిగా తవ్వేస్తూ అక్రమ సంపాదనకు ఎగబడుతున్నా రు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. మైనింగ్ అధికారులు మౌనం వహించడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ తవ్వకాలను కట్టడి చేయక పోవ డంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే భారీగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. మైనింగ్ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే అక్రమంగా తవ్వి వదిలేసిన మొరం, కంకర క్వారీలలో ప్రమాదవశాత్తు పడి పలువురి ప్రాణాలు గాలిలో కలిశాయి. సంబంధిత క్వారీ యజమానులపై కనీసస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అడపా దడపగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప కార్యాలయం వదిలి బయటకు వచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నిత్యం విచ్చలవిడిగా పట్టపగలే అక్రమ దందా సా గుతున్నా.. అధికారులు నోరు మెదుపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నేరడిగొండ, ఉట్నూర్, గుడిహత్నూర్, బోథ్, తలమడుగు, ఆదిలాబాద్ మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బోథ్ మండలం లో తొమ్మిది ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే స్పష్టమవుతుంది. అప్పుడప్పు డు పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. రెవెన్యూ అధికారులు నామమాత్రం గానే జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. అయినా మైనింగ్ శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విడ్డూరం. ఇప్పటికే కలెక్టర్ ఈ విషయమై సంబంధిత మైనింగ్ శాఖ అధికారులను హెచ్చరించినా వారి తీరు మాత్రం మారడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులే మైనింగ్ మాఫియాకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తమకేమీ పట్టనట్లుగా అధికారులు
నిత్యం జిల్లావ్యాప్తంగా అధికారుల కళ్ల ముందే మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. కళ్లు మూసుకుంటున్నారనే విమర్శలు ఉ న్నాయి. కొందరు రైతులు పంటల సాగుకు పనికి రాని అసైన్డ్, ప్రభుత్వ భూములను మైనింగ్ మాఫియాకు అప్పచెప్పడంతో యథే చ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ఎకరాన రూ.4-5 లక్షల వరకు అమ్మే సుకుంటున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో మిగిలిపోయిన అసైన్డ్ భూములపై మైనింగ్ మాఫియా కన్నుపడి బొందలగడ్డగా మారుతున్నాయి. జిల్లాలో ఎక్కడ ఇసుక, కంకర, మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని మైనింగ్ శాఖ అధికారులే చెబుతున్నా.. ఈ అక్రమ దందాను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో? వారికే తెలియాలి మరి. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా.. చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ప్రధానంగా తలమడుగు మండలం కజ్జర్ల, మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పరిసర ప్రాంతా ల్లో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే జిల్లాలో జరుగుతున్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు మొరం తరలిస్తున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. ఇదంతా బహిరంగ రహస్యమేనంటూ తేలికగా తీసిపారేస్తున్నారు.
హెచ్చరించినా.. మారని తీరు
మొదటి నుంచి మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై విమర్శలే వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఎమ్మెల్యేలు హెచ్చరించినా.. వారి తీరు మారడం లేద న్న వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే మైనింగ్ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. కొందరు అక్రమార్కులు దీనినే ఉపాధి మార్గంగా మల్చుకొని యథే చ్ఛగా దందా కొనసాగిస్తున్నా.. అధికారులు అడ్డు చెప్పకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడ డంతోనే అడ్డుకట్ట పడడం లేదంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు సహకరించ డం లేదని మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నా.. అయితే అది తమ పని కాదంటూ రెవెన్యూ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగి పోతూనే ఉంది. కొందరు అధికారులు మైనింగ్ మాఫియాతో సన్నిహితంగా ఉంటూ నెలవారి మాముళ్లకు అలవాటు పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అలసత్వంతో సర్కారు ఆదాయానికి భారీ గండి పడుతోంది. ఇకనైనా ఈ మొరం అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా సారించి అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
: రవిశంకర్, జిల్లా మైనింగ్ శాఖ అధికారి, ఆదిలాబాద్
జిల్లాలో జరుగుతున్న మొరం అక్రమ తవ్వకాలపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. బోథ్‌లో స్వాధీనం చేసుకున్న మొరం వాహనాల విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాహనాలను సీజ్ చేస్తాం. అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటాం. అక్రమ తవ్వకాలపై సంయుక్తంగా దాడులు చేసేందుకు ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లను కోరడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న ఇసుక, మొరం తవ్వకాలకు ఎక్కడా కూడా అనుమతులు లేవు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో తవ్వకాలు జరిపితే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
పిప్పల్‌ధరి రూట్లో పలు వాహనాల పట్టివేత
బోథ్: మండలంలోని పిప్పల్‌ధరి వెళ్లే రూట్లో ఉన్న గుట్టల నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న 9ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ను సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మొరం తవ్వకాలను అక్రమంగా చేపట్టాలరని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఐ దశరథ్ వాటిని పట్టుకున్నారు. కాగా మొరం తవ్వకాలను చేసిన జేసీబీని విడిచి పెట్టి తమ ట్రాక్టర్లను పట్టుకోవడమేంటని ట్రాక్టర్ యజమానులు మంగళవారం ఉదయం రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై స్థానిక ఎస్సై దివ్యభారతిని వివరణ కోరగా, పట్టుకున్న వాహనాలను మా కస్టడికి ఇవ్వడంతో వాటిని ఇక్కడ ఉంచామని తెలిపారు.