రూ.కోట్ల నిధులు మట్టిపాలు!

ABN , First Publish Date - 2021-12-30T05:38:36+05:30 IST

మండలంలోని ఆదిలాబాద్‌-కరంజి(టి) 50కి.మీ.ల ఆర్‌అండ్‌బీ రోడ్డు జిల్లాలోనే పెద్ద విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇప్పటికే ఈ రోడ్డు గుంతలు తేలి అధ్వానస్థితికి చేరింది. ఇటీవల కాలంలో మంజూరైన రూ.6కోట్లతో రోడ్డు మరమ్మతులు, బీటీ పనులు చేయాల్సిన అధికారులు..

రూ.కోట్ల నిధులు మట్టిపాలు!
సెంటర్‌ సాంగ్వి వద్ద నాసిరకం మట్టితో రోడ్డు పూర్తి చేసిన దృశ్యం

భీంపూర్‌ ఆర్‌అండ్‌బీ డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత కరువు 

పనికిరాని మట్టితో పనులు 

పర్యవేక్షణ లేదు.. కాంట్రాక్టరే సర్వం

భీంపూర్‌, డిసెంబరు 29: మండలంలోని ఆదిలాబాద్‌-కరంజి(టి) 50కి.మీ.ల ఆర్‌అండ్‌బీ రోడ్డు జిల్లాలోనే పెద్ద విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇప్పటికే ఈ రోడ్డు గుంతలు తేలి అధ్వానస్థితికి చేరింది. ఇటీవల కాలంలో మంజూరైన రూ.6కోట్లతో రోడ్డు మరమ్మతులు, బీటీ పనులు చేయాల్సిన అధికారులు.. అవన్నీ పక్కకు పెట్టే ఈ నిధులతో లక్ష్మిపూర్‌ నుంచి భీంపూర్‌ వరకు 4కి.మీ.ల వరకు డబుల్‌ రోడ్‌ విస్తీర్ణ పనులు, బీటీ పనులు చేసే అవసరం లేని పనులను పెట్టుకున్నారు. చెడిపోయిన రోడ్డును బాగు చేయండి సారూ!! అంటే బెత్తెడు డబుల్‌ రోడ్డు పనులు చేస్తే ప్రయోజనం ఏమిటి అని ఇప్పటికే మండల ప్రజలు మొత్తుకున్నా.. డబుల్‌ రోడ్డు  పనులనే చేస్తున్నారు. పోని ఈ పనులైనా సరిగ్గా చేస్తున్నారా?! అంటే అదీ లేదు. రోడ్డుపై నిబంధనల మేర పోయాల్సిన క్వాలిటి మొర్రానికి బదులు పనికి రాని మట్టిని తెచ్చి.. ఇదే రోడ్డు అని చూపుతున్నారు. పనులు మొదలై నెల కావొస్తున్నా.. అక్కడ ఒక్క ఇంజినీరు పర్యవేక్షించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న నిపాని దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక మండలంలోని కమట్‌వాడకు చెందిన యువకుడు అందులో పడి దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు 10ఏళ్ల పాటు మన్నికగా ఉండాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిస్తే బాగుంటుంది.

Updated Date - 2021-12-30T05:38:36+05:30 IST