గులాబీ తోటలో పత్తిముళ్లు
ABN , First Publish Date - 2021-11-28T06:38:10+05:30 IST
అధికార టీఆర్‌ఎస్ పార్టీ సారంగపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేసిన నామినేషన్ ఉప సంహరణ వ్యవహారం ప్రస్తుతం మలుపులు తిరుగుతోంది.

నామినేషన్ తిరస్కరణపై కోర్టుకెక్కనున్న పత్తిరెడ్డి
ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ
నిర్మల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అధికార టీఆర్‌ఎస్ పార్టీ సారంగపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేసిన నామినేషన్ ఉప సంహరణ వ్యవహారం ప్రస్తుతం మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రతిష్ఠాత్మకం అయిన నేపథ్యంలో పత్తిరెడ్డి నామినేషన్ ఉపసంహరణ అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగను రాజేసేందుకు తోడ్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్‌ల ఉపసంహరణ చివరిరోజు రాజేశ్వర్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా జిల్లా కలెక్టర్‌కు తన ప్రతినిధి ద్వారా అందజేసిన లేఖ వివాదాస్పదమవుతోంది. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఒత్తిళ్లకు దూరంగా ఉండేందుకు రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. కాగా రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరణ విషయాన్ని ఇతరుల ద్వారా తెలుసుకున్న రాజేశ్వర్‌రెడ్డి వెంటనే జిల్లా ఎన్నికల అధికారితో మాట్లా డి తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, తన పేరిట ఫోర్జరీ లేఖను సృష్టించారని ఫిర్యాదు చేశారు. వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేసిన రాజేశ్వర్‌రెడ్డి ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సైతం ఇదే తరహా ఫిర్యాదును అందించారు. తాను పోటీలో కొనసాగుతానని, నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని ఆయన లేఖలో స్పష్టం చేశా రు. ఆ తరువాత శనివారం రాజేశ్వర్‌రెడ్డి దీనిపై ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన సోమవారం రాష్ట్రహైకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు సమాచారం. మొత్తం ఈ వ్యవహారమంతా అటు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చిక్కులు సృష్టించే అవకాశాలున్నాయన్న ప్రచారం మొదలైంది. ఒకవేళ ఎన్నిక జరిగిన ఆ తరువాత ఫలితం వచ్చిన ఈ ఎన్నిక కోర్టు తీర్పుపై ఆధారపడే అవకాశాలున్నాయంటున్నారు. అవసరమైతే ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా రాజేశ్వర్‌రెడ్డి అందజేసినట్లుగా చెబుతున్న లేఖ ఫోర్జరీ అని తేలితే మాత్రం కొత్త పరిణామాలు తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫోరెన్సిక్స్ నివేదిక ఎన్నికపై ప్రభావం చూపవచ్చంటున్నారు. ఇదిలా ఉండగా అధి కార టీఆర్‌ఎస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారంతో పాటు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారాన్ని కూడా సీరియస్‌గా తీసుకోబోతోందన్న వాదనలు మొదలయ్యాయి. పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీని నుంచి బహిష్కరించడం లేదా ఆయనపై న్యాయపరమైన చర్యలు సైతం తీసుకునేందుకు ఆ పార్టీ వర్గాలు సిద్దమవుతున్నాయంటున్నారు. అయితే మంత్రికి సన్నిహితునిగా కొనసాగిన పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. నిన్నటి వరకు మంత్రితోనూ, పార్టీలోని మిగతా సీనియర్‌లందరితోనూ సఖ్యతగా ఉన్న పత్తిరెడ్డి అనూహ్యంగా పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ వేయడం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. పత్తిరెడ్డి నామినేషన్ వ్యవహారం వెనక బలమైన సమీకరణలు ఉన్నాయన్న ప్రచారం కూడా మొదలైంది. బీజేపీ నాయకులతో కూడా పత్తిరెడ్డి కొంతకాలం నుంచి టచ్‌లో ఉంటున్నారని చెబుతుండగా మరోవాదన సైతం కొత్తగా తెరపైకి వస్తోంది. టీఆర్‌ఎస్‌లోని సీనియర్ అసంతృప్తి వాదుల మద్దతు రాజేశ్వర్‌రెడ్డికి బలంగా ఉందంటున్నారు. ఇలా రకరకాల ఉహాగానాలకు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారం తెర తీస్తోంది. అయి తే జిల్లా ఎన్నికల అఽధికారి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దండే విఠల్‌తో పాటు మరో అభ్యర్థి పుష్పరాణి మాత్రమే పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎన్నిక అని వార్యం కానుందని, అయితే పత్తిరెడ్డి వ్యవహారంపై అటు ఎన్నికల సంఘం గాని, రాష్ట్ర హైకోర్టు నుంచి వెలువడే తీర్పు గాని ఈ ఎన్ని కపై ప్రభావం చూపవచ్చంటున్నారు.
మలుపు తిరగనున్న ఉప సంహరణ వ్యవహారం
కాగా పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం అటు టీఆర్‌ఎస్ పార్టీలో ఇటు అధికారిక వర్గాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. పార్టీ పరంగా పత్తిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి వేరే వ్యక్తి ద్వారా నామినేషన్‌ను ఉప సంహరించుకున్నట్లుగా చిత్రీకరించారని ఫిర్యాదు చేసిన ఆయన సంబంధిత అధికారులకే కాకుండా పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. అలాగే ఆయన రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజేశ్వర్‌రెడ్డి కూడా స్పష్టతనిస్తున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేతల ఒత్తిళ్ల మేరకే ఈ వ్యవహారమంతా జరిగిందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా దీనిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల సంఘం సైతం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన పత్తిరెడ్డి ప్రస్తుతం వ్యవహారిస్తున్న తీరుపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పత్తిరెడ్డి వెంట ఎవరున్నారనే అంశం ఆసక్తిని రేకేత్తిస్తోంది. మొత్తానికి ఎన్నికలు జరిగేలోపు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న పత్తిరెడ్డి
ఇప్పటికే తన పేరిట జారీ అయిన ఫోర్జరీలేఖపై ఆదిలాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం రాష్ట్ర హైకోర్టును సైతం ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్న ఆయన తనకు జరిగిన అన్యాయంపై కోర్టులో ఫిర్యాదు చేయడమే కాకుండా బాధ్యులపై చర్యలు సైతం తీసుకోవాలని కోరనున్నారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా జరిగిందని, అలాగే ఒత్తిళ్ల ప్రలోభాలు కూడా ప్రభావం చూపాయని ఆయన ఆరోపిస్తున్నారు. తన అభ్యర్థిత్వం ఆమోదింపబడే వరకు వదిలిపెట్టేది లేదంటూ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఎన్నికలు జరిగేలోపు తీర్పును జారీ చేస్తేనే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుందని, లేనట్లయితే యఽధావిధిగా ఎన్నిక జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నిక జరిగిన కోర్టు తుది తీర్పులో రాజేశ్వర్‌రెడ్డి లేఖ ఫోర్జరీ అని తేలితే మాత్రం జరిగిన ఎన్నిక కూడా రద్దయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ పరిణామాలన్నీ రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతుండడమే కాకుండా రాజకీయ వర్గాల్లో హాట్‌టాఫిక్ అవుతున్నాయి.