కష్టాల కడలిలో పత్తి రైతు

ABN , First Publish Date - 2021-12-20T04:00:44+05:30 IST

ఎన్నో ఆశలతో సాగుకు శ్రీకారం చుట్టిన అన్నదాతలకు కాలం కలిసి రాక నష్టాలే మిగులుతున్నాయి. సాగు కోసం అప్పు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు వాణిజ్యపంటైన పత్తి వైపు మొగ్గు చూపుతారు.

కష్టాల కడలిలో పత్తి రైతు

- తగ్గిన దిగుబడి

- రైతులకు కలిసిరాని కాలం

- వర్షాలతో తీవ్రనష్టం

- అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు

బెజ్జూరు, డిసెంబరు 19: ఎన్నో ఆశలతో సాగుకు శ్రీకారం చుట్టిన అన్నదాతలకు కాలం కలిసి రాక నష్టాలే మిగులుతున్నాయి. సాగు కోసం అప్పు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు వాణిజ్యపంటైన పత్తి వైపు మొగ్గు చూపుతారు. ఈ ఏడాది 3.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఈ యేడు వర్షాల కారణంగా ఆశించిన స్థాయిలో కాత కాయకపోవడంతో దిగుబడి అమాంతం తగ్గింది.

కొంపముంచిన అధిక వర్షాలు..

వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన మేరకు వర్షాలు కురవడంతో రైతులు ఆనందంగా పత్తి విత్తారు. విత్తనాలు మొలకెత్తిన దశ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. పత్తి పంట చేతికచ్చే సమయంలో అధికంగా వర్షాలు కురవడంతో పత్తికి అన్ని రకాల నష్టాలు మొదలయ్యాయి. ఏకదాటిగా కురిసిన వర్షాల కారణంగా పత్తికి తెగుళ్లు సోకాయి. దీంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడులకు వచ్చిన దిగుబడికి వ్యత్సాసం చూస్తే కనీసం సాగు కోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని రైతులు ఆవేదన వెలిబుచ్చారు.

ప్రాణహిత పరివాహత తీరంలో తీరని నష్టం..

జిల్లాలోని బెజ్జూరు, కౌటాల, దహెగాం, సిర్పూర్‌(టి) తదితర మండలాల్లో వరదల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. వీరికి ఏనాడు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. ప్రాణహిత పరిసర ప్రాంతాల్లో వరిపంటకు వేసిన రైతులు కూడా అధికంగానే నష్ట పోయారు. అధికారులు మాత్రం పంట నష్టం సర్వేలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సర్వేలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం మాత్రం అందలేదు.

పెరిగిన కూలీల రేట్లు..

ప్రస్తుతం పత్తి పంట ఏరివేత సీజన్‌ కావడంతో రైతులకు కూలీలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పత్తి ఏరేందుకు ప్రస్తుతం జిల్లాలో కిలోకు రూ.10 నుంచి 15ఇస్తున్నా కూలీల కొరత వేధిస్తోంది, అసలే పత్తి దిగుబడి లేక సతమతం అవుతుంటే కూలీ రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటేటా పత్తి ఏరేందుకు కూలీల కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి బాగుంటే ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని ఈసారి అధిక వర్షాల కారణంగా మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అప్పులు మిగిలాయి..

- గుర్లె శ్యాంరావు, రైతు, ఎల్కపల్లి

నాకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశాను. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడులు కూడా రాలేదు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి.

ప్రభుత్వం ఆదుకోవాలి..

- నికాడి వెంకటి, రైతు, బెజ్జూరు

పత్తి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఏటా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోతున్న మాకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందజేయడం లేదు.

Updated Date - 2021-12-20T04:00:44+05:30 IST