సరికొత్తగా నాగోబా ఆలయ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2021-02-06T05:19:08+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ నిర్మాణం ఆదివాసీ, సంస్కృతి, సంప్రదాయాలు కల్లకు కట్టేలా మెస్రం గిరిజనులు సొంత డబ్బులతో ఆలయ నిర్మాణాన్ని సరికొత్తగా చేపడుతున్నారు.

సరికొత్తగా నాగోబా ఆలయ నిర్మాణ పనులు
కొనసాగుతున్న నిర్మాణ పనులు

ఉట్నూర్‌/ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 5: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ నిర్మాణం ఆదివాసీ, సంస్కృతి, సంప్రదాయాలు కల్లకు కట్టేలా మెస్రం గిరిజనులు సొంత డబ్బులతో ఆలయ నిర్మాణాన్ని సరికొత్తగా చేపడుతున్నారు. మెస్రం వంశస్తుల ఆధ్వ ర్యంలో చందాలు చేసుకొని మూడేళ్ల క్రితం నాగోబా ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాగోబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా రాతి కట్టడాలతో నిర్మించుకుంటున్నారు. మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి ప్రతిబించేలా నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం వంశీయుల చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శన మిస్తున్నాయి. నాటి గోండ్వాన రాజ్యం చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి. 2005లో రూ.5లక్షలతో నాగోబా ఆలయాన్ని విస్తరించారు. మెస్రం వంశీయులు భావించిందే తడవుగా నాగోబా ఆలయ చరిత్రను భావితరాలకు పదిలం చేయాలని భావించి 2017 జూన్‌లో రూ.3 కోట్లతో ఆలయ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రూప్‌ లెవల్‌ వరకు పనులు జరిగాయి. గర్భగుడిలకు మెస్రం వంశీయులే విరాళాలు ఇస్తుండగా మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందిస్తోంది. దీనికోసం రూ.3.50 కోట్లు ఖర్చు అవుతున్నట్లు మెస్రం వంశీయులు అంచనా వేశారు. ప్రతి మెస్రం కుటుంబానికి యేడాదికి రూ.5వేలు, ప్రభుత్వ ఉద్యోగులు రూ.10వేలు, ప్రజాప్రతినిధులు రూ.7500 చొప్పున చందాలు అందించాలని మెస్రంలు నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.2.60 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 70 శాతం పనులు పూర్తి కావస్తున్నాయి. 

తాత్కాలిక ఆలయంలోనే పూజలు..

రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ సారి కూడా తాత్కాలిక ఆలయంలోనే నాగోబా పూజలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 11న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. 1942కు ముందు నాగోబా దేవతకు చెక్కు పక్కన పూజలు చేసేవారు. 1942లో చిన్న మందిరం నిర్మించారు. 1977లో ఇటుక రాళ్లతో నిర్మించారు. 1995లో టీడీపీ హయాంలో గిరిజన మంత్రిగా పనిచేసిన గోడాం నగేష్‌ ఆలయ నిర్మాణం కోసం రూ.4.80 లక్షలు మంజూరు చేయించారు. నిర్మాణంలో ఉన్న ఆలయ పనులను పటేల్‌ వెంకట్‌రావు ఆధ్వర్యంలో చేపడుతుండగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లగడ్డ శిల్పులతో పనులు సాగుతున్నాయి.

Updated Date - 2021-02-06T05:19:08+05:30 IST