పరిహారం గూళ్ళు...!

ABN , First Publish Date - 2021-10-20T03:50:20+05:30 IST

బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రతిపాదిత మెగా ఓసీల్లో మాదారం ఉపరితల గని ఒకటి. మూతపడిన గనుల భూభాగాల్లోనే ఓసీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సర్వే జరుగుతోంది. అయితే ఓసీలో ముంపునకు గురయ్యే భూముల్లో మండలంలోని పోచంపల్లి గ్రామం ఉంది. సింగరేణి సంస్థ ముంపు పరిహారం కోసం పోచంపల్లిలో స్థలాలు కొనుగోలు చేసి చకచకా ఇండ్లు నిర్మిస్తున్నారు.

పరిహారం గూళ్ళు...!
ఇటీవలే పూర్తయిన ఇండ్లు

పోచంపల్లి శివారులో యథేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు

ఓసీ పరిహారం కోసం ఏర్పాటవుతున్న కాలనీ!

పట్టించుకోని అధికారులు

తాండూర్‌, అక్టోబరు 19:  బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రతిపాదిత మెగా ఓసీల్లో మాదారం ఉపరితల గని ఒకటి.  మూతపడిన గనుల భూభాగాల్లోనే ఓసీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సర్వే జరుగుతోంది. అయితే ఓసీలో ముంపునకు గురయ్యే భూముల్లో మండలంలోని పోచంపల్లి గ్రామం ఉంది. సింగరేణి సంస్థ ముంపు పరిహారం కోసం పోచంపల్లిలో స్థలాలు కొనుగోలు చేసి చకచకా ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిలో

పోచంపల్లి శివారులో 1996లో సర్వే నెంబరు 15లో ప్రభుత్వం దళితులకు భూములు కేటాయించింది. ఆరు కుటుంబాలకు 12 ఎకరాల భూమి కేటా యించగా అనంతరం ఆ భూమిని కుటుంబ సభ్యులు 20 భాగాలుగా చేసుకున్నారు. 2017లో భూ ప్రక్షాళనలో వారికి భూములను క్రమబద్ధీక రించే సమయంలో ఇండ్ల స్థలాల కింద మార్చారు. పేదలకు ఇచ్చిన భూముల్లో క్రయవిక్రయాలు నిషేధం. ఇప్పుడు ఓసీ ముంపు కింద పరిహారం పొందేందుకు తాండూర్‌, గోలేటి, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుంటున్నారు.  అధికారులు మాత్రం తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్న కొందరు ఇంటి నెంబర్ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు  చేసుకున్నారు. అయితే వచ్చిన 16 దరఖాస్తులను తిరస్కరించినట్టు కార్యదర్శి సౌందర్య తెలిపారు. ఇంటి నెంబరు వస్తే అది ప్రభుత్వ భూమైనా కూడా పరిహారం వస్తుందనే నమ్మకంతో ఇంటి నెంబర్ల కోసం ఖర్చుకు కూడా వెనకాడకుండా బేరాలు సాగిస్తున్నట్టు తెలిసింది. 

ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్న అధికారులు

తాండూర్‌ మండలంలో రాజీవ్‌నగర్‌ గ్రామపంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. ఈ పంచాయతీలోని 90శాతం ఇండ్లు లావాణీ పట్టాల్లోనే ఉన్నాయి. 25 ఏళ్లుగా ఈ భూముల్లో పలువురు స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. ఇటీవల కొందరు చేసిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నిర్మాణాలు అక్రమమంటూ పంచాయతీ సిబ్బంది నోటీసులు అందజేశారు.

ఇదే మండలంలోని పోచంపల్లిలో మాత్రం అధికారులు భిన్నంగా వ్యవహ రిస్తున్నారు. మాదారం పంచాయతీలోని పోచంపల్లిలో నాలుగైదు నెలల కాలంలోనే దాదాపుగా 70 ఇండ్లు వెలిశాయి. వేగంగా నిర్మాణాలు పూర్తవుతు న్నాయి. నూతనంగా ఏర్పాటవుతున్న మాదారం ఉపరితల గని ముంపులో వచ్చే పరిహారం పొందేందుకు ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో వెలుస్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

ఎందుకింత నిర్లక్ష్యం

మండలంలోని కిష్టంపేట, రాజీవ్‌నగర్‌, తాండూర్‌ పంచాయతీల్లో అసైన్డ్‌, సీలింగ్‌ భూముల్లో నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ పూర్తయిన నిర్మాణాల విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్న అధికారులు, పోచంపల్లి విషయంలో ఎందుకు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఓ చోట అలా.. ఇక్కడ మాత్రం ఎందుకిలా అనే ప్రశ్నలు ప్రజల మనసుల్లో మెదలుతున్నాయి. 

 

Updated Date - 2021-10-20T03:50:20+05:30 IST