నిర్మించారు.. వదిలేశారు

ABN , First Publish Date - 2021-03-22T05:35:09+05:30 IST

పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా ప్లాన్‌ చేసింది. కానీ జిల్లాలో ఒకటి, రెండు గ్రామ పంచాయతీల్లో మినహా ఎక్కడా సెగ్రిగేషన్‌ షెడ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.

నిర్మించారు.. వదిలేశారు

గ్రామాల్లో నిరుపయోగంగా మారిన సెగ్రిగేషన్‌ షెడ్లు

నాసిరకం పనులతో బీటలు వారుతున్న నిర్మాణాలు

రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం

నీరుగారిపోతున్న ప్రభుత్వ లక్ష్యం

ఆదిలాబాద్‌, మార్చి21 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా ప్లాన్‌ చేసింది. కానీ జిల్లాలో ఒకటి, రెండు గ్రామ పంచాయతీల్లో మినహా ఎక్కడా సెగ్రిగేషన్‌ షెడ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఏదో ఊరి చివరన నిర్మించి వదిలేస్తున్నారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇప్పటి వరకు 332 షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే యేడాదిలో రూ.60వేల నుంచి లక్ష వరకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సర్పంచ్‌లు చెత్తవైపు దృష్టి సారించక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రూ.11.70 కోట్ల వ్యయం..

ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణం తప్పని సరి చేయడంతో సర్పంచ్‌లు ఆదరబాదరగా పనులను పూర్తి చేసి బిల్లులు జేబులో వేసుకున్నారు. కానీ వీటిని అందుబాటులోకి తీసుకురాక పోవడంతో నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇచ్చోడ మండలం ముఖ్ర(కె), నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌ గ్రామాంలోనే అడపా దడపాగా సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా చోట్ల నిరుపయోగంగానే మారి అధ్వానంగా తయారవుతున్నాయి. ఒక్కో షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50లక్షల నిధులు మం జూరు చేసింది. ఈ లెక్కన జిల్లాలో 468 సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలకు మొత్తం రూ.11కోట్ల 70లక్షల నిధులను ఖర్చు చేశారు. కానీ ఇప్పటి వరకు లక్ష రూపాయల ఆదాయాన్ని తిరిగి సంపాదించిన దాఖలాలే కనిపించడం లేదు. 

నిప్పుపెట్టి చేతులు దులుపుకుంటున్నారు..

చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేయాల్సి ఉండగా నిప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంపై సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బందికి ఏ మాత్రం అవగాహన లేకుండానే పోయింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో వేసి వేరు చేయకుండానే దహనంచేస్తున్నారు. దీంతో మరింత కాలుష్యానికి కారణమవుతుంది. చెత్త సేకరణకు ప్రత్యేకంగా ట్రాక్టర్లను అందించిన ప్రభుత్వం అవసరమైన సిబ్బందిని నియమించింది. అయినా అవగాహన లోపంతో తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు. ముఖ్యంగా మేజర్‌ గ్రామ పంచాయతీలైన ఇచ్చోడ, బోథ్‌, ఉట్నూర్‌, తలమడుగు తదితర గ్రామ పంచాయతీలలో సేంద్రియ ఎరువుల తయారీకి పుష్కలమైన అవకాశాలున్న సర్పంచ్‌లు, సిబ్బంది ఆ దిశగా దృష్టి సారించడమే లేదు. 

ప్రారంభానికి ముందే పగుళ్లు..

సెగ్రిగేషన్‌ షెడ్లను ఆదరబాదరగా నిర్మించి వదిలేయడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీటలు వారిన నిర్మాణాలకు పూతలు పూసి బిల్లులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయి నా అధికారులు అంతా సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఊరి చివరలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్‌ షెడ్లలో మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. షెడ్ల నిర్మాణాల సమయంలో క్యూరింగ్‌ చేయక పోవడంతో పగుళ్లు తేలి అధ్వానంగా కనిపిస్తున్నాయి. నిర్మించి వృథాగా వదిలేయడంతో ప్రారంభానికి ముం దే శిథిలమై పోతున్నాయి. అధికారులు, సర్పంచ్‌ల నిర్లక్ష్యం కారణంగానే పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన షెడ్ల నిర్మాణాలు అప్పుడే బీటలు వారి పోతున్నాయి.


అవగాహన కల్పిస్తున్నాం..

: శ్రీనివాస్‌ (డీపీవో ఆదిలాబాద్‌)

జిల్లాలో సెగ్రిగేషన్‌ షెడ్ల వినియోగంపై గ్రామ పంచాయతీలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నాం. మిగతా గ్రామాల్లో సేంద్రియ ఎరువుల తయారు చేసే విధానంపై అవగాహన కల్పించి గ్రామ పంచాయతీలకు మంచి ఆదాయ మార్గంగా మారు స్తాం. నిర్లక్ష్యం చేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకుం టాం. చెత్త సేకరణతో గ్రావుమ పంచాయతీల పారిశుధ్యంతో పాటు రైతులకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2021-03-22T05:35:09+05:30 IST