రక్త చరిత్ర

ABN , First Publish Date - 2021-12-30T05:36:19+05:30 IST

ఈ యేడు జిల్లాలో నేరాలు, ఘోరాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించడం లేదు. గ తేడుతో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. నేరాలు మాత్రం కట్టడి కావడం లేదు. మహారాష్ట్రతో జిల్లా సరిహద్దును కలిగి ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

రక్త చరిత్ర
నేరడిగొండ మండలం కుప్టి వద్ద బోల్తా పడిన వాహనాలు(ఫైల్‌)

జిల్లాలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు

ఈయేడు కలకలం రేపిన గుండాల గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలు

సరిహద్దు ప్రాంతాల్లో కొరవడిన నిఘా

అడ్డూ, అదుపు లేకుండా ‘మహా’ నుంచి నిషేధిత పదార్థాల సరఫరా

విచ్చలవిడిగా గంజాయి, గుట్కా విక్రయాలు

పలుమార్లు పోలీసులకు పట్టుబడినా.. మారని వ్యాపారుల తీరు

మహిళలపై తగ్గని వేధింపులు

గతేడుతో పోలిస్తే తక్కువ కేసులు నమోదు

జిల్లావ్యాప్తంగా రెండేళ్ల కాలంలో ‘నేరాలు- ఘోరాల’పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఆదిలాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఈ యేడు జిల్లాలో నేరాలు, ఘోరాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించడం లేదు. గ తేడుతో పోల్చుకుంటే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. నేరాలు మాత్రం కట్టడి కావడం లేదు. మహారాష్ట్రతో జిల్లా సరిహద్దును కలిగి ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సరిహద్దుల్లో కట్టడి చర్యలు, సరైన నిఘాను సారిచంక పోవడంతో నేరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అలాగే నిషేధిత పదార్థాల సరఫరా ఎక్కువగానే కనిపిస్తోంది. గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలుమార్లు దాడులు చేసి పట్టుకున్నా.. వ్యాపారుల తీరులో మార్పు కనిపించడం లేదు. అలాగే పలు పోలీసు స్టేషన్ల పరిధిలో కొందరు పోలీసు అధికారులు సివిల్‌ కేసుల్లో త లదూర్చుతూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా నేరడిగొండ, గుడిహత్నూర్‌, మావల, ఆదిలాబాద్‌ రూరల్‌, జైనథ్‌ మండలాల పరిధిలో 44వ జాతీయ రహదారిపై తరచూ  ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడు 20202తో పోల్చుకుంటే 2021లో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతుంది. 2020లో జిల్లావ్యాప్తం గా 2,839 కేసులు నమోదు కాగా 2021 డిసెంబర్‌ చివరి నాటికి 2,300 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది.

ఫ పెరిగిన మర్డర్‌ కేసులు

ఈ యేడు జిల్లాలో హత్యలు, ఆత్మహత్య ల కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గతేడు జిల్లావ్యాప్తంగా 11 హత్య కేసులు నమోదు కాగా, ఈ యేడు 14 కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా భూతగాదాలు, పాత కక్షలు, క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది. అలాగే రైతు ఆత్మహత్యలు 41తో పాటు వేధింపులు, కుటుంబ కలహాలు, ఇతర కారణాల చేత వందకు పైగా ఆత్మహత్యలు జరిగా యి. అలాగే ఆర్థిక నేరాలు గతేడు ఏడు కేసులు నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. రాజకీయ కక్షలు రగిలిపోతున్నాయి. పలు కేసుల్లో పోలీసులు దర్యాప్తును జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫ కలకలం రేపిన కత్తుల దాడి

ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో కత్తుల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు. కర్రలు, గొడ్డల్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగి బీభత్సాన్ని సృష్టించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పాత కక్షల కారణంగానే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఏ2 నిందితుడు పరారీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఈ కేసులో 53మందిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ఫ తగ్గని వేధింపుల పర్వం

మహిళల రక్షణకు కఠినమైన చట్టాలు ఉన్నా.. వేధింపులు మాత్రం తగ్గడం లేదు. గతేడుతో పోల్చుకుంటే ఈ యేడు మహిళలపై వేధింపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 2020లో జిల్లావ్యాప్తంగా 208 మహిళ వేధింపుల కేసులు నమోదు కాగా 2021లో 258  కేసులు నమోదయ్యాయి. అలాగే మైనర్‌ బాలికలను వేధించిన 40 మందిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశా రు. షీ టీమ్స్‌ పర్యవేక్షణలో మరో 35 కేసులు నమోదయ్యాయి. మహిళల రక్షణకు ప్రత్యేకమైన పోలీసు స్టేషన్లు, సిబ్బందిని నియమించిన మహిళలపై వేధింపులు ఆగడం లేదు. మహిళల చట్టాలపై అవగాహన కల్పించేందుకు సఖీ కేంద్రాల ద్వారా సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న మహిళలపై జరుగుతున్న మరెన్నో సంఘటనలు వెలుగు చూడడం లేదు. పరువు ప్రతిష్టలకు పోతున్న కొంతమంది మహిళలు పోలీసులను ఆశ్రయించకుండానే స్థానికంగా కులపెద్దల సమక్షంలో రాజీ పడుతున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తాం

: ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ, ఆదిలాబాద్‌

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. మట్కా, గుట్కా రూపు మాపేందుకు కార్యాచరణను రూపొందిస్తాం. గతం కంటే క్రైం రేట్‌ తగ్గుముఖం పట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికడతాం. ప్రజల్లో చట్టాలపై అవగాహన తెచ్చి నేరాలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారులకు తక్షణమే పరిష్కారం చూపుతూ న్యాయం జరిగేలా చూస్తాం. ఎలాంటి అవినీతి, అక్రమాలైనా మా దృష్టికి తెస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

జిల్లాలో కొన్ని ముఖ్యమైన కేసు వివరాలిలా..      

      నేరం      2020 2021

హత్య కేసులు    11 14

లోక్‌ అదాలత్‌ కేసులు      712 835

శిక్షపడిన కేసులు   768 641

మహిళ వేధింపుల కేసులు    208 258

ఫోక్సో కేసులు      44 40

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు      26 31

షీ టీం కేసులు       15 35

ఎన్డీటీఎస్‌ కేసులు       12 13

రోడ్డు యాక్సిడెంట్‌    243 231

ఎంవీ యాక్టు కేసులు 96,386              2,30,856

స్పీడ్‌ గన్‌ కేసులు   8,594 20,538

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు      496 862

మట్కాకేసులు       66 84

గుట్కాకేసులు      306 134

మిస్సింగ్‌ కేసులు      100 118

కలప స్మగ్లింగ్‌ కేసులు       04   01 

Updated Date - 2021-12-30T05:36:19+05:30 IST