లాక్‌డౌన్‌లో బెల్టు జోరు

ABN , First Publish Date - 2021-05-21T05:28:19+05:30 IST

లాక్‌డౌన్‌ పుణ్యమా అని గ్రామాల్లో బెల్ట్‌ దందా జోరుగా సాగుతోంది. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల వ్యాపారాలకు లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇవ్వడంతో ఉదయం 7గంటల నుంచే బెల్ట్‌షాపులు మందుబాబులతో కిటకిటలాడు తున్నాయి. అసలే వేసవి కాలం కావడంతో గ్రామాల్లో పెద్దగా వ్యవసాయ పనులు కూడా కనిపించడం లేదు. దీనికి తోడు ఉదయం 10దాటితే లాక్‌డౌన్‌ మొదలు కావడంతో గ్రామం దాటి బయటకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.

లాక్‌డౌన్‌లో బెల్టు జోరు

జిల్లాలో ఊపందుకుంటున్న అక్రమ విక్రయాలు

సరిహద్దు గ్రామాల్లో ఏరులై పారుతున్న దేశీదారు

అధిక ధరలకు అమ్మేసుకుంటున్న వ్యాపారులు

కొరవడుతున్న ఎక్సైజ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, మే20 (ఆంఽధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ పుణ్యమా అని గ్రామాల్లో బెల్ట్‌ దందా జోరుగా సాగుతోంది. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల వ్యాపారాలకు లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇవ్వడంతో ఉదయం 7గంటల నుంచే బెల్ట్‌షాపులు మందుబాబులతో కిటకిటలాడు తున్నాయి. అసలే వేసవి కాలం కావడంతో గ్రామాల్లో పెద్దగా వ్యవసాయ పనులు కూడా కనిపించడం లేదు. దీనికి తోడు ఉదయం 10దాటితే లాక్‌డౌన్‌ మొదలు కావడంతో గ్రామం దాటి బయటకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మందుబాబులు మద్యాన్ని ముందు వేసుకొని కాలక్షేపం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో అన్ని గ్రామాలు, కాలనీలో అడుగడుగున బెల్ట్‌ షాపులే కనిపిస్తున్నాయి. కిరాణా దుకాణాలతో పాటు ఇండ్లలోనూ మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ప్రతీ ఊరిలో ఒకటి, రెండు మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. వీడీసీలు వేలం పాటలు వేస్తూ అనధికారికంగా మద్యాన్ని అమ్మేసుకునేందుకు అవకాశం కల్పిస్తు న్నాయి. లాక్‌డౌన్‌ పరిస్థితులను ఆసరాగా చేసుకుని గ్రామాల్లో జోరుగా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు జరుపుతున్నా.. అక్రమ మద్యం అధిక ధరలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోవడమే లేదని మందుబాబులు వాపోతున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నోరు మెదపక పోవడంపై అన్ని అనుమానాలే తలెత్తుతున్నాయి.

ఉదయం 10 తర్వాత మారుతున్న ధరలు..

అసలే బెల్ట్‌షాపుల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తారు. ఎమ్మార్పీ రేట్లపై వీడీసీలు నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరుపుతారు. ఒక్కో బాటిల్స్‌పై రూ.10నుంచి రూ.30వరకు వసూలు చేస్తారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మరింత ధరలను పెంచుతు మద్యాన్ని విక్రయిస్తు న్నారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు ఉన్న మద్యం బాటిల్‌ ధర 10గంటల తర్వాత మరో రేటుగా మారిపోతోంది. ఉదాహారణకు రూ.200 ఉన్న ఎంసీ క్వాటర్‌ ధర రూ.250 వరకు పలుకుతోంది. ఇదేమిటని అడిగితే లాక్‌డౌన్‌లో చాలా రిస్క్‌ తీసుకొని అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులతో పాటు పోలీసులకు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుందని బహిరంగంగానే చెబుతున్నారు. అలాగే బీర్‌ బాటిల్స్‌పై కూలింగ్‌ చార్జీలతో పాటు లాక్‌డౌన్‌ చార్జీలను విధిస్తూ అధిక ధరలను వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌  పరిస్థితులతో అన్ని రకాల వ్యాపారాలు డీలా పడుతున్నా బెల్ట్‌షాపులకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుందనే చెప్పవచ్చు.

విచ్చలవిడిగా మద్యం అక్రమ అమ్మకాలు..

లాక్‌డౌన్‌ పరిస్థితులతో జిల్లాలో మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో దేశీదారు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బోథ్‌ మండలం సోనాల గ్రామ పంచాయతీ కొత్తకాలనీ పరిధిలో దేశీదారు విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. దేశీదారు విక్రయదారులకు ఓ మండల స్థాయి టీఆర్‌ఎస్‌ నేత అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎక్సైజ్‌, పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడడమే లేదంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికార పార్టీ నేత బెదిరింపులకు జంకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, బోథ్‌ మండలాల్లో దేశీదారు అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో నాటుసారా అమ్మకాలు ఊపందుకుంటున్నాయి.

అధికారుల తనిఖీలు కరువు.. 

జిల్లాలో బ్లాక్‌ మార్కెట్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారుల తనిఖీలు కరువవుతున్నాయి. ఉదయం 10గంటల వరకు వైన్స్‌ షాపుల నుంచి హోల్‌సెల్‌ అమ్మకాలు భారీగా జరుగు తున్నాయి. వైన్స్‌ షాపుల వద్ద నిఘా లేక పోవడంతో యజమానులు భారీగా మద్యం  అక్రమవిక్రయాలు జరుపుతున్నారు. అలాగే బెల్ట్‌షాపులో మద్యం ధరల నియంత్రణపై దృష్టి సారించక పోవడంతో మందుబాబులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కొన్ని మండలాల్లో బెల్ట్‌ షాపుల నుంచి నెల నెలా మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మండలాలపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. లాక్‌డౌన్‌ పరిస్థితులలో మద్యం ధరలు, అక్రమ మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడినట్లే కనిపిస్తోంది. విక్రయదారులపై దాడులు చేయక పోవడంతో అధిక ధరలకు అమ్మేస్తూ దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా మేజర్‌ గ్రామ పంచాయతీలలో ఉన్న బెల్ట్‌షాపుల నుంచి నెల వారీగా మామూళ్ల రూపంలో భారీగా వసూలు చేస్తూ వ్యాపారులకు పరోక్షంగా అండదండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇస్తే తనిఖీలు చేసే సమయంలో ముందస్తు సమాచారాన్ని ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం మొద్దునిద్రలోనే కనిపిస్తున్నారు.

Updated Date - 2021-05-21T05:28:19+05:30 IST