అందని ఆసరా

ABN , First Publish Date - 2021-12-28T05:38:12+05:30 IST

ఆసరా పింఛన్‌ అందని ద్రాక్ష లా మారింది.. అనేక మంది అర్హులు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు.

అందని ఆసరా
వికలాంగుల పించన్లు మంజూరి చేయాలని వినతి పత్రం ఇస్తున్న దృశ్యం

పింఛన్లు రాక సంవత్సరాలుగా ఎదురుచూపులు

ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పలు కుటుంబాలు

సదరన్‌ సర్టిఫికెట్‌ ఉన్నా రాని పింఛన్‌

57 ఏళ్లు నిండిన వారు జిల్లాలో 26,254 మంది దరఖాస్తు చేసుకున్న వైనం

వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి దయనీయం

ఇంకెప్పుడు ఇస్తారని అంటున్న లబ్ధిదారులు

తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవని చెబుతున్న అధికారులు

ఖానాపూర్‌ రూరల్‌, డిసెంబరు 27 : ఆసరా పింఛన్‌ అందని ద్రాక్ష లా మారింది.. అనేక మంది అర్హులు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. వారి ఆశ,నిరాశ కావటంలో ఆవేదనకు గురి అవుతున్నారు. పైగా 57 సంవత్సరాలు నిండిన వారు ఈ మధ్య వేలసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాని ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపుతుంది. దీంతో పింఛన్‌ పైనే ఆధారపడి జీవించే కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. సకాలంలో మంజూరి కావలసిన పింఛన్‌లు జాప్యం కావటం వలన, ఎప్పుడు వస్తాయన్న ఆశతో అర్హులైన లబ్దిదారలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు వారికి సమాధానం చెప్పలేక తలపట్టు కుంటున్నారు. దాదాపు 2018 నుంచి కొత్తపింఛన్లు మంజూరి కావటం లేదు. వికలాంగుల సదరన్‌ సర్టిఫకెట్‌ కూడా కాలపరిమితి ముగిసి పోవటం, తిరిగి రెన్యూవల్‌ అయినవి కూడా కాలపరిమితి ముగియటం తో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వెంటనే పింఛన్లు ఇవ్వాలని కోరుతు న్నారు.

కొత్త పింఛన్లుకు 26,254 దరఖాస్తులు..

ప్రభుత్వం పింఛన్‌ అర్హత వయస్సు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిం చటంతో అనేక మంది అర్హులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.  జిల్లాలో 26,254 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఇంతే కాకుండా వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు కూడా గతంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. జిల్లాలో దాదాపు 15,672 మంది వికలాంగులు సదరన్‌ సర్టిఫికెట్‌ కలిగిన వారు ఉన్నారు. ఇందులో 10,548 మందికి మాత్రమే పింఛన్‌ వస్తుంది. ఇంకా 4 వేలకు పైగా అర్హులైన వారికి పింఛన్‌ రావటం లేదు. మరోవైపు మరుగుజ్జు వారిని వికలాంగులుగా గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బస్సుపాస్‌లు కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం చెందుతున్నారు. అలాగే భర్తను కోల్పోయిన వింతంతువులు కూడా పింఛన్‌ కోసం తిరుగుతూ తంటాలు పడుతున్నారు. తన భర్త చని పోయి 4 ఏళ్లు అయిన పింఛన్‌ ఇవ్వటం లేదని ఖానాపూర్‌కు చెందిన భారతి అనే మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తుంది. వృద్ధులు పింఛన్‌ వస్తే కనీసం మందులకైనా ఉపయోగపడుతాయని ఎదురుచూస్తున్నారు. 

జిల్లాలో ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్లు..

జిల్లాలో ప్రస్తుతం మొత్తం 137415 మందికి వివిధ పింఛన్లు అంద జేస్తున్నారు. అందులో వృధ్యాప్య పింఛన్లు 27442 మందికి, విడోలు 35543 మందికి, వికలాంగులు 9639 మందికి, గీత కార్మికులు 266 మందికి, చేనేత  43 మందికి, ఒంటరి మహిళా 2107 మందికి, బీడీ కార్మికులు 62375 మంది లబ్ధిదారులకు ప్రతీనెల ఇస్తున్నారు. అయితే 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం మంజూరి చేస్తే ఈ సంఖ్య పెరుగు తుంది. ఇప్పటికే 65 ఏళ్లు దాటిన వృద్దులు గత కొన్ని ఏళ్లుగా ఎదురు చూసి విసిగి పోయారు. ఇక పింఛన్‌ రాదేమోనని బెంగ పెట్టుకుంటు న్నారు. వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-28T05:38:12+05:30 IST