చలి గుప్పిట్లో ఆసిఫాబాద్‌ ఏజెన్సీ

ABN , First Publish Date - 2021-12-16T04:05:15+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీలో బుధవారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని తిర్యాణి మండలం గిన్నేధరి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 10.6డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతనమోదైంది. దీంతో ఆదివాసీ గూడాల్లో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

చలి గుప్పిట్లో ఆసిఫాబాద్‌ ఏజెన్సీ
సిర్పూర్‌(యూ)మండల కేంద్రం బజార్‌గూడలో చలి మంట కాగుతున్న ప్రజలు(ఫైల్‌)

క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

తిర్యాణిలో అత్యల్పంగా 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు

ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు

కుంపట్లు వేసుకుని చలినుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు

(ఆసిఫాబాద్‌, ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఏజెన్సీలో బుధవారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని తిర్యాణి మండలం గిన్నేధరి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 10.6డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతనమోదైంది. దీంతో ఆదివాసీ గూడాల్లో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 11:30వరకు కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోవడంతో రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడం వల్లే ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించినట్లు నిపుణులు చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోవడం వల్ల ఈసారి గత పరిస్థితులు ఉండకపోవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటవీ సమీప గ్రామాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అంటున్నారు. దీంతో ప్రజలు కుంపట్లు వేసుకొని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా  బుధవారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. గిన్నెధరిలో 10.6డిగ్రీలు, సిర్పూర్‌(యూ)లో 11.2డిగ్రీలు, వాంకిడిలో 12.0డిగ్రీలు, తిర్యాణిలో 12.3డిగ్రీలు, రెబ్బెనలో 13.4డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే కౌటాల మండలంలో 30.9డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డు అయింది. రాబోయే వారం రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ వాతావరణశాఖ అంచనాల ప్రకారం వచ్చే ఆదివారం నాటికి ఆసిఫాబాద్‌ జిల్లాలో పరిస్థితి ఇలానే కొనసాగితే 8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వ్యవసాయ పనులకు ఆటంకం..

ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో జిల్లాలో రైతాంగం సమస్యలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా పత్తి సేకరణ., వరి కోతల సీజన్‌ కావడంతో ఉదయం చలి కారణంగా కూలీలు తొందరగా పనికి వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదని రైతులు చెబుతున్నారు. ఉదయం 10నుంచి 11గంటల వరకు కూడా పంట చేలపై కురిసిన మంచు నీటి బిందువులు ఆరిపోకపోవడంతో పత్తి ఏరేందుకు సమస్యగా మారిందంటున్నారు. మఽధ్యాహ్నం తర్వాతే పనులు సాధ్యమవుతున్నా సాయంత్రం 5గం. దాటితే సూర్యాస్తమయం అవుతుండడంతో కూలీలు కేవలం 4-5గంటల పనికే పూర్తి వేతనం డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్ద పులుల సంచారం కారణంగా కూలీలు చీకటి పడకముందే ఇంటిదారి పడుతుండడం కూడా ఆర్థికంగా భారంగా మారిందని చెబుతున్నారు.

Updated Date - 2021-12-16T04:05:15+05:30 IST