ఓరుగల్లు గొప్ప జైన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-18T04:33:09+05:30 IST

ఓరుగల్లు గొప్ప జైన కేంద్రం

ఓరుగల్లు గొప్ప జైన కేంద్రం
అగ్గలయ్యగుట్ట ప్రాశస్త్యాన్ని వివరిస్తున్న వినయ్‌భాస్కర్‌

అగ్గలయ్య గుట్ట శ్రావణ బెళగొళకు తీసిపోదు 

జైన పీఠాధిపతి చారుకీర్తి భట్టాచార్య స్వామిజీ


హన్మకొండ, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ నగరం ఒకప్పుడు జైన కేంద్రంగా విలసిల్లిందని, ఈ ప్రాంతంలో జైన తీర్థంకరులు, బసదులు, జైన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయని ప్రసిద్ధ శ్రావణ బెళగొళ గేమటేశ్వర జైన పీఠాధిపతి చారుకీర్తి భట్టాచార్య స్వామీజీ (శ్రావణ బెలగొల పీఠాధిపతి) అన్నారు. శనివారం ఆయన నగరానికి వచ్చారు. హన్మకొండ పద్మాక్షి దేవాలయానికి ఎదురుగా గల జైన తీర్థంకరుల ఆవాసమైన అగ్గలయ్య గుట్టను సందర్శించారు. గుట్టపైకి వెళ్లి అక్కడ జైన తీర్థంకరులు, బసదులు, ఇతర చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా చారుకీర్తి భట్టాచార్య మాట్లాడుతూ.. శ్రావణ బెళగొళ ఉన్న చారిత్రక ప్రాధాన్యం ఈ అగ్గలయ్య గుట్టకు ఉందన్నారు. గుట్టపై ఉన్న ఆనవాళ్లను పరిరక్షించాల్సిన అసవరం ఉందని తెలిపారు. ఈ విషయంలో తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అభివృద్ధితో అగ్గలయ్య గుట్ట  వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట వంటి పర్యాటక ప్రాంతాల సరసన చేరిందని స్వామీజీ అన్నారు. జైనక్షేత్ర పరిసరాల అభివృద్ధికి చొరవ తీసుకున్న వినయ్‌భాస్కర్‌ను అభినందించారు. 

అనంతరం వినయ్‌భాస్కర్‌ ఆయనను సత్కరించారు.  శ్రావణ బెళగొళలాగే వరంగల్‌ కూడా ఒకప్పుడు గొప్పజైన కేంద్రమని వినయ్‌భాస్కర్‌ అన్నారు. తొలితరం కాకతీయులు జైన మతాన్ని అవలంబించారని తెలిపారు. ఆ కాలంలోనే ఈ అగ్గలయ్య గుట్టపై జైన బసదుల నిర్మాణాలు జరిగాయన్నారు. అవి నేటికీ పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఓరుగల్లులో జైన సంస్కృతి ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు. జైనుల్లో అగ్గలయ్య గొప్ప వైద్యుడిగా పేరుందని, ఆయన ఈ గుట్టపైనే ఆవాసం ఏర్పాటు చేసుకొని వైద్యసేవలందించారని గుర్తుచేశారు. ఇన్ని రోజులు గుట్టపైకి వెళ్లేందుకు సరైన మార్గం లేక దీని ప్రాశస్త్యం మరుగున పడిందని తెలిపారు. హృదయ్‌ పథకం కింద రూ.1.30కోట్లతో గుట్టపై వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్టు వినయ్‌భాస్కర్‌  తెలిపారు. గుట్టను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దినట్టు చెప్పారు. గుట్టపై జైన తీర్థంకరుడు ఉన్న ప్రాంతంలో ప్లాట్‌ఫాం, గుట్ట చివరి భాగంలో వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మెన్‌ మర్రి యాదవ రెడ్డి, ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, ‘కుడా’ ఇంజనీర్‌ బీంరావు, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, జైన ప్రతినిధులు అనిల్‌ జైన్‌, ప్రకాశ్‌ జైన్‌, కిశోర్‌ జైన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-18T04:33:09+05:30 IST