ఆదిలాబాద్‌ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర

ABN , First Publish Date - 2021-03-15T05:07:54+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ కళాశాల చరిత్ర 63ఏళ్లకు చేరుకుంది. ఈ కళాశాల అనేక మంది ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అధ్యాపకులు, ఉద్యోగులను సమాజానికి అందజేసింది.

ఆదిలాబాద్‌ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నేడు న్యాక్‌ బృందం సందర్శన

ఆదిలాబాద్‌అర్బన్‌, మార్చి 14: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ కళాశాల చరిత్ర 63ఏళ్లకు చేరుకుంది. ఈ కళాశాల అనేక మంది ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అధ్యాపకులు, ఉద్యోగులను సమాజానికి అందజేసింది. ఘనమైన చరిత్ర దక్కించుకున్న ఆదిలాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ముచ్చటగా మూడవ సారి న్యాక్‌ బృందం సందర్శించనుంది. ఈ న్యాక్‌బృందం గుర్తింపుకు సైతం కళాశాల మరోసారి సిద్ధమైంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1957 ఏప్రిల్‌ 1వ తేదీన స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కళాశాలలో 870మంది విద్యార్థులు, 23 మంది అధ్యాపకులు ఉన్నారు. గతేడాది వరకు కేవలం ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌ కోర్సులు మాత్రమే ఉండగా ప్రస్తుతం పీజీ కళాశాలకు రూపాంతరం చెందింది. జాతీయ స్థాయి గుర్తింపు జాబితాలో చోటు దక్కించుకోవడానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి ఈ న్యాక్‌ గుర్తింపు తప్పని సరి. ఈ కళాశాల ఇప్పటికే రెండు సార్లు న్యాక్‌బృందం ద్వారా బీ గ్రేడ్‌ను సాధించింది. బీ గ్రేడ్‌ తర్వాత మరో సారి ఏ గ్రేడ్‌ను సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో బీ గ్రేడ్‌ సాధించిన ఈ కళాశాలకు రూసా ద్వారా రూ.2కోట్ల నిధులు అందుకొని ఈ కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌, అదనపు బిల్డింగ్‌, స్కీల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌, 35వేల పుస్తకాలతో అతిపెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ సారి ఏ గ్రేడ్‌ గుర్తింపు లభిస్తే దాదాపు ఈ కళాశాలకు రూ.5కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో కెమిస్ర్టీ బోటనీ, పీజీ కోర్సుల ఏర్పాటుతో పాటు మరికొన్ని కోర్సులు ఏర్పాటు చేసే యోచనలో పాలక వర్గం సిద్ధమవుతుంది. ఏగ్రేడ్‌ సాధించే దిశగా బృందం సూచించే సలహాలో భాగంగా ఇదివరకే ఈ కళాశాలలో పూర్వ విద్యార్థుల కమిటీని సైతం ఖరారు చేశారు. 

బృందం సందర్శన షెడ్యూలు..

నేడు, రేపు డిగ్రీ కళాశాలను సందర్శించనున్న న్యాక్‌ బృందం సభ్యుల షెడ్యూల్‌ను ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌సింగ్‌, పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి విడుదల చేశారు. బెంగుళురు నుంచి ఈ న్యాక్‌బృందం  సోమవారం డిగ్రీ కళాశాలను సందర్శించనుంది. ఈ బృందానికి రాజస్థాన్‌, జోద్‌పూర్‌, జైనారాయణ వ్యాస్‌ యూనివర్సిటీ నుంచి వైస్‌ చాన్స్‌లర్‌ డా.ప్రవీణ్‌ త్రివేది చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఒడిస్సాలోని బెర్హాంపూర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.జగల్‌ కిషోర్‌మిశ్రా మెంబర్‌ ఆఫ్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. మెంబర్‌గా మహారాష్ట్రలోని ముంబై ఎల్‌డీఎం కామర్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గోపాల్కర్‌కోటి సారధ్యం వహిస్తారు. రెండు రోజుల పర్యటనలో వీరు కళాశాలలో జరుగుతున్న బోధన తీరు మౌళిక వసతుల కల్పన, కళాశాల విద్యార్థులతో మాటామంతి అనంతరం పూర్వ విద్యార్థులతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తారు. కళాశాలకు ఏ గ్రేడ్‌ గుర్తింపునిస్తే రూసా నుంచి దాదాపు రూ.5కోట్ల నిధులతో పాటు జాతీయ స్థాయిలో కళాశాలకు మంచి గుర్తింపు లభించనుంది.

Updated Date - 2021-03-15T05:07:54+05:30 IST