‘రైతుబీమా’ అక్రమార్కులపై చర్యలు

ABN , First Publish Date - 2021-07-25T04:10:06+05:30 IST

దండేపల్లి మండలంలో వెలుగు చూసిన రైతుబీమా, ఆసరా పింఛన్ల అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయా పథకాల్లో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్‌ భారతిహోళికేరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు.

‘రైతుబీమా’ అక్రమార్కులపై చర్యలు
రైతుబీమా అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం

రూ. 10 లక్షలు రికవరీకి రంగం సిద్ధం

దండేపల్లి తహసీల్దార్‌కు ఆర్డీవో ఆదేశాలు

లబ్ధిదారుల నామినీలకు నోటీసులు జారీ 

‘ఆసరా పింఛన్ల’ పైనా విచారణ వేగవంతం

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు

మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలంలో వెలుగు చూసిన రైతుబీమా, ఆసరా పింఛన్ల అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయా పథకాల్లో నెలకొన్న అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్‌ భారతిహోళికేరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ విషయాలపై కలెక్టర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ కూడా విచారణ జరిపారు. రెండు పథకాల్లో నెలకొన్న అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. 

‘రైతుబీమా’లో నోటీసులు జారీ

ముత్యంపేట, కొర్విచల్మ గ్రామాల్లో రైతుబీమా పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ‘రైతుబీమా పక్కదారి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఈనెల 2న కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్‌ అదేరోజు విచారణకు ఆదేశించారు. మంచిర్యాల ఆర్డీవో దాసరి వేణు దండేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరయ్య, తహసీల్దార్‌ హన్మంతరావు, ఎంపీడీవో శ్రీనివాస్‌ సమక్షంలో లబ్ధిదారులను విచారించారు. రైతుబీమాలో అక్రమాలు జరిగిన విషయం నిర్ధారణ కావడంతో వ్యవసాయ శాఖ అధికారులతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధ్యులపై కేసు పెట్టించారు. రెవెన్యూ రికవరీ యాక్టు 1864 ప్రకారం బాధ్యులపై చర్యలకు పూనుకున్నారు. రైతుబీమా పథకంలో అక్రమంగా లబ్ధిపొందిన ముత్యంపేటకు చెందిన బత్తుల రాజలింగయ్య, కొర్విచల్మకు చెందిన గోపతి రాజయ్యలకు నామినీలుగా ఉన్న బత్తుల రాజేశ్వరి, గోపతి నారాయణల ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున రికవరీ చేయాలని తహసీల్దార్‌కు ఈనెల 13న ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు.  తహసీల్దార్‌ ఇరువురు నామినీలకు రెండు రోజుల క్రితం సొమ్ము చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రైతుబీమాలో అక్రమాలకు సూత్రధారి అయిన మధ్యవర్తి వద్దకు శనివారం నామినీల కుటుంబీకులు వెళ్లి ఘర్షణకు దిగినట్లు తెలిసింది. బీమా సొమ్ములో మధ్యవర్తి వాటా తీసుకోగా తిరిగి చెల్లించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. లేనిపక్షంలో పోలీసు కేసు పెట్టే యోచనలో నామినీ కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

‘ఆసరా పింఛన్ల’లోనూ

ముత్యంపేట, కొర్విచెల్మ గ్రామాల్లో ఆసరా పింఛన్ల మంజూరులో నెలకొన్న అక్రమాలపైనా అధికారులు విచారణ వేగవంతం చేశారు. ‘విని పింఛన్‌’ ఫ్యామిలీ శీర్షికన జనవరి 4న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి పలుమార్లు విచారణ జరిపారు. లబ్ధిదారులకు మంచిర్యాలలో మళ్లీ వినికిడి పరీక్షలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో ఫలితాలు రానందున హైద్రాబాద్‌లోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంపీడీవో శ్రీనివాస్‌ రెండు గ్రామాల్లోని లబ్ధిదారులకు హైద్రాబాద్‌లో జరిగే పరీక్షలకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కొందరు లబ్ధిదారులు హైద్రాబాద్‌లో పరీక్షలకు హాజరుకాగా, అక్రమార్కులు వెళ్ళలేదు. ఎలాగైనా వారిని హైద్రాబాద్‌ తరలించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా ఉన్నతాధికారులు పోలీస్‌శాఖను ఆదేశించారు. రెండు రోజుల క్రితం దండేపల్లి పోలీసులు ప్రత్యేక వాహనంలో కథనంలో పేర్కొన్న ఎనిమిది మందిని హైద్రాబాద్‌కు వినికిడి పరీక్షల కోసం తరలించారు. పరీక్షల రిపోర్టు వస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.  

హైద్రాబాద్‌కు తరలించాం

 శ్రీకాంత్‌, ఎస్సై దండేపల్లి 

కలెక్టర్‌ ఆదేశాల మేరకు పింఛన్ల లబ్ధిదారులను వినికిడి పరీక్షల కోసం విడుతల వారీగా హైద్రాబాద్‌కు తరలిస్తున్నాం. డీఆర్డీఏ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం మండలానికి చెందిన కొందరికి వినికిడి పరీక్షలు చేయిస్తున్నాం. పరీక్షల ఫలితాలు సేకరణ మా పరిధిలో లేదు. డీఆర్డీఏ అధికారులకే వాటి సమాచారం తెలుస్తుంది. 


Updated Date - 2021-07-25T04:10:06+05:30 IST