ఇంద్రవెల్లి గాయానికి 40 ఏళ్లు

ABN , First Publish Date - 2021-04-19T05:33:58+05:30 IST

పోరాటాల యోధుడు కొమ రంభీం స్ఫూర్తిగా..

ఇంద్రవెల్లి గాయానికి 40 ఏళ్లు

ప్రత్యేక రాష్ట్రంలోనూ అమరులకు నివాళులర్పించుకోలేని పరిస్థితి

ఏప్రిల్‌ 20 అంటేనే భయంతో ఉలిక్కిపడుతున్న ఆదివాసీ గూడాలు

కొవిడ్‌ ఆంక్షలు, అప్రకటిత కర్ఫ్యూ విధింపు

ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తున్న ప్రజాస్వామిక వాదులు

రేపే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం


ఆదిలాబాద్(ఆంధ్రజ్యోతి): పోరాటాల యోధుడు కొమరంభీం స్ఫూర్తిగా ఆదివాసీలు ‘మావనాటే-మావరాజ్యం’ అనే నినాదంతో ఉద్యమబాట పట్టారు. సరిగ్గా 1981 ఏప్రిల్‌ 20న పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీల గుండ్ల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో వందలాది మంది తుపాకీ తూటాలకు నేలకొరగగా మరెందరో అమాయక ఆదివాసీలు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల పరిధిలోని ఆదివాసీ గూడాల్లో ఏప్రిల్‌ 20 అంటేనే ఉలిక్కిపాటు కనిపిస్తోంది. ఆనాటి భయంకర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భయం భయంగా బతుకుతున్నారు. అప్పట్లో ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపింది. హక్కుల కోసం ఉద్యమించిన ఆదివాసీ బిడ్డలను గతప్రభుత్వం నిర్ధక్షిన్యంగ అణిచి వేసేందుకే ఈ మారణకాండకు పాల్పడినట్లు తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు పౌర హక్కుల సంఘాల నేతలు సైతం ఇంద్రవెల్లి ఘటనను తీవ్ర పరిణామంగా అభివర్ణించారు. పోలీసు కాల్పుల్లో 13మంది ఆదివాసీలే మరణించారని ప్రభుత్వం పేర్కొనప్పటికీ వందలాది మంది గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ నేతలు ఇంద్రవెల్లి ఘటనను గుర్తుచేస్తూ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని ఓ ప్రకటనను విడుదల చేయడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 40ఏళ్లుగా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామంలో ఏప్రిల్‌ 20న అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గిరిజనులు అమరవీరులకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 


ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే పరిస్థితి..

స్వరాష్ర్టాన్ని సాధించుకొని ఏడేళ్లు గడుస్తున్నా ఇంద్రవెల్లి మండలంలో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిసారి పోలీసుల నిర్బంధాన్ని అడ్డుకుంటూ ఆదివాసీ గిరిజనులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించడం జరుగుతోంది. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో అమరవీరుల సంస్మరణ దినోత్సవంపై నిషేధాజ్ఞాలు విధిం చడంతో పోలీసులు స్థూపం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. అదే తీరునూ ప్రత్యేక రాష్ట్రంలోను కొనసాగిం చడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం నుంచే కాకుండా చుట్టు పక్కల గిరిజన గ్రామాల నుంచి ఆదివాసీలు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. చాలా సందర్భాల్లో గిరిజనులు దిక్కార స్వరం వినిపించి అమరవీరుల సంస్మరణ దినోత్స వాన్ని జరుపుకునేందుకు ప్రయత్నించడం ఆ ప్రయత్నాలను పోలీసులు విఫలం చేయడం పరిపాటిగానే మారుతోంది.


ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యనేతలతో పాటు మరికొంత మంది నేత లు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అనుకున్నట్లుగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టింది. అయినా ఏడుళ్లుగా పాలకుల హామీలు అమలుకు నోచుకోవడం లేదు. తమకు భావ స్వేచ్ఛ వచ్చిందని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినంపై ఇక ఆంక్షలు తొలగి పోతాయని ఆదివాసీలు సంబరపడ్డారు. అయినా గత పాలకుల మాదిరిగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పోలీసు ఆంక్షలను విధించడంతో గిరిజనుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించనున్న ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవంపై పోలీసులు ఆంక్షలు విధించడం గిరిజనులకు ఆగ్రహం తెప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు ఆనాటి ఉమ్మడి పాలకుల పాలనను ప్రశ్నించిన టీఆర్‌ఎస్‌ నేతలే ప్రస్తుతం వారి వారసత్వ పాలనను కొనసాగించడంపై ఆదివాసీ గిరిజనులు, ప్రజాస్వా మ్య వాదులు, మేధావులు మండిపడుతున్నారు. 


ఆంక్షలు, నిర్బంధాలు..

అమరవీరుల సంస్మరణ దినంపై నిర్బంధంతో పాటు కొవిడ్‌ ఆంక్షలను విధిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు లేవంటున్నారు. ఏప్రిల్‌ 20న ఏజెన్సీ మండలాల్లో 144 సెక్షన్‌ను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల ముందస్తు పిలుపు మేరకు సోమవారం నుంచే అమరవీరుల స్థూపం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఉట్నూర్‌, ఇంద్రవెల్లి వైపు వెళ్లే రాక పోకలను కొంత నియంత్రించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి పోలీసు కాల్పుల్లో మరణించి అమరవీరుల స్థూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని గిరిజనులు, ప్రముఖ ప్రజా సంఘాల నాయకులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, అమరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లు వెత్తుతున్నాయి.


ఇంద్రవెల్లి చరిత్రాత్మక ఘటనను భావితరాలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్నారు. గతంలో అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన రాష్ట్ర రచయితల వేదిక నేతలు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడంతో పాటు బాధిత కుటుంబాల్లో భరోసాను నింపేం దుకుఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ విధానాలతో ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్లు నెరవేర్చిన దాఖలాలే కనిపించడం లేదు.

Updated Date - 2021-04-19T05:33:58+05:30 IST