గుండాల ఘటనలో 12 మంది నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-30T04:58:15+05:30 IST

మండలంలోని గుండాల గ్రామంలో ఈనెల 27న నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురికాగా మరికొంతమంది ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకొని చికిత్స పొందుతున్నారు.

గుండాల ఘటనలో 12 మంది నిందితుల అరెస్టు
ఇచ్చోడ సర్కిల్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేశ్‌చంద్ర

ఇచ్చోడ, అక్టోబరు 29: మండలంలోని గుండాల గ్రామంలో ఈనెల 27న నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురికాగా మరికొంతమంది ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకొని చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో 12మందిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్సు ఉత్సవాల్లో డీజే సౌండ్‌ సిస్టం అనుమతి లేదని, సర్పంచ్‌ భర్త అబ్దుల్‌ రషీద్‌ వర్గం వారు కావాలనే ఉత్సవాలు నిర్వహించి ఇరువర్గాల ఘర్షణకు దారితీశాయని ఎస్పీ తెలిపారు. నిందితులు కొందరు మహారాష్ట్ర, హైదరాబాద్‌కు వెళ్లగా మరికొందరు అడవుల్లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. అయితే నిందితులు స్పచ్ఛందంగా లొంగిపోవాలన్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ నలువైపులా ఉంటుందన్నారు. అయితే ముల్తానీలకు విద్య, ఉన్నత చదువులు లేక పోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీరికి సంక్షేమ పథకాలతోపాటు విద్యను అందించేలా చూడాలని కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు అబ్దుల్‌ రషీద్‌, షేక్‌ అస్లాం, షేక్‌ షాఫత్‌, అస్గార్‌, సద్దాం, రబ్బాన్‌, జుమ్మా, మూసా, హషామ్‌, అమిద్‌, అల్లాఉద్దీన్‌ షేక్‌ జాలిల్‌లను రిమాండుకు తరలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐలు కంప రవీందర్‌, రమేష్‌ బాబు, ఎస్సై ఫరీద్‌ ఉన్నారు. 

Updated Date - 2021-10-30T04:58:15+05:30 IST