ఇకపై రెండు రోజుల్లో జలుబు, దగ్గు పరార్.. తలనొప్పి, ముక్కు కారడం, జ్వరం కూడా.. కొలిక్కి వచ్చిన శాస్త్రవేత్తల పరిశోధనలు!
ABN , First Publish Date - 2021-11-25T12:49:54+05:30 IST
ఆహారంలో ఉండే జింక్ జలుబు-దగ్గును..
ఆహారంలో ఉండే జింక్ జలుబు-దగ్గును నివారిస్తుంది. వీటి లక్షణాలను తగ్గిస్తుంది. జలుబు, దగ్గుల బారిన పడిన సందర్భాలలో జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కేవలం 2 రోజుల్లోనే కోలుకోవచ్చునని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. వెస్ట్రన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తమ తాజా పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం జింక్ అనేది ఇన్ఫెక్షన్ రేటును తగ్గిస్తుంది. అనారోగ్య సమయాన్ని తగ్గిస్తుంది. వెస్ట్రన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. జింక్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అనుసంధానించే డజనుకు పైగా అధ్యయనాలను చేశారు. ఇంతేకాకుండా జింక్.. జలుబు, దగ్గు లక్షణాలను కూడా తగ్గించగలదని ఈ పరిశోధనల్లో వెల్లడయ్యింది. అలాగే జింక్.. ముక్కు కారటం, తలనొప్పి పెరిగిన శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుందని తేలింది. ఇప్పుడు జింక్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనది? పరిశోధనల్లో వెలికి వచ్చిన విషయాలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
జింక్ శరీరంలో ఏమి చేస్తుంది?
జింక్ అనేది శరీరంలో అనేక విధులు నిర్వహించే పోషక పదార్థం. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్ అనేది మాంసం, జున్నులో అధిక మొత్తంలో లభిస్తుంది. ఆహారం ద్వారా పురుషులు 9.5 mg, మహిళలు 7 mg జింక్ తీసుకోవచ్చని బ్రిటన్ ఆరోగ్య సంస్థ NHS తెలియజేసింది. అయితే జింక్ సప్లిమెంట్లను నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జింక్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపించి, ఎముకలు బలహీనపడేందుకు అవకాశాలున్నాయి.
పరిశోధనలో ఏం తేలింది?
పరిశోధకుల బృందం 5,500 మంది వ్యక్తులపై 28 జింక్ ట్రయల్స్‌ను నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులకు నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధన సమయంలో, జింక్ ఇచ్చిన వారికి, వారి ఆరోగ్య పరిస్థితి 2 రోజుల్లో మెరుగుపడింది. అదే సమయంలో, జింక్ ఇవ్వని రోగులలో, ఏడవ రోజు వరకు ఈ లక్షణాలు కొనసాగాయి. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం జలుబు, దగ్గు చాలా తీవ్రమైన స్థాయికి చేరుకున్నట్లయితే.. జింక్ వెంటనే వ్యాధి లక్షణాలను తగ్గించదు. దాని ప్రభావం మూడవ రోజు నుండి కనిపించడం ప్రారంభిస్తుంది. అలాగే జింక్ వినియోగంతో రోగిలో దుష్ప్రభావాలు కనిపించలేదు. జలుబు-దగ్గు చికిత్సలో సమర్థవంతమైన నివారణ చూస్తున్న వారికి జింక్ మంచి ఎంపిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన కొద్దిమందిపైనే జరిగిందని, దీనిని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ 5 ఆహారాలతో జింక్ లోపాన్ని నివారించండి
1. పుచ్చకాయ గింజలు: జింక్, పొటాషియం వీటిలో పుష్కలంగా ఉంటాయి. మీరు పుచ్చకాయ గింజలను ఎండబెట్టి, వాటిని మెత్తగా చేసుకుని, మీ ఆహారంలో వినియోగించవచ్చు.
2. చేపలు: జింక్, ప్రొటీన్లతో పాటు మంచి పరిమాణంలో అనేక పోషకాలు వీటిలో ఉంటాయి. చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. జింక్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
3. గుడ్డు: ఒక గుడ్డులో 5 శాతం మేరకు జింక్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, దెబ్బతిన్న కండరాలను చక్కదిద్దడంలో సహాయపడుతుంది.
4. డెయిరీ ప్రొడక్ట్స్: మీరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడకపోతే, డెయిరీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. జింక్ లోపాన్ని పాలు, జున్ను, పెరుగు ద్వారా కూడా తీర్చవచ్చు.
5. డార్క్ చాక్లెట్: ఇది జింక్ లోపాన్ని తీర్చడమే కాకుండా పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. డార్క్ చాక్లెట్.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.