బస్సును ఆపమన్న చోట ఆపలేదా డ్రైవర్.. 400 మీటర్ల ఎక్కువ దూరం తీసుకెళ్లాడని ఆ మహిళ ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2021-09-03T16:59:38+05:30 IST
బస్సును మనం ఆపమన్న చోట డ్రైవర్ ఆపకపోతే ఏం చేస్తాం? డ్రైవర్‌తో గొడవకు దిగుతాం..

బస్సును మనం ఆపమన్న చోట డ్రైవర్ ఆపకపోతే ఏం చేస్తాం? డ్రైవర్‌తో గొడవకు దిగుతాం.. అతడు ఎక్కడ ఆపితే అక్కడ దిగి అతడిని తిట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోతాం. అయితే కర్ణాటకలోని మహిళ అలా తిట్టుకుని ఊరుకోలేదు. బస్సును ఆపమన్న చోట ఆపకుండా 400 మీటర్ల దూరం ఎక్కువగా తీసుకెళ్లాడని ఏకంగా వినియోగదారుల కోర్టుకు వెళ్లింది. ఆమె ఫిర్యాదును విచారించిన కోర్టు 8 వేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
విజయా బాయి అనే మహిళ 2018 అక్టోబర్ 24వ తేదీన బెంగళూరు నుంచి తముకూరు వెళ్లేందుకు కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సు ఎక్కింది. తముకూరులోని హెచ్‌ఎమ్‌టీ బస్సు స్టాప్‌నకు ఓ టికెట్ తీసుకుంది. అయితే అక్కడ స్టాప్ లేదనే కారణంతో డ్రైవర్ హెచ్‌ఎమ్‌టీ బస్సు స్టాప్ వద్ద బస్సు ఆపలేదు. 400 మీటర్ల దూరం అవతల రోడ్డు మీద ఆపి ఆమెను దింపాడు. తిరిగి వెనక్కి వచ్చేందుకు ఆమె 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆమె తముకూరు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది.
వినియోగదారుల కోర్టు 2019 జులై 29న ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ.. రూ.15000 నష్టపరిహారంగా చెల్లించాలని కేఎస్‌ఆర్‌టీసీ తముకూరు డివిజినల్ కంట్రోలర్‌ను ఆదేశించింది. దీంతో కేఎస్‌ఆర్‌టీసీ ఈ తీర్పును కర్ణాటక రాష్ట్ర కన్స్యూమర్ కోర్టులో సవాలు చేసింది. 2021 జులై 28న ఈ పిటిషన్‌ను విచారించిన కర్ణాటక రాష్ట్ర కన్స్యూమర్ కోర్టు జరిమానాను రూ.15 వేల నుంచి రూ.8 వేలకు తగ్గించింది. 60 రోజుల్లోపు నష్టపరిహారాన్ని బాధితురాలికి అందించాలని పేర్కొంది.