హిప్నొటైజ్ చేసి పట్టపగలే దోపిడీ.. అదెలా సాధ్యమంటూ రంగంలోకి పోలీసులు.. దొంగలను ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2021-12-31T09:59:43+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలను హిప్నోటైజ్(వశీకరణ) చేస్తూ ఒక మోసగాళ్ల గ్యాంగ్ పట్టపగలే దోపిడీలు చేస్తోంది. తాజా డిసెంబర్ 6న ఒక మహిళను హిప్నోటైజ్ చేసి ఆమె వద్ద నుంచి బంగారు నగలు కాజేశారు...

హిప్నొటైజ్ చేసి పట్టపగలే దోపిడీ.. అదెలా సాధ్యమంటూ రంగంలోకి పోలీసులు.. దొంగలను ఎలా పట్టుకున్నారంటే..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలను హిప్నోటైజ్(వశీకరణ) చేస్తూ ఒక మోసగాళ్ల గ్యాంగ్ పట్టపగలే దోపిడీలు చేస్తోంది. తాజా డిసెంబర్ 6న ఒక మహిళను హిప్నోటైజ్ చేసి ఆమె వద్ద నుంచి బంగారు నగలు కాజేశారు. ఆ దొంగలను పోలీసులు చాలా చాకచాక్యంగా పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.


ఢిల్లీలోని సోనియా విహార్ ప్రాంతంలో నివసించే పూజా అనే మహిళ డిసెంబర్ 6న మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా..  దారిలో ఒక మహిళ పూజను ఆపి నిజాముద్దీన్ స్టేషన్‌కు అడ్రస్ అడిగింది. పూజ ఆమెకు అడ్రస్ చెప్పిన తరువాత.. ఆ మహిళ మరొక సహాయం అడిగింది. తన వద్ద ఉన్న బ్యాగులో లక్షల కొద్దీ క్యాష్ ఉందని.. అంత డబ్బు తీసుకొని ప్రయాణించడానికి  భయంగా ఉందని చెబుతూ.. బ్యాగులో ఉన్న డబ్బును పూజకు చూపింది. ఆ డబ్బంతా పూజకు ఇచ్చేస్తానని.. కానీ దానికి బదులుగా పూజ మెడలో ఉన్న బంగారం తాళిబొట్టు, బంగారం ఇయర్ రింగ్స్ ఇవ్వమని కోరింది. 


అంత డబ్బు చూసిన పూజ.. ఆ మహిళ మాటలు విని ఆశ్చర్యపోయింది. కేవలం కాస్త బంగారం ఇచ్చి.. లక్షల డబ్బు తీసుకోవచ్చననే ఆశతో ఒప్పుకుంది. వెంటనే తన తాళిబొట్టు, చెవుల్లో ఉన్న బంగారు కమ్మలు ఇచ్చేసి.. ఆ మహిళ దెగ్గరున్న బ్యాగు తీసుసుకొని ఇంటికొచ్చింది. అంత డబ్బు తన వద్ద ఉందని.. ఆనందం పట్టలేక ఒకసారి బ్యాగు తెరిచి చూసింది. కానీ అందులో డబ్బు లేదు. కేవలం చిత్తు కాగితాలే ఉన్నాయి. అదెలా సాధ్యం.. తను ముందు చూసినప్పుడు బ్యాగులో డబ్బులున్నాయి.. కానీ ఇంటికి వచ్చాక చూస్తే డబ్బులు లేవు. తాను మోసపోయానని గ్రహించిన పూజ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


తనను హిప్నటైజ్ చేసి బ్యాగులో డబ్బులు ఉన్నట్లు నమ్మించారని పూజ తన ఫిర్యాదులో పేర్కొంది. పూజ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవి వీడియోల ఆధారంగా.. ఆ కేడి మహిళను గుర్తించి.. డిసెంబర్ 25న చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ మహిళను పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. ఆమె తన గ్యాంగ్ సభ్యుల గురించి వివరాలు వెల్లడించింది. దీంతో పోలీసులు ఆ మహిళకు తోడుగా పనిచేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. 


ఈ ముగ్గురూ కలిసి నగరంలో ఇప్పటికే చాలా మంది మహిళలను హిప్నొటైజ్ చేసి దోచుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసులు ఆ ముగ్గురిపై ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2021-12-31T09:59:43+05:30 IST