భర్తే విడాకులు ఇస్తున్నాడు.. ఇక నాకు ఈ గర్భం దేనికి..? అబార్షన్‌‌ కోసం కోర్టులో పిటిషన్.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-20T18:16:27+05:30 IST

భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంటోందా మహిళ. ఆమె అప్పటికే గర్భవతి. దీంతో భర్తే విడాకులిస్తున్నప్పుడు తనకు ఈ గర్భం వద్దంటూ ఆమె కోర్టుకెక్కింది.

భర్తే విడాకులు ఇస్తున్నాడు.. ఇక నాకు ఈ గర్భం దేనికి..? అబార్షన్‌‌ కోసం కోర్టులో పిటిషన్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంటోందా మహిళ. ఆమె అప్పటికే గర్భవతి. దీంతో భర్తే విడాకులిస్తున్నప్పుడు తనకు ఈ గర్భం వద్దంటూ ఆమె కోర్టుకెక్కింది. ఆమె వాదనలు జాగ్రత్తగా విన్న బాంబే హైకోర్టు.. అబార్షన్ చేయించుకోవడానికి సదరు యువతికి అనుమతినిచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఒక 22 ఏళ్ల యువతి గృహహింస కారణంగా భర్తతో విడాకులు తీసుకుంటోంది. కానీ అప్పటికే ఆమె 23 వారాల గర్భవతి. మనదేశంలోని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎమ్‌టీపీ) చట్టాల ప్రకారం గర్భం వచ్చి 20 వారాలు దాటిన తర్వాత కడుపులో బిడ్డకో, లేదంటే తల్లికో ప్రమాదం ఉంటేనే అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. లేదంటే అబార్షన్ చేయించుకోవడం నేరమే. అయితే దేశంలోని పలు న్యాయస్థానాలు ఈ చట్టాన్ని పక్కనపెట్టిన సందర్భాలున్నాయి. వీటిలో తాజా ఘటన కూడా ఒకటి.


ఈ కేసులో స్థానికంగా ఉన్న జేజే హాస్పిటల్‌కు చెందిన కొందరు నిపుణుల ప్యానెల్‌ను హైకోర్టు నియమించింది. వాళ్లు బాధితురాలిని పరీక్షించారు. గృహహింస కారణంగా సదరు యువతి మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, బిడ్డ పుట్టిన తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణుల ప్యానెల్ సూచించింది. ఆమె గర్భంలోని శిశువు ఆరోగ్యంగానే ఉన్నా.. యువతిపై ఈ గర్భం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. అలాగే ఒకవేళ బిడ్డ పుట్టినా కూ తన భర్త నుంచి ఆర్థిక సహకారం కానీ, ఆ బిడ్డకు ఆప్యాయత కానీ లభించదని కూడా ఆ యువతి కోర్టుకు తెలిపింది. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ మాధవ్ జందార్‌ల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఆమె అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో గర్భం విషయంలో మహిళలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కల్పించిన హక్కులను కోర్టు ప్రస్తావించింది.

Updated Date - 2021-08-20T18:16:27+05:30 IST