అవి పరస్పర అంగీకారంతో తీసుకున్న విడాకులు కాదు.. మోసం చేసి తీసుకున్నవని కోర్టుకెక్కిన మహిళ

ABN , First Publish Date - 2021-10-07T11:10:36+05:30 IST

భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో తీసుకున్న విడాకులు చెల్లవని ఓ మహిళ గుజరాత్ హై కోర్టుకెక్కింది. విడాకుల పత్రాలపై తాను స్పృహలో లేనప్పుడు తన చేత సంతకాలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది...

అవి పరస్పర అంగీకారంతో తీసుకున్న విడాకులు కాదు.. మోసం చేసి తీసుకున్నవని కోర్టుకెక్కిన మహిళ

భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో తీసుకున్న విడాకులు చెల్లవని ఓ మహిళ గుజరాత్ హై కోర్టుకెక్కింది. విడాకుల పత్రాలపై తాను స్పృహలో లేనప్పుడు తన చేత సంతకాలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. సంతకం చేసేటప్పుడు తనపై డిప్రెషన్ మందులు ప్రభావం ఉందని ఆమె చెప్పింది.


ఆ మహిళ ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నివసిస్తోంది. ఆమె భర్త ఒమన్ దేశంలో తన తొమ్మిదేళ్ల కుమార్తెతో ఉన్నాడు. విడాకుల తరువాత తన కూతురిని కలవాలంటే తన భర్త అడ్డుపడుతున్నాడని, అతను అలా చేయకుండా నివారించాలని కోర్టును కోరింది.


కేసు వివరాల ప్రకారం.. ఆ మహిళకు 2010 సంవత్సరంలో వివాహమైంది. అప్పటి నుంచి తన భర్తతో ఒమన్‌లోనే నివసిస్తోంది.  ఆ తరువాత నుంచి ఆమె తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతోంది. డిప్రెషన్ చికిత్స నిమిత్తం 2015లో ఆమెను తన భర్త భారత్‌కు తీసుకువచ్చాడు. అలా తనకు డిప్రెషన్ చికిత్స జరుగుతున్నప్పుడు ఏవో కాగితాలని చెప్పి తన భర్త తన చేత సంతకాలు తీసుకున్నాడని.. సంతకం చేసేటప్పుడు తాను పూర్తిగా స్పృహలో లేనని ఆమె తన పిటీషన్‌లో పేర్కొంది. కొన్ని రోజుల తరువాత తన భర్త ఒమన్ తిరిగి వెళుతూ తనతో కూతురిని కూడా వెంట తీసుకెళ్లాడని ఆమె చెప్పింది. 2016లో కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసిందని తెలిపింది.


విడాకులు మంజూరైన మూడేళ్ల తరువాత ఆమె ఆ విడాకులు చెల్లవంటూ తన భర్తపై చీటింగ్ కేసు పెట్టింది. ఆమె భర్త తానే తప్పు చేయలేదని వాదించడంతో కోర్టు విడాకుల తీసుకున్న తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. 


పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాప్పుడు కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో సంతకాలు చేయాల్సి వస్తుందని హై కోర్టు చెప్పింది. విడాకులు తీసుకునే ముందు ఆ మహిళకు విడాకుల గురించి పూర్తిగా అవగాహన కల్పించాకే ఆమె సంతకాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు వివరించింది. హై కోర్టు ఈ కేసుని ఒక సివిల్ కేసుగా అప్పీలు చేయాలని సూచిస్తూ దీపావళి వరకూ వాయిదా వేసింది.

Updated Date - 2021-10-07T11:10:36+05:30 IST