యుద్ధం లేకుండా దేశ విస్తీర్ణం పెంచిన సామాన్య రైతు

ABN , First Publish Date - 2021-05-05T20:10:01+05:30 IST

యుద్ధాలు, దండయాత్రలు వంటివేవీ లేకుండానే ఓ సామాన్య రైతు

యుద్ధం లేకుండా దేశ విస్తీర్ణం పెంచిన సామాన్య రైతు

యుద్ధాలు, దండయాత్రలు వంటివేవీ లేకుండానే ఓ సామాన్య రైతు తన దేశ విస్తీర్ణాన్ని పెంచేశారు. అదే సమయంలో పొరుగు దేశం విస్తీర్ణాన్ని తగ్గించేశారు. ఆ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సమస్య తలెత్తలేదు. ఆ రైతు చేసిన పొరపాటును సరిదిద్దేందుకు ఇరు దేశాలు సామరస్యంగా రంగంలోకి దిగాయి. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగింది. 


బెల్జియంకు చెందిన ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్‌కు అడ్డంగా ఓ పెద్ద రాయి కనిపించింది. దానిని 7.5 అడుగుల అవతలికి వెళ్లి పాతేశారు. దీంతో బెల్జియంకు ఆ మేరకు కొత్తగా స్థలం కలిసొచ్చింది. దీంతో బెల్జియం అంతకు ముందు కన్నా సుమారు 1,000 చదరపు మీటర్లు పెద్దది అయింది. అదే సమయంలో ఫ్రాన్స్ అంత మేరకు విస్తీర్ణాన్ని కోల్పోయి, చిన్నదైపోయింది. 


బెల్జియం-ఫ్రాన్స్ మధ్య సరిహద్దు 390 మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్దేశించే రాళ్ళు 200 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 1819లో వేసిన రాయి ఇటీవల స్థానం మారినట్లు అధికారులు గుర్తించారు. కొర్‌ట్రిజ్క్ ఒప్పందం ప్రకారం 1820లో ఫ్రెంచ్-బెల్జియన్ బోర్డర్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. 


బెల్జియంలోని ఎర్‌క్వెలిన్నెస్ పట్టణవాసి అయిన ఆ రైతు చేసిన పొరపాటు వల్ల ఫ్రాన్స్‌లోని బౌసిగ్నీస్-సుర్-రాక్ అనే గ్రామం విస్తీర్ణం తగ్గిపోయింది. ఎర్‌క్వెలిన్నెస్ పట్టణ మేయర్ డేవిడ్ లవాక్స్ మీడియాతో మంగళవారం మాట్లాడుతూ, సరిహద్దు రాయి అంతకుముందు ఎక్కడ ఉండేదో కచ్చితంగా తమకు తెలుసునని చెప్పారు. ఆ రాయి ఓ చెట్టు వద్ద ఉండేదన్నారు. 2019లో 200వ వార్షికోత్సవం సందర్భంగా సరిహద్దు రాళ్లను చాలా కచ్చితంగా జియోలోకలైజ్ చేశామన్నారు. 1819లో నెపోలియన్ ఓటమి తర్వాత ఈ రాళ్ళను వేసినట్లు తెలిపారు. ఆ సంవత్సరం సంఖ్య ఆ రాళ్ళపై చెక్కి ఉంటుందన్నారు. ఆ రాయికి స్థాన చలనం కలిగించిన రైతును గుర్తించవలసి ఉందని చెప్పారు. అయితే ఇరు దేశాల అధికారులు సామరస్యంగా, వేగంగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తమకు నవ్వు వచ్చిందన్నారు. ఇది తీవ్రమైన విషయమేమీ కాదన్నారు. ఆ రాయిని సరైన చోటులోనే మళ్ళీ పాతుతామని చెప్పారు. బెల్జియంను విశాలమైనదిగానూ, ఫ్రాన్స్‌ను ఇరుకైనదిగానూ మార్చాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. 


ఫ్రెంచ్ టౌన్ బౌసిగ్నీస్-సుర్-రాక్ మేయర్ ఔరెలియె వెలోనెక్‌ను ఆ దేశ మీడియా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో డేవిడ్ లవాక్స్‌ కూడా పాల్గొన్నారు. ఔరెలియె వెలోనెక్‌ మాట్లాడుతూ, బెల్జియం, ఫ్రాన్స్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎటువంటి తీవ్రమైన ఆందోళన అక్కర్లేదన్నారు. బెల్జియన్ అధికారుల చర్యలను తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఆ రాయిని తిరిగి యథాతథ స్థితికి చేర్చాలని చెప్పామని, అది జరగకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగుతుందని చెప్పారు.


Updated Date - 2021-05-05T20:10:01+05:30 IST