గర్భవతి అని తెలియక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే జరిగేదేంటి..? డాక్టర్ల సమాధానం ఇదీ..!

ABN , First Publish Date - 2021-05-21T16:27:03+05:30 IST

ఒకవేళ గర్భవతి అని తెలియక పొరబాటను వ్యాక్సిన్ తీసుకుంటే కడుపులో బిడ్డపై ప్రభావం పడుతుందా? డెలివరీ అయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనేవి మహిళల ముందున్న ప్రధాన ప్రశ్నలు.

గర్భవతి అని తెలియక కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే జరిగేదేంటి..? డాక్టర్ల సమాధానం ఇదీ..!

ప్రస్తుతం భారతదేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రతిరోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో యువత అంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీ అయింది. అయితే ఇప్పుడు మహిళలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య కూడా వ్యాక్సినేషనే. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా? అని సతమతం అవుతున్నారు.  ఒకవేళ గర్భవతి అని తెలియక పొరబాటను వ్యాక్సిన్ తీసుకుంటే కడుపులో బిడ్డపై ప్రభావం పడుతుందా? డెలివరీ అయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనేవి మహిళల ముందున్న ప్రధాన ప్రశ్నలు. అలాగే మహిళల్లో మాత్రమే ఉండే కొన్ని శారీరక ప్రక్రియల సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడంపై కూడా సందేహాలు వెలిబుచ్చుతున్నారు కొందరు. వీటన్నింటికీ నిపుణులైన డాక్టర్లు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారో ఓ లుక్కేయండి.


భారతదేశ జనాభాలో కనీసం 5శాతం మంది గర్భవతులు ఉన్నారు. ఇక బాలింతలను కూడా కలుపుకుంటే ఈ వర్గాన్ని కూడా వ్యాక్సినేషన్ విషయంలో కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలయితే గర్భవతులు, బాలింతలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చేస్తున్నాయి. కానీ భారత్‌లో ఇలా చేయడానికి భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ రెంటిలో దేని ప్రయోగాలు కూడా గర్భవతులు, బాలింతలపై జరగలేదు. ఇప్పుడు సడెన్‌గా వారికి వ్యాక్సిన్ ఇస్తే, ఏమైనా సైడ్ ఎపెక్ట్స్ వస్తే ప్రమాదం కదా? అని అందరూ ఆలోచిస్తున్నారు. తాజాగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ) గర్భవతులకు వ్యాక్సిన్ వేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది.


ఇప్పటి వరకూ సరైన డేటా లేకపోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చిన ఈ నిర్ణయం.. ఎన్‌టీఏజీఐ నిర్ణయంతో మరోసారి స్పాట్‌‌లైట్‌లోకి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం గర్భవతులకే వదిలేయాలని ఎన్‌టీఏజీఐ తెలిపింది. అయితే దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఇంకా ఊపలేదు. ప్రస్తుతం చాలా మంది మహిళల వ్యాక్సినేషన్ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే రుతుక్రమం ఆలస్యం అవడం, గర్భధారణ శక్తి తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తున్న కొన్ని వదంతులపై కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. ఇక ఈ సమస్యల విషయంలో నిపుణులు స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నారు. గర్భవతులు వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో సరైన స్థాయిలో డేటా లేదని, కావున ఆ నిర్ణయాన్ని గర్భవతులకు వదిలేయడం మంచిదని కొందరు చెప్తున్నారు.


బాలింతల విషయంలో అయితే ఎటువంటి సందేహాలు అవసరం లేదనేది నిపుణుల మాట. డెలివరీ అయిపోయిన మరుక్షణం వ్యాక్సిన్ తీసుకున్నా ప్రమాదం లేదని కొందరు డాక్టర్లు చెప్తున్నారు. కడుపులో పిండంపై వ్యాక్సిన్ ప్రభావం ఉంటుందనే భయంతో గర్భవతుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నామని, అయితే డెలివరీ తర్వాత ఎటువంటి సందేహాలూ అవసరం లేదని వారు వివరిస్తున్నారు. కొంచెం ఒళ్లు నొప్పులు, లైట్‌గా జ్వరం వంటివి తప్ప మిగతా సైడ్ ఎఫెక్టులు కూడా పెద్దగా ఎవరీలోనూ కనిపించలేదని వెల్లడించారు. అలాగే గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనేది మరో ప్రశ్న. అయితే గర్భం దాల్చిన తర్వాత కరోనా వస్తే చాలా ప్రమాదం కాబట్టి ముందే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని డాక్టర్ల సలహా. గర్భానికి ముందే వ్యాక్సిన్ తీసుకుంటే ఉండే రిస్క్ కన్నా, గర్భధారణ తర్వాత కరోనా వస్తే రిస్క్ చాలా ఎక్కువ కాబట్టి ఈ విషయంలో అసలు ఆలోచనే అక్కర్లేదు.


గర్భం దాల్చిన విషయం తెలియక పొరబాటను వ్యాక్సిన్ తీసుకున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల గర్భంలోని శిశువుకు ప్రమాదం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ ఇప్పటి వరకూ లేవు. అలాగే వ్యాక్సిన్ వల్ల గర్భధారణ శక్తి తగ్గే అవకాశం ఉందా? అంటే అస్సలు లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇది కేవలం అపోహేనని కొట్టిపారేశారు. అలాగే రుతుక్రమంపై కూడా వ్యాక్సిన్ ఎటువంటి ప్రభావమూ చూపదని తేల్చేశారు. పీరియడ్స్‌లో ఉన్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవడంలో కూడా ఎటువంటి ప్రమాదమూ లేదట. ప్రస్తుతం గర్భంతో ఉన్న మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అన్న విషయంలోనే కచ్చితమైన వివరాలు లేనందున స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోంది. అందుకే భారత్‌లో గర్భవతులను వ్యాక్సిన్ తీసుకునే అర్హుల జాబితాలో ఇంకా చేర్చలేదని నిపుణులు తెలిపారు.


అమెరికా వంటి దేశాల్లో ఉపయోగించే వ్యాక్సిన్ ఎమ్ఆర్‌ఎన్ఏ రకానికి చెందినంది. మనదేశంలోని రెండు వ్యాక్సిన్లూ ఈ రకానికి చెందినవి కావు. కావున గర్భవతులపై వీటి ప్రభావంపై స్పష్టతలేదు. అయతే దేశంలో కరోనా కారణంగా మరణిస్తున్న గర్భవతుల సంఖ్యను చూసి.. వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని గర్భవతులకే వదిలేయాలని కొందరు డాక్టర్లు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - 2021-05-21T16:27:03+05:30 IST