అఫ్ఘాన్‌లో విమానం నుంచి ఇద్దరు కిందపడిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా..? వాళ్లల్లో ఒకరు..

ABN , First Publish Date - 2021-08-20T19:53:28+05:30 IST

అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైన తర్వాత మనసు ముక్కలు చేసే పలు దృశ్యాలు కనిపించాయి. వీటిలో చాలా వాటికి కాబూల్ ఎయిర్‌పోర్టు సాక్షిగా నిలిచింది. వీటిలో అన్నింటికన్నా ఎక్కువగా అందరి మనుసులు మెలిపెట్టిన దృశ్యం..

అఫ్ఘాన్‌లో విమానం నుంచి ఇద్దరు కిందపడిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా..? వాళ్లల్లో ఒకరు..

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైన తర్వాత మనసు ముక్కలు చేసే పలు దృశ్యాలు కనిపించాయి. వీటిలో చాలా వాటికి కాబూల్ ఎయిర్‌పోర్టు సాక్షిగా నిలిచింది. వీటిలో అన్నింటికన్నా ఎక్కువగా అందరి మనుసులు మెలిపెట్టిన దృశ్యం.. అమెరికా మిలటరీ విమానం గాల్లోకి లేవగానే, దాని చక్రాలు పట్టుకొని వేలాడుతున్న ఇద్దరు నింగి నుంచి నేలరాలడం. ఆ ఘటన చూసిన ప్రపంచం నోరెళ్లబెట్టడం తప్ప మరేమీ చేయలేకపోయింది. ఇలా విమానం మీద నుంచి జారి పడి అఫ్ఘాన్‌లో ఇప్పటి వరకూ ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావడం గమనార్హం. జకీ అన్వరీ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా విమానం నుంచి జారిపడి మరణించాడు. ఈ విషయాన్ని అఫ్ఘానిస్తాన్ క్రీడా విభాగం కూడా ధ్రువీకరించింది.


ఇక ప్రపంచం మొత్తం సాక్షిగా నిలిచిన వీడియోలో.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం మీద నుంచి ఇద్దరు పడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కాబూల్ విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నివసించే వలీ సాలెక్ అనే వ్యక్తి ఇంటిపై పడినట్లు తెలుస్తోంది. బయట పరిస్థితులు భీతిగొల్పేలా ఉండటంతో.. వలీ కుటుంబం మొత్తం సోమవారం నాడు ఇంట్లోనే ఉందట. ఆ సమయంలో సడెన్‌గా ఏదో పెద్ద టైర్ బద్దలైనట్లు చప్పుడయిందని, ఇంటిపై ఏదో పడినట్లు అర్థమైందని వలీ చెప్పారు. 


ఇంటి పైకెళ్లి చూస్తే ఇద్దరు వ్యక్తులు కిందపడి ఉన్నట్లు కనిపించిందట. వారి తలలు పగిలి, శరీరాలు చిన్న చిన్న ముక్కలైపోయిన దృశ్యం అత్యంత భీతావహంగా ఉందని వలీ గుర్తుచేసుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన వలీ భార్య అక్కడిక్కడే కళ్లు తిరిగి పడిపోయారంటే ఆ దృశ్యం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత తన పక్కింట్లో ఉండే వ్యక్తి టీవీలో కనిపించిన ఘోరం గురించి చెప్పడంతో అమెరికా విమానం నుంచి జారిపడిన వ్యక్తులు తన ఇంటిపై పడినట్లు వలీ గుర్తించారు. రెండు మృతదేహాలపై వస్త్రాలు కప్పి, దగ్గరలోని మసీదుకు వాటిని తరలించారట వలీ. మరణించిన వారిలో ఒక వ్యక్తి వద్ద బర్త్ సర్టిఫికెట్ కూడా దొరికిందని, దాన్ని బట్టి మృతుడి పేరు సైఫుల్లా హోతక్ అని తెలిసిందని వలీ వివరించారు. అతను ఒక డాక్టర్. రెండో మృతుడి పేరు ఫిదా మహమ్మద్ అని తెలిసింది.


కాబూల్‌లో పరిస్థితులు రోజురోజుకూ ఎంతలా దిగజారుతున్నాయో కళ్లకు కనిపిస్తోందని వలీ అన్నారు. వీధులు నిర్మానుష్యంగా మారాయని, ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే వణికిపోతున్నారని తెలియజేశారు. తనకు కూడా భయంగానే ఉందని, అవకాశం వస్తే వేరే దేశానికి పారిపోవాలని అనుకుంటున్నానని వలీ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో మాత్రమే మనుషులు కనిపిస్తున్నారని, వాళ్లు కూడా పిచ్చివాళ్లలా విమానాశ్రయం వైపు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారని వలీ వెల్లడించారు.

Updated Date - 2021-08-20T19:53:28+05:30 IST