కొడుకు వైద్యం కోసం సెలవు అడిగిన పోలీసు.. ప్రతిఫలం ఆశించిన అధికారి.. చివరికి ఆ పోలీసు రోడ్డుపైకి వెళ్లి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-21T22:44:18+05:30 IST

పాకిస్తాన్‌లో ఓ పోలీసుకు పెద్ద కష్టమే వచ్చింది. తన కొడుక్కి వైద్యం చేయించాలని ఉన్నతాధికారులను సెలవులు అడిగాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తర్వాత

కొడుకు వైద్యం కోసం సెలవు అడిగిన పోలీసు.. ప్రతిఫలం ఆశించిన అధికారి.. చివరికి ఆ పోలీసు రోడ్డుపైకి వెళ్లి ఏం చేశాడంటే..

భార్యా పిల్లలను పోషించేందుకు చాలా మంది పేదవారు తినీతినక కష్టపడుతుంటారు. పిల్లల సంక్షేమమే తమ సంక్షేమంగా బతుకుతుంటారు. వాళ్లకు చిన్న కష్టమొచ్చినా భరించలేరు. పాకిస్తాన్‌లో ఓ పోలీసుకు పెద్ద కష్టమే వచ్చింది. తన కొడుక్కి వైద్యం చేయించాలని ఉన్నతాధికారులను సెలవులు అడిగాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తర్వాత అతడు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..


నిసార్ లషారీ అనే వ్యక్తి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల  ఓ కొడుక్కి ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంచి ఆస్పత్రిలో చూపించాలనుకున్నాడు. తనకు సెలవు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సెలవు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని వారు షరతు పెట్టారు. దీంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కొడుకు వైద్యం కోసం దాచుకున్న డబ్బులను లంచంగా ఇస్తే.. ఇక వైద్యం ఎలా చేయించాలని బాధపడ్డాడు. వెంటనే తన ఇద్దరు పిల్లలను తీసుకుని రోడ్డుపైకి వెళ్లాడు.


పిల్లలతో కలిసి పోలీసు దుస్తులతో రోడ్డుపై నిలబడ్డాడు. ‘‘ నా కొడుక్కి ఆరోగ్యం బాలేదు.. ఆపరేషన్ చేయిద్దామంటే అధికారులు సెలవు ఇవ్వలేదు. లంచం ఇస్తేనే సెలవు ఇస్తారంట. అయితే నా దగ్గర అంత డబ్బులు లేవు. దీంతో నా పిల్లలను 50,000(పాకిస్తానీ రూ.లలో)లకు విక్రయిస్తున్నాను. అవసరమైన వారు కొనుక్కోవచ్చు’’.. అంటూ తన అధికారులపై నిరసన తెలియజేశాడు. తాను చాలా పేదవాడినంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, తన బాధను తెలియజేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవడంతో పాటూ నెటిజన్ల నుంచి అతడికి మద్దతు లభించింది. చివరికి ఈ విషయం సింధ్ సీఎం మురాద్ అలీషా వరకు చేరింది. ఆయన ఆదేశాలతో నిసార్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంతో పాటూ కొడుకు వైద్యం కోసం 14 రోజులు సెలవు కూడా మంజూరు చేశారు.



Updated Date - 2021-11-21T22:44:18+05:30 IST