ప్రైవేటు అంతరిక్షయానానికి అమెరికా కొత్త ట్విస్ట్.. ఇక వారికి చుక్కలే..

ABN , First Publish Date - 2021-07-25T01:12:14+05:30 IST

ఇదంతా గతం..! ఎందుకంటే.. ఈ ప్రైవేటు అంతరిక్ష యాత్రలకు అమెరికా విమానయాన శాఖ(ఎఫ్ఏఏ) ఓ కొత్త ట్విస్ట్. అంతరిక్షానికి వెళ్లిన వారందరూ వ్యోమగాములు కాలేరంటూ తేల్చి పారేసింది.

ప్రైవేటు అంతరిక్షయానానికి అమెరికా కొత్త ట్విస్ట్.. ఇక వారికి చుక్కలే..

వాషింగ్టన్: విమానప్రయాణమే ఓ అద్భుత అనుభవమనుకుంటే అంతరిక్ష యాత్ర చేసి రావడమనేది అంతకుమించిన ఫీట్. అంతరిక్ష యాత్రలు చేయాలని, వ్యోమగాములుగా గుర్తింపు పొందాలని ఎందరికో ఉంటుంది. కానీ..ఆ కల నెరవేరడం అంత సులభం కాదు. ఇప్పటివరకూ నాసా వంటి ప్రభుత్వసంస్థలు చేపడుతున్న యాత్రల్లో భాగంగానే వ్యోమగాములు అంతరిక్షాన్ని చూసొచ్చారు. అయితే.. జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి అపరకుబేరుల కారణంగా అంతరిక్షయానం ఇప్పుడు సాధారణ పౌరులకూ అందుబాటులోకి వచ్చింది. 


భారీ ఖర్చును భరించగలిగితే చాలు.. బ్లూ ఆరిజిన్, వర్జిన్ గాలెక్టిక్ సంస్థ ద్వారా ఎవరైనా సరే ఓమారు అంతరిక్షానికి వెళ్లి రావచ్చు. మేమూ వ్యోమగాములమే అంటూ సంబరపడిపోవచ్చు..! అయితే ఇదంతా గతం..! ఎందుకంటే.. ఈ ప్రైవేటు అంతరిక్ష యాత్రలపై అమెరికా విమానయాన శాఖ(ఎఫ్ఏఏ) సంచలన ప్రకటన చేసింది. అంతరిక్షానికి వెళ్లిన వారందరూ వ్యోమగాములు కాలేరంటూ మెలిక పెట్టింది. ఈ మేరకు ‘వ్యోమగామి’ గుర్తింపునకు సంబంధించి ఎఫ్ఏఏ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 


వీటి ప్రకారం.. ఈ గుర్తింపు కోరుకునే వారు ముందుగా ప్రత్యేక శిక్షణ పొందాలి. ‘వ్యోమనౌక సిబ్బంది’ హోదాలో భూమికి కనీసం 80 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి రావాలి. అంతేకాకుండా..యాత్ర సందర్భంగా వారు మానవ అంతరిక్షయాత్రల భద్రత పెంపొందించే కార్యక్రమాలు లేదా పబ్లిక్ సేఫ్టీకి ఉపకరించే కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్టు నిరూపించుకోవాలి. ఈ మార్గదర్శకాల ప్రకారం అమెజాన్ అధినేత బెజోస్ చేపట్టిన యాత్రలో పాల్గొన్న వారెవ్వరికీ వ్యోమగామి గుర్తింపు రాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాత్ర మొత్తం భూమిపై ఉన్న కంట్రోల్ రూం ఆధీనంలో ఉండటంతో వారు కేవలం ప్రయాణికులుగానే మిగిలిపోయారని సమాచారం. 


ఇక వర్జిన్ గాలెక్టిక్ ద్వారా యాత్ర చేపట్టిన వారిని సంస్థ ‘వ్యోమనౌక సిబ్బంది’గా గుర్తింపునిచ్చింది. అయితే.. వారు అంతరిక్షయాత్రల భద్రత పెంపొందించే చర్యలు చేపట్టారా లేదా అనేది తేలాల్సింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, అమెరికా మిలిటరీ.. కేవలం తమ సిబ్బందిని మాత్రమే వ్యోమగాములుగా గుర్తిస్తాయి. సామాన్యులకు ఈ గుర్తింపు దక్కాలంటే తాజాగా అమెరికా విమానయాన సంస్థ ప్రకటించిన నిబంధనలను పాటించాల్సిందే. దీంతో వాణిజ్యపరమైన అంతరిక్షయాత్రలపై అమెరికాలో కొత్త చర్చ మొదలైంది. 

Updated Date - 2021-07-25T01:12:14+05:30 IST