చనిపోయిన ఏడాదికే పుట్టానంటూ పూర్వజన్మను బయటపెట్టిన నాలుగేళ్ల బాలిక.. అసలు కథేంటో తేల్చేద్దామని గతజన్మలోని భర్త ఆమె ఇంటికెళ్తే..

ABN , First Publish Date - 2021-10-04T21:17:39+05:30 IST

ఓ నాలుగేళ్ల బాలిక హటాత్తుగా తన గత జన్మగురించి, అప్పటి తన భర్త, కుమారుడి గురించి చెబుతోంటే ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇదంతా నిజమో, అబద్ధమో తెలియక తల్లకిందులైంది. చివరికి మన జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఈ విషయంలో దర్యాప్తు జరిపించారంటే

చనిపోయిన ఏడాదికే పుట్టానంటూ పూర్వజన్మను బయటపెట్టిన నాలుగేళ్ల బాలిక.. అసలు కథేంటో తేల్చేద్దామని గతజన్మలోని భర్త ఆమె ఇంటికెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: సమస్త సృష్టికి, జననమరణాలకు భగవంతుడే కారణమని మతం చెబుతోంది. కాదు..కాదు.. మనం చూస్తున్నదంతా కొన్ని యాధృచ్ఛిక ఘటనల పర్యవసానం అని అంటోంది సైన్స్. అసలు నిజం ఏదో ఇప్పటికీ మానవుడికి తెలీదు. అంతా మిస్టరీ! అందుకే..జననమరణాలు, పునర్జన్మలు నిత్యం ప్రజల్లో అమితాసక్తిని కలిగిస్తుంటాయి. ఇక 1930ల్లో చోటుచేసుకున్న ఓ ఘటన మాత్రం భారత్‌తో పాటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమ్మా, ఆటలు, తప్ప మరో ప్రపంచం ఎరుగని ఓ నాలుగేళ్ల బాలిక హటాత్తుగా తన గత జన్మగురించి, అప్పటి తన భర్త, కుమారుడి గురించి చెబుతోంటే ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఇదంతా నిజమో, అబద్ధమో తెలియక తల్లకిందులైంది. చివరికి మన జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఈ విషయంలో దర్యాప్తు జరిపించారంటే ఇది ఎంతటి సంచలనానికి దారితీసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ బాలిక ఎవరు.? ఈ పునర్జన్మవృత్తాంతం ఏమిటో తెలుసుకుందాం పదండి..  


శాంతీదేవీ.. ఈ పేరే ఓ సంచలనం! 

శాంతీదేవీ 1926లో న్యూఢిల్లీలో జన్మించింది. నాలుగేళ్లు వచ్చే వరకూ ఆమె ఓ సాధారణ బాలిక.  ఆ తరువాతే ఆమె జీవితానికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.  ఓ రోజు ఆమె తన తల్లిదండ్రులు విస్తుపోయేలా.. వారు తన అసలు తల్లిదండ్రులు కాదని, తన స్వస్థలం మథుర అని చెప్పింది. అంతేకాదు.. గత జన్మలో తనకు భర్త, కుమారుడు కూడా ఉండేవారని చెప్పుకొచ్చింది. మొదట్లో ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోయినా కూడా తరువాత ఆమె మాటల్నీ పిల్లచేష్టలుగా కొట్టిపడేశారు. కానీ శాంతీ దేవీ తరచూ ఇదే ప్రస్తావన తెస్తుండటంతో క్రమంగా వారిలో ఏదో తెలియని భయం మొదలైంది. చివరికి ఓ రోజున వారు ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. గత జన్మలోని విషయాలు, ముఖ్యంగా ఓ ఆపరేషన్ గురించి ఆమె సవివరంగా చెబుతుండటం చూసి వైద్యుడు కూడా షాకైపోయారు. సంక్లిష్టవైద్య ప్రక్రియ గురించి ఆమె అంత చిన్న వయసులోనే వివరించడంతో డాక్టర్‌కు నోటమాట రాలేదు. అయితే.. ఇన్ని విషయాలు చెబుతున్న శాంతీదేవీ చాలా కాలం పాటు తన భర్త పేరు మాత్రం బయటపెట్టలేదు. అప్పట్లో స్త్రీలు తమ భర్తల పేరును ఉచ్ఛరించేవారు కాదు.  ఈ క్రమంలో ఓ రోజు శాంతీదేవీ బంధువు బిస్‌చంద్.. ఆమెను భర్త పేరు చెప్పమని అడిగారు. అతడెవరో చెబితే అతడి ఇంటికి తీసుకెళతానని కూడా మాటిచ్చారు. దీంతో.. తొలిసారిగా ఆమె తన భర్త పేరు కేదార్‌నాథ్ చౌబే అని, ఆయన మథురలో ఉంటారని బయటపెట్టింది. 


ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మథురలో ఉన్న కేదార్‌నాథ్‌కు బిస్‌చంద్ ఓ లేఖ రాశారు. లేఖ చదివిన కేదార్‌నాథ్‌ కూడా మొదట  ఆశ్చర్యపోయారు. ఇందులోని నిజానిజాలు తెలుసుకోవాలంటూ ఢిల్లీలో నివసించే తన బంధువు పండిట్ కంజిమల్‌కు పురమాయించారు. అయితే.. తన ఇంటికొచ్చిన కంజిమల్‌ను చూడగానే శాంతీదేవి కళ్లు మెరిశాయి. ఆయన తన భర్త బంధువని గుర్తుపట్టింది. అంతేకాకుండా.. మథురలో తన ఇంటి గురించి, అక్కడ తాను డబ్బు దాచిపెట్టిన ప్రదేశం గురించీ కూడా సవివరంగా చెప్పింది. ఓ చిన్నారి అన్ని వివరాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయిన కంజిమల్ ఆమె చెబుతున్నవన్నీ నిజమనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని మథురలో ఉన్న కేదార్‌నాథ్‌కు వివరించారు. దీంతో..కేదార్‌నాథ్ శాంతీదేవీని కలిసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో 1935 నవంబర్‌ 12న శాంతీదేవీని చూడటానికి కేదార్‌నాథ్‌, తన కుమారుడు నవనీత్‌లాల్‌తో సహా ఆమె ఇంటికి వచ్చారు. 


ముందుగా.. ఆమెను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ఆయన తనని తాను కేదార్‌నాథ్ అన్నగా పరిచయం చేసుకున్నారు. అయితే.. గదికి ఓ మూలన సిగ్గుపడుతూ నిలబడ్డ శాంతీ దేవీ కేదార్‌నాథ్‌ను చూసిన వెంటనే గుర్తుపట్టింది. ఆయన తన బావగారు కాదని భర్త అని చెప్పడంతో అక్కడున్న వారందరూ షాకైపోయారు. అంతేకాదు కేదార్‌నాథ్‌కు పరోఠాలు అంటే ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది. ఇక కేదార్‌నాథ్‌కు గతంలో రెండు వివాహలయ్యాయి. మొదటి భార్య గతించాక లుడ్గీని రెండో వివాహం చేసుకున్నారు. లుడ్గీ ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి నవనీత్ లాల్ అని పేరు పెట్టారు. అప్పట్లో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆపరేషన్ తరువాత లుడ్గీ పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. లుడ్గీ పోయిన ఏడాది తరువాత శాంతీదేవీ జన్మించింది. కాగా నవనీత్‌లాల్ చూసిన వెంటనే శాంతీదేవీ అతడిని హత్తుకుని విలపించింది. దీంతో.. అక్కడున్న వారందరూ లుడ్గీనే శాంతీదేవీగా జన్మించిందనే నిర్ణయానికి వచ్చారు. అయితే లుడ్గీ మరణించిన తరువాత కేదార్‌నాథ్ మరో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా శాంతీదేవీ ప్రస్తావించింది. తాను పోయిన తరువాత మళ్లీ పెళ్లి చేసుకోనని మాటిచ్చారు కదా అని కేదార్‌ను శాంతీ దేవీ ప్రశ్నించడంతో ఆయనకు నోట మాట రాలేదు. ఆ రోజు రాత్రి శాంతీదేవీతో మరిన్నివిషయాలు చర్చించిన కేదార్.. లుడ్గీయే శాంతీదేవి అన్న నిర్ణయానికి వచ్చేశారు. 


ఈ ఘటనపై  మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. మేధావులు, సామాన్యులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ శాంతీదేవీ గురించి చర్చోపచర్చలు మొదలైయ్యాయి. విషయం చివరికి మహాత్మ గాంధీ దృష్టికి వెళ్లడంతో ఈ విషయమై మరింత లోతైన అధ్యయనం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించేందుకు 15 మంది ప్రముఖులతో కూడిన ఓ దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఇందులో పార్లమెంటు సభ్యులు, జాతీయ నేతలు, మీడియా వారు భాగస్వాములుగా ఉన్నారు. ఈ కమిటీ శాంతీదేవీ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను మథురకు తీసుకెళ్లింది.


1935 నవంబర్ 24న వారు మథురకు చేరుకున్నారు. రేల్వే స్టేషన్‌లో దిగగానే ఆమె తన ఒకప్పటి భర్త అన్నయ్యను టక్కున గుర్తుపట్టింది. అంతేకాకుండా ఆయనకు పాదాభివందనం కూడా చేసింది. ఈ జీవితంలో శాంతీదేవీ ఆయన్ను ముందెన్నడూ కలిసుండకపోవడంతో అక్కడున్న వారందరూ షాకైపోయారు.  ఆ తరువాత కేదార్‌నాథ్ ఇంటికి చేరుకున్న ఆమె అక్కడ తన మామగారిని కూడా చూసిన  వెంటనే గుర్తుపట్టేసింది. ఆ ఇంట్లో తాను డబ్బు ఎక్కడ దాచి పెట్టిందీ కూడా చెప్పింది. ఆ ప్రదేశంలో వెతగ్గా డబ్బు మాత్రం కనిపించలేదు. లుడ్గీ మరణించాక అక్కడున్న డబ్బును తానే తీసేశానని కేదార్‌నాథ్ ఆ తరువాత వెల్లడించారు. కేదార్‌నాథ్ ఇంటి నుంచి బయలు దేరిన శాంతీదేవీ గత జన్మలోని తన తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ గత జన్మలోని తన తల్లిని గుర్తుపట్టేందుకు కాస్త తడబడినప్పటికీ ఆ తరువాత ఆమెను గుర్తించింది. తండ్రిని కూడా గుర్తించింది. తల్లి ఒళ్లో కూర్చుని ఆమె రోదించడం అందరినీ కలిచివేసింది. 


కాగా.. శాంతీదేవీతో పాటూ ప్రయాణిస్తూ ఆమె చెప్పినవన్నీ నిజాలేనని రూఢీ చేసుకున్న కమిటీ సభ్యులు ఆ తరువాత తమ నివేదికను ప్రచురించారు. దీంతో.. శాంతీదేవీ ప్రపంచమంతటా ఓ సంచలనంగా మారింది. ఆమె చెప్పిన విషయాలు, తాను గతజన్మలో సంచరించిన ప్రదేశాల గురించి చెప్పిన విశేషాలన్నీ దాదాపుగా నిజమనే తేలింది. దీంతో.. లుడ్గీ దేవీ ఈ జన్మలో మళ్లీ శాంతిగా పుట్టిందంటూ ప్రజలు భావించారు. జీవితాంతం అవివాహితగానే ఉండిపోయిన శాంతీ దేవీ 1987 డిసెంబర్ 27న మరణించారు. పునర్జన్మలపై విస్తృత పరిశోధనలు చేసిన ఇయాన్ స్టీవెన్‌సన్ శాంతీదేవిని 1986లో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇక లుడ్గీయే శాంతీగా మళ్లీ జన్మించిందా అన్న ప్రశ్నపై ఇయాన్  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శాంతీదేవీతో పాటూ ఆమె తండ్రిని, కేదార్‌నాథ్‌ను, ఇతర ముఖ్యమైన వ్యక్తులను నేను ఇంటర్వ్యూ చేశాను. నా పరిశోధన ప్రకారం.. ఆమె చెప్పిన విషయాలు దాదాపుగా నిజమనే రుజువయ్యాయి’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆమె మళ్లీ పుట్టిందని  నమ్మేవారూ ఉన్నట్టే.. ఈ ఉదంతం అంతా సత్యదూరమని కొట్టిపారేశేవారు ఇప్పటికీ ఉన్నారు.  కానీ పునర్జన్మలకు సంబంధించినంతవరకూ ప్రపంచాన్ని అమితంగా ఆకర్షించింది శాంతీదేవీ ఉదంతం!

Updated Date - 2021-10-04T21:17:39+05:30 IST