కాగితంపై ప్రేమ కవిత్వాన్ని రాసి ఓ 45 ఏళ్ల వివాహితపై విసిరేసిన 54ఏళ్ల వ్యక్తి.. కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2021-08-10T21:55:06+05:30 IST

అతడి వయసు 54 ఏళ్లు.. ఓ వివాహితపై మనసు పారేసుకున్నాడు.

కాగితంపై ప్రేమ కవిత్వాన్ని రాసి ఓ 45 ఏళ్ల వివాహితపై విసిరేసిన 54ఏళ్ల వ్యక్తి.. కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పు ఏంటంటే..

అతడి వయసు 54 ఏళ్లు.. ఓ వివాహితపై మనసు పారేసుకున్నాడు.. ఆమెకు తన ప్రేమను తెలియచెప్పాలనుకున్నాడు.. ఓ కాగితంపై తన ప్రేమను కవిత రూపంలో రాసి ఆమె పైకి విసిరేశాడు.. అతడు చేసిన పని ఆ మహిళకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.. అతడి వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని కోర్టును ఆశ్రయించింది.. ఆ కేసును విచారించిన కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది.


బాధిత మహిళ తన ఇంటి బయట గిన్నెలు తోముతూ ఉండగా.. పక్కనే కిరాణా దుకాణంనిర్వహిస్తున్న వ్యక్తి 2011 అక్టోబర్ 3వ తేదీన ఆమె దగ్గరకు వచ్చి లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. లేఖను తీసుకునేందుకు ఆమె నిరాకరించగా.. అతడు ఆమెపై దానిని విసిరేసి `ఐ లవ్యూ` అని చెబుతూ వెళ్లిపోయాడు. దీంతో బాధిత మహిళ సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును 2018, జూన్‌లో విచారించిన అకోలా సెషన్స్ కోర్టు సదరు వ్యక్తికి 40 వేల రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే మహిళ తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదిస్తూ నిందితుడు హైకోర్టుకు అప్పీలు చేశాడు. 


తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి 90 వేల రూపాయలను జరిమానాగా విధించింది. అందులో రూ.85 వేలు బాధిత మహిళకు చెందాలని పేర్కొంది. ఆమె బతికి లేకుంటే ఆమె వారసులకు ఆ మొత్తం దక్కాలని తీర్పునిచ్చింది. కాగా, అతను ఇప్పటికే 45 రోజుల శిక్షను అనుభవించాడు కాబట్టి.. నేరం జరిగిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని, అతనికి మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంతో జైలు శిక్షను రద్దు చేసింది. 


Updated Date - 2021-08-10T21:55:06+05:30 IST