టీవీలో చెప్పే బంగారం ధరలకు.. దుకాణంలోని ఆభరణాలకు ఎందుకు అంత తేడా? 24 క్యారెట్ల బంగారంతో నగలు ఎందుకు చేయరో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-26T13:59:49+05:30 IST

మనదేశంలో బంగారాన్ని వివిధ క్యారెట్లలో విక్రయిస్తుంటారు.

టీవీలో చెప్పే బంగారం ధరలకు.. దుకాణంలోని ఆభరణాలకు ఎందుకు అంత తేడా? 24 క్యారెట్ల బంగారంతో నగలు ఎందుకు చేయరో తెలిస్తే..

మనదేశంలో బంగారాన్ని వివిధ క్యారెట్లలో విక్రయిస్తుంటారు. క్యారెట్లను అనుసరించి వాటి ధరలు తక్కువగాను, ఎక్కువగా ఉంటాయి. మీరు టీవీలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో చూసే బంగారం ధరకు, జ్యువెలరీ దుకాణంలో విక్రయించే బంగారం ధరకు తేడా కనిపిస్తుంది. టీవీలో 24 క్యారెట్ల బంగారం ధరను చెబుతారు. అయితే దుకాణంలో 22 లేదా 18 క్యారెట్ల బంగారం లభ్యమవుతుంది. బంగారం విక్రయాలలో ఈ విధమైన తేడా ఎందుకుంటుంది? మూడు రకాల క్యారెట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలి? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


24 క్యారెట్ల బంగారం

స్వచ్ఛమైన బంగారాన్ని మూడు వర్గాలుగా విభజించారు, అందులో మొదటిది 24 క్యారెట్లు. ఈ క్యారెట్ బంగారం 99.99 శాతం స్వచ్ఛమైనది. అయితే ఈ క్యారెట్‌ బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించరు. దీనిని బంగారు బిస్కెట్ల రూపంలో విక్రయిస్తారు. 24 క్యారెట్ల బంగారంలోని స్వచ్ఛత కారణంగా ఇది మీ ఆభరణాల పెట్టెలో బిస్కెట్ రూపంలో సురక్షితంగా దాచుకోవాల్సివుంటుంది. ఎవరైనా.. పెట్టుబడుల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే వారు 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. 24 క్యారెట్ల బంగారాన్ని 999 బంగారం అని కూడా అంటారు. 

22 క్యారెట్ల బంగారం

ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. అది 91.67 శాతం స్వచ్ఛమైనది. ఇది పూర్తి స్వచ్ఛమైనది కాదు. దీనితో ఆభరణాలు తయారు చేస్తారు. ఇందులో 8.33 శాతం మేరకు ఇతర లోహాలను కలుపుతారు. ఈ క్యారెట్ బంగారాన్ని 916 బంగారం అంటారు. దీనితో తయారు చేసిన ఆభరణాలలో 22 శాతం మేరకు వెండి, జింక్, రాగి తదితర లోహాలను కలుపుతారు. 


18 క్యారెట్ల బంగారం

18 క్యారెట్ల బంగారం కూడా పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. ఇది 75 శాతం వరకు మాత్రమే స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ఇందులో 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు కలిపి నగలను తయారు చేస్తారు. 

24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను ఎందుకు తయారు చేయరు? 

ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, ఆభరణాలు ఏ కేటగిరీకి చెందుతాయనే విషయాన్ని ఆభరణాల వ్యాపారి.. వినియోగదారునికి తప్పనిసరిగా తెలియజేయాలి. అయితే బంగారం విక్రయదారులు.. పూర్తిగా స్వచ్ఛమైనదిగా పేర్కొనే 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగదారులకు చూపించరు. దీనితో బంగారు నగలు చేయకపోవడమే దీని వెనుకగల ప్రధాన కారణం. వాస్తవానికి స్వచ్ఛత కారణంగా 24 క్యారెట్ల బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే బంగారు ఆభరణాలు చేసేటప్పుడు దీనిలో ఇతర లోహాలు కలపాల్సివుంటుంది. అందుకే 24 క్యారెట్ల కంటే తక్కువ క్యారెట్లు కలిగిన బంగారు ఆభరణాలు మాత్రమే మనకు లభిస్తాయి.

23, 10, 14, 16 క్యారెట్లలో కూడా.. 

24, 22, 18 క్యారెట్లు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఇతర క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంది. 23, 10, 14, 16 క్యారెట్ల బంగారం కూడా మనకు లభ్యమవుతుంది. అయితే ఈ క్యారెట్లను అనుసరించి ఈ బంగారంలో ఇతర లోహాలు కలుపుతారు. ఫలితంగా బంగారం ధరలో కూడా తేడా వస్తుంది.

Updated Date - 2021-12-26T13:59:49+05:30 IST