ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకుని గడుపుతున్న కుటుంబం.. కరోనా భయంతో కాదు.. ఓ అదృశ్య వ్యక్తి వల్లే..!

ABN , First Publish Date - 2021-09-03T16:58:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగు చూసింది. కాన్పూర్‌కు చెందని ఒక కుటుంబం ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతోంది. వాళ్లకదేం అలవాటు?

ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకుని గడుపుతున్న కుటుంబం.. కరోనా భయంతో కాదు.. ఓ అదృశ్య వ్యక్తి వల్లే..!

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగు చూసింది. కాన్పూర్‌కు చెందని ఒక కుటుంబం ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతోంది. వాళ్లకదేం అలవాటు? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే.. మనం కూడా ఆ పనే చేయాల్సి వస్తుందని మీరూ అంటారు. ఇంతకీ వాళ్లకు వచ్చిన సమస్యేంటో తెలుసా? మనిషి కనిపించకుండా ఆ ఇంటిపై రాళ్లదాడి జరుగుతోంది. బర్రాలోని దామోదర్ నగర్‌లో ఆదిత్య శర్మ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటిపై రెండ్రోజులుగా రాళ్ల దాడి జరుగుతోంది. ఈ రాళ్లు ఎవరు విసురుతున్నారు? ఎందుకు విసురుతున్నారు? ఎవరికీ తెలియదు. ఈ రాళ్ల దాడిలో ఇంట్లోని కిటికీల అద్దాలన్ని పగిలిపోయాయని ఆదిత్య చెప్తున్నారు. ఎవరికి ఎప్పుడు గాయాలవుతాయో తెలియక.. ఇంట్లో కూడా హెల్మెట్లు ధరించాల్సి వస్తోందని చెప్పారు.


మంగళవారం ఉదయం 9గంటల నుంచి ఇంటిపై రాళ్లదాడి జరుగుతున్నట్లు ఆదిత్య చెప్పారు. ఇంట్లో తిరుగుతున్నా, కిటికీ సమీపంలో ఉన్నా, బాల్కనీలోకి వచ్చినా, చివరకు డాబాపైకి వెళ్లి బట్టలు ఆరేసే సమయంలో కూడా ఈ కుటుంబ సభ్యుల తలపై హెల్మెట్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ రాళ్ల దాడి విషయంలో పోలీసులకు కూడా ఆదిత్య ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ దాడి జరిగింది. కానీ బయట ఎవరూ లేరు. దీంతో రాళ్ల దాడి ఎవరు చేస్తుందీ కనుక్కోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా తుంటరి యువకులు దూరం నుంచి క్యాట్‌బాల్ వంటి సాధనంతో రాళ్ల దాడి చేస్తున్నారేమో? అని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ దాడి ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు తెలియలేదు.

Updated Date - 2021-09-03T16:58:25+05:30 IST