కళాశాలలో క్లాసు జరుగుతుండగా.. సడన్‌గా లోపలికి వచ్చిన పులి.. ఓ విద్యార్థిపై దాడి.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-12-12T00:38:19+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్ కళాశాలలో అంతా బుద్ధిగా క్లాసు వింటున్నారు. ఇంతలో సడన్‌గా ఓ పులి అక్కడకు వచ్చింది. అదును చూసి..

అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామస్తులు భయం భయంగా కాలం గడుపుతుంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో అనే ఆందోళనలో ఉంటారు. చాలా సార్లు క్రూర మృగాలు గ్రామాల్లోకి రావడం.. జంతువులు, మనుషులపై దాడులు చేయడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్ కళాశాలలో అంతా బుద్ధిగా క్లాసు వింటున్నారు. ఇంతలో సడన్‌గా ఓ పులి అక్కడకు వచ్చింది. అదును చూసి ఓ విద్యార్థిపై దాడి చేసింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లా ఛర్రా అనే ప్రాంతం అడవికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడి చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లో ఓ రోజు క్లాసు జరుగుతోంది. టీచర్ పాఠం చెబుతుంటే విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా.. ఓ పులి అడవి నుంచి నేరుగా కళాశాల కాంపౌండ్‌లోకి చొరబడింది. తరగతి గది వద్దకు వెళ్లి దాడి చేసేందుకు పొంచి ఉంది. కొద్ది సేపటి తర్వాత ఓ విద్యార్థిపై సడన్‌గా దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పులిని చూసిన వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. విద్యార్థిపై దాడి చేసిన పులి.. అనంతరం వేరే గదిలోకి దూరింది. కాలేజీ యాజమాన్యం పోలీసులు, అటవీ అధికారులకు సమాచారమిచ్చింది. అక్కడికి చేరుకున్న అటవీ, వైల్డ్ లైఫ్ ఎస్‌ఓఎస్ సిబ్బంది.. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి పులిని పట్టుకోగలిగారు. గాయపడ్డ విద్యార్థి కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.