రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతూ బాలిక శవం.. ఎందుకు చంపారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-07-22T17:45:33+05:30 IST

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతూ 17 ఏళ్ల మైనర్‌ బాలిక మృతదేహం..

రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతూ బాలిక శవం.. ఎందుకు చంపారో తెలిస్తే..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతూ 17 ఏళ్ల బాలిక మృతదేహం.. ఒకరోజు మొత్తం ఆ మృతదేహం రైల్వే వంతెన కింద వేలాడుతూనే ఉంది.. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. ఆ బాలిక కుటుంబ సభ్యుల వివరాలు సంపాదించి విచారించారు.. విచారణలో ఆ బాలికను తాత, మామయ్యలు హత్య చేసినట్టు తేలింది.. ఆ బాలికను ఎందుకు హత్య చేశారో తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు. హత్యకు గురైన బాలిక ఇటీవలె తన తల్లితో కలిసి యూపీలోని డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. అయితే వచ్చిన నాటి నుంచి ఆ బాలిక పద్ధతి ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. ఆమె ధరిస్తున్న దుస్తులు, ప్రవర్తన ఆ బాలిక తాతకు, మామయ్యలకు ఆగ్రహం తెప్పించాయి. అలాంటి బట్టలు వేసుకోవద్దని వారు ఆ బాలికను హెచ్చరించారు. అయితే ఆ బాలిక వారి మాటలను పట్టించుకోలేదు. రెండ్రోజుల క్రితం ఈ విషయమై బాలిక, ఆమె తాత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాలిక తనకు ఎదురుతిరగడంతో ఆగ్రహానికి గురైన ఆమె తాత క్షణికావేశంలో ఆమె తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో భయపడిన తాత, మామయ్యలు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. 


మార్గ మధ్యంలోనే ఆ బాలిక మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చి అక్కడి నుంచి కిందకు తోసేశారు. అయితే కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకుపోవడంతో మృతదేహం తలకిందులుగా వేలాడింది. దానిని గమనించని కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆ మృతదేహం అక్కడే వేలాడింది. కొందరు స్థానికులు ఆ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆ బాలిక తాతను అరెస్ట్ చేశారు. మామయ్యలు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-07-22T17:45:33+05:30 IST