‘అమ్మా.. నాన్నా.. క్షమించండి.. వాళ్లు పెట్టిన ప్రాణభిక్షతో నేను బతకలేను..’

ABN , First Publish Date - 2021-12-30T20:49:36+05:30 IST

కాలేజీ గొడవలు ఓ విద్యార్థి ప్రాణం తీశాయి. ప్రత్యర్థుల చేతుల్లో తీవ్ర చిత్రహింసలకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

‘అమ్మా.. నాన్నా.. క్షమించండి.. వాళ్లు పెట్టిన ప్రాణభిక్షతో నేను బతకలేను..’

కాలేజీ గొడవలు ఓ విద్యార్థి ప్రాణం తీశాయి. ప్రత్యర్థుల చేతుల్లో తీవ్ర చిత్రహింసలకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని గురువరాజుపేట గ్రామానికి చెందిన కుమార్‌ (19) చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి చెన్నైలోని కాలేజీకి కుమార్ రైలులో వెళ్లి వస్తుంటాడు. మంగళవారం కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా పచ్చప్ప కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు కుమార్‌ను కిడ్నాప్ చేశారు. 


రైలు నుంచి కిందకు దింపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. రాత్రి 10 గంటలకు వదిలిపెట్టారు. కుమార్‌ను చిత్రహింసలకు గురి చేసిన వీడియో, ఆడియోను రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. `ప్రత్యర్థులు పెట్టిన ప్రాణభిక్షతో బతకాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించండి` అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


విషయం తెలుసుకున్న ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులు తిరువళ్లూరుకు చేరుకున్నారు. కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసే వరకు విశ్రమించబోమని నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింప చేశారు. కుమార్‌ను చిత్రహింసలు పెట్టిన వారి కోసం గాలింపులు ప్రారంభించారు. 

Updated Date - 2021-12-30T20:49:36+05:30 IST