అంతరిక్ష వైన్.. బాటిల్ ధర ఎంతో తెలుసా?
ABN , First Publish Date - 2021-05-05T15:53:47+05:30 IST
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఏడాదికి పైగా పులియబెట్టిన వైన్ ఖరీదెంత ఉంటుంది?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఏడాదికి పైగా పులియబెట్టిన వైన్ ఖరీదెంత ఉంటుంది? ఐఎస్ఎస్లో ఏడాదికి పైగా ఉన్న `పెట్రస్ 2000` అనే ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఈ బాటిల్‌కు 10 లక్షల డాలర్ల (దాదాపు 7 కోట్ల రూపాయలు) ధర పలకొచ్చని అంచనా వేస్తోంది. భూమికి వెలుపల వ్యవసాయం చేసే అవకాశాలపై పరిశోధన చేసేందుకు `స్పేస్ కార్గో అన్లిమిటెడ్` అనే సంస్థ 2019 నవంబర్‌లో 19 వైన్ బాటిల్స్‌ను అక్కడికి పంపింది.
దాదాపు 14 నెలల తర్వాత వీటిని తిరిగి భూమి పైకి తీసుకొచ్చింది. భూమిపై అంతే కాలం పులియబెట్టిన వైన్‌తో వీటి రుచిని పరిశోధకులు పోల్చి చూశారు. భూమిపై ఉన్న పానీయంతో పోల్చితే రోదసీలోకి వెళ్లి వచ్చిన వైన్ రుచిగా, మృదువుగా, సువాసనభరితంగా ఉందని తేల్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ పరిశోధన చేశారు.