పాము కాటు నుంచి రక్షించే బూట్లు

ABN , First Publish Date - 2021-11-28T22:19:56+05:30 IST

కార్లు, బైకులు డిజైన్‌ చేయడం నేర్చుకున్న ఆ ముగ్గురు మిత్రులు రైతుల కోసం ఏమైనా చేయాలనుకున్నారు..

పాము కాటు నుంచి రక్షించే బూట్లు

భూమి పుత్రులకు పాద‘రక్ష’

కార్లు, బైకులు డిజైన్‌ చేయడం నేర్చుకున్న ఆ ముగ్గురు మిత్రులు రైతుల కోసం ఏమైనా చేయాలనుకున్నారు. రెండేళ్ల పాటు ఊరూరా తిరిగి అన్నదాతల అవసరాలను గుర్తించారు. పొలాల్లో చెప్పుల్లేకుండా తిరిగే కర్షకుల కష్టం చూసి చలించారు. రైతుల పాదాల్లోని ముళ్లు, రాళ్లు, కొయ్యకాళ్ల గాయాలతో పాటు పగుళ్లను చూసి తల్లడిల్లారు. ఆ బాధ నుంచి పుట్టిన ఆలోచనతో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఆ ముగ్గురు కుర్రాళ్లు ‘ఎర్తన్‌ ట్యూన్‌ డిజైన్స్‌’ బ్రాండ్‌ పేరుతో రైతులకు ప్రత్యేకంగా బూట్లు తయారు చేశారు. 

సంతోష్‌ (హైదరాబాద్‌), విద్యాధర్‌, నకుల్‌ (మహారాష్ట్ర)... అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐటి)లో కలిసి చదివారు. తర్వాత ముంబాయిలోని ఒక పరిశ్రమ సహకారంతో ఎలకా్ట్రనిక్‌ వీల్‌ఛైర్‌నూ రూపొందించారు. అంతటితో సంతృప్తి చెందని వాళ్లు తమ డిజైన్‌ థింకింగ్‌తో రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లోని కొన్ని మారుమూల పల్లెలకు వెళ్లి రైతు అవసరాలపై రెండేళ్లు అధ్యయనం చేశారు. అప్పుడే రైతులు చెప్పుల్లేకుండా పొలాల్లో పనిచేయడం చూసి చలించారు. నెర్రెలుబారిన నేలను తలపించే అన్నదాతల అరికాళ్లలోని పగుళ్లు ఆ ముగ్గురు మిత్రులను ఆలోచింపచేశాయి. ‘‘పొలంలో పనిచేస్తున్నప్పుడు రైతులకు అడవి తుమ్మ ముళ్లు గుచ్చుకోవడం, పాదాల్లో కొయ్యకాళ్లు దిగడం సహజం. ఆకాశంలోని చుక్కల్ని, తమ అరికాళ్లలో ఇరిగిన ముళ్లను లెక్కించడం కష్టమని ఒక రైతు అన్న మాటలు మా మనసుని మెలిపెట్టాయి. దేశంలో చాలారకాల షూ బ్రాండ్స్‌ ఉన్నాయి. కానీ అవేవీ రైతులకు ఉపయోగపడవు. గమ్‌ బూట్లు కూడా సాగు పనులకు అనువు కాదని గమనించాం. కనుక రైతుల కోసమే ప్రత్యేకంగా పాదరక్షలు తయారుచేయాలి. అవి తడి, పొడి వాతావరణానికి అనుకూలంగా, తేలికపాటి బరువుతో వాడకానికి సులువుగా ఉండాలి అనుకున్నాం’’ అంటారు ఎర్తన్‌ట్యూన్‌ డిజైనర్స్‌ నిర్వాహకులు. మొదటగా అరటిబోద మిశ్రమం, కొబ్బరిపీచు, జనపనార వంటి పదిహేను రకాల మెటీరియల్స్‌తో ముఫ్ఫై రకాల బూట్లను తయారు చేసి.. ప్రయోగాత్మకంగా మాగాణి, మెట్ట ప్రాంతాల్లోని కొందరు రైతులకు అందించారు. 


గొంగడితో ప్రయోగం...

రైతుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బూట్లు నీటిలో తడవగానే పాడైపోవడం, షూ భాగాలు దేనికదే ఊడిపోవడంతో అవి వ్యవసాయ పనులకు అనుకూలం కాదని మన యువ పరిశోధకులు గుర్తించారు. వర్షంలో తడవకుండా రక్షణగా నిలిచే గొంగడి వాళ్ల మదిలో మెదిలింది. ‘‘అప్పుడు ఉన్నితో తయారు చేసిన నూలుతో బూటు పై భాగాన్ని(అప్పర్‌ సోల్‌) మొదట చేతితో ఒకటి అల్లాం. సాధారణంగా మన వద్ద అప్పర్‌సోల్‌ను, ఇన్నర్‌ సోల్‌ను, అవుటర్‌ సోల్‌ను గమ్‌తో అంటిస్తారు. లేదంటే కుడతారు. నిజానికి అలా తయారు చేసిన బూట్లు రైతులకు పెద్దగా అనుకూలం కాదు. పైగా తేమలో పనిచేస్తున్న క్రమంలో అవి తరచుగా ఊడిపోవడమో, తెగిపోవడమో జరుగుతాయి. కనుక పీయూ మెటీరియల్‌తో చేసిన ఇన్నర్‌ సోల్‌కు ఉన్నితో అల్లిన అవుటర్‌ సోల్‌ను మౌల్డ్‌ చేసే కొత్త పద్ధతినికనుగొన్నాం. అలా చేసిన బూట్లను మళ్లీ కొందరు రైతులకు వాడమని ఇచ్చాం. ఈ లోపు మా ప్రొడక్టు గురించి తెలిసి మద్రాస్‌ ఐఐటీ వాళ్లు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. క్షేత్ర స్థాయి ప్రయోగంలో ఉన్ని బూట్లు తమకు అనువుగా ఉన్నాయని రైతులంతా చెప్పారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి (సిఎస్‌ఐఆర్‌)లో నాణ్యతను పరీక్షిస్తే మంచి ఫలితం వచ్చింది’’ అని చెబుతున్నారు సంతోష్‌, నకుల్‌, విద్యాధర్‌ మిత్రబృందం.


ఆన్‌లైన్‌లో కొనొచ్చు...

రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లను ‘ఎర్తన్‌ ట్యూన్‌ డిజైన్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ‘‘రెండు నెలల కిందట ఫార్మర్‌ ఫ్రెండ్లీ షూస్‌ మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ బూట్లను రూ.750 కే ఇస్తున్నాం. అదీ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నాం. ఈ బూట్ల ద్వారా లాభం గడించడం మా ఉద్దేశం కాదు. రెండు నెలల్లో జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లోని రైతుల నుంచి ఆర్డర్లు రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో స్థిరపడిన పిల్లలు వ్యవసాయం చేసే తమ తల్లిదండ్రులకు ఈ షూస్‌ను కానుకగా ఇస్తున్నారని తెలిసింది’’ అని చెబుతున్నారు నకుల్‌. ప్రస్తుతం ఈ మిత్ర బృందం పాము కాటు నుంచి రక్షించే పాద రక్షలనూ ప్రత్యేకంగా రూపొందించారు.అయితే అవి ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి. 

- కారుసాల వెంకటేశ్‌

Updated Date - 2021-11-28T22:19:56+05:30 IST