కుటుంబాలనే కాదు.. పెంపుడు జంతువులనూ అనాథలను చేస్తున్న మహమ్మారి!

ABN , First Publish Date - 2021-05-08T20:54:32+05:30 IST

దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న విషాదంలో ఇది మరో విషాదం. మహమ్మారి కారణంగా కుటుంబాలు అయినవాళ్లను కోల్పోతుంటే

కుటుంబాలనే కాదు.. పెంపుడు జంతువులనూ అనాథలను చేస్తున్న మహమ్మారి!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న విషాదంలో ఇది మరో విషాదం. మహమ్మారి కారణంగా కుటుంబాలు అయినవాళ్లను కోల్పోతుంటే అప్పటి వరకు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయిన పెంపుడు జంతువులు ఒక్కసారిగా అనాథలుగా మారుతున్నాయి. ఆత్మీయులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోతున్న కుటుంబాలు పెంపుడు జంతువుల బాగోగులపై దృష్టిసారించలేకపోతున్నాయి. ఫలితంగా ఇవన్నీ ఒక్కసారిగా ఒంటరితనంలోకి జారుకుంటున్నాయి.  


కరోనాతో యజమానులు మృతి చెందడం వల్లో, లేదంటే ఆసుపత్రులలో చికిత్స పొందుతుండడం వల్లే అనాథలుగా మారిన పెంపుడు శునకాలను పట్టించుకునే దిక్కులేకుండా పోతోంది. ఫలితంగా వాటిని దత్తత తీసుకోవాలంటూ లెక్కలేనని విజ్ఞాపనలు వస్తున్నట్టు నోయిడాలోని యానిమల్ హాస్పిటల్ అండ్ షెల్టర్‌కు చెందిన అనురాధా డోగ్రా తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదుకునే మంచి మనసులు కూడా కొన్ని ఉన్నాయి. యజమానుల మృతి, లేదంటే ఆసుపత్రి పాలైన వారి పెంపుడు జంతువుల సమాచారం ఉంటే చెప్పాలని, తాను వాటి సంరక్షణ చూస్తానంటూ ఫరీదాబాద్‌కు చెందిన పారుల్ తనేజా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అంతే.. ఆమె ఇన్‌బాక్స్ కొన్ని నిమిషాలకే నిండిపోయింది. 


దత్తత కోసం లెక్కలేకుండా వచ్చిపడుతున్న రిక్వెస్టులతో జంతు సంరక్షణ వలంటీర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న వేళ పెంపుడు జంతువుల సంరక్షణ చూడలేనివారు దత్తత కోసం సోషల్ మీడియాలో నేరుగా పోస్టులు పెట్టకుండా ఆ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రాలకు సమాచారం అందించాలని డోగ్రా సూచించారు. అలాంటి శునకాలను దత్తత తీసుకునే ముందు వాటిని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అవి అడల్ట్ డాగ్స్ అయితే కనుక వాటి ప్రవర్తన, స్వభావం కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాటి విషయంలో కొంత జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. 


జంతు సంరక్షణ వలంటీరు అయిన రుచి గుప్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒంటరిగా మారిన శునకాల గురించి తొలుత రెసిడెంట్ వెల్ఫేర్ అసిసియేషన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే రెస్క్యూ ఆర్గనైజేషన్లకు, వలంటీర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాథలుగా మారిన పెంపుడు శునకాలను దత్తత తీసుకోవాలంటూ వస్తున్న పోస్టులపై ‘జెఫరీస్’ వ్యవస్థాపకురాలు అచల్ గుప్తా మాట్లాడుతూ.. ఆ పెంపుడు జంతువులు నిజంగానే అనాథలుగా మారాయా? అన్న విషయాన్ని మరోమారు నిర్ధారించుకున్న తర్వాతే ఇలాంటి పోస్టులు పెట్టాలని కోరారు. కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరడంతో అనాథలుగా మారిన దాదాపు 45-50 శునకాల సంరక్షణ బాధ్యతను అచల్ గుప్తా చూస్తున్నారు.  


Updated Date - 2021-05-08T20:54:32+05:30 IST