చెత్తలో బంగారు నాణెం... తిరిగిచ్చిన కార్మికురాలు

ABN , First Publish Date - 2021-10-19T22:06:37+05:30 IST

ఆమె పారిశుద్ధ్య కార్మికురాలు. చెత్తను శుభ్రం చేస్తున్నప్పుడు ఓ కాగితంలోంచి బయటపడిన నాణెం ఠంగుమని కిందపడింది

చెత్తలో బంగారు నాణెం... తిరిగిచ్చిన కార్మికురాలు

చెన్నై: ఆమె పారిశుద్ధ్య కార్మికురాలు. చెత్తను శుభ్రం చేస్తున్నప్పుడు ఓ కాగితంలోంచి బయటపడిన నాణెం ఠంగుమని కిందపడింది. పసుపు రంగులో ధగధగ మెరుస్తున్న దానిని చూసి అదేదో ఇత్తడి నాణెమని అనుకుంది. అనుమానం వచ్చి చేత్తో తీసి చూస్తే బరువుగా ఉండడంతో అది బంగారపు నాణెమని ఇట్టే గుర్తించింది.


వెంటనే ఆ విషయాన్ని తన పై అధికారి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ద్వారా అది పోగొట్టుకున్న వారికి అప్పగించింది. ఇంతకీ, ఆ నాణెం విలువ ఎంతో తెలుసా? దాదాపు ఐదు లక్షల రూపాయలు. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి అందరూ ఫిదా అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ ఘటన. 


గణేశ్ రామన్ అనే వ్యక్తి కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా కాలంగా కూడబెడుతూ వస్తున్న డబ్బులతో ఇటీవల 100 గ్రాముల బంగారం నాణెం కొనుగోలు చేశాడు. ఆ నాణేన్ని గులాబీ రంగు పేపర్‌లో చుట్టి బెడ్ కింద పెట్టాడు. అయితే, ఓ రోజు అది కనిపించకపోవడంతో అతడి గుండె ఆగిపోయినంత పనైంది. భార్యను అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని షాకయ్యాడు. ఇంటిని శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని చెత్తలో పడేశానని చెప్పింది. దీంతో విస్తుపోయిన గణేశ్ రామన్ వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు.


వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని చెత్తను శుభ్రం చేసింది ఎవరో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడం మొదలుపెట్టారు. వారు ఆ పనిలో ఉండగానే మేరీ అనే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను క్లీన్ చేస్తుండగా ఇది దొరికిందంటూ 100 గ్రాముల బంగారు నాణేన్ని టేబుల్‌పై పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పోలీసులు గణేశ్ రామన్‌కు కబురుపెట్టారు. మేరీ చేతుల మీదుగా పోగొట్టుకున్న బంగారు నాణేన్ని తిరిగి అతడికి ఇప్పించారు.


పోయిందనుకుని ఆశలు వదిలేసుకున్న ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు నాణెం తిరిగి తన దగ్గరకు చేరడంతో గణేశ్ రామన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంత విలువైన బంగారం నాణెం దొరికినా నిజాయతీగా దానిని పోలీసులకు అప్పగించిన మేరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Updated Date - 2021-10-19T22:06:37+05:30 IST