60 నిమిషాల్లో బుల్లెట్ థాలీ తింటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫ్రీ
ABN , First Publish Date - 2021-01-20T20:58:35+05:30 IST
పసందైన బుల్లెట్ థాలీని తినే దమ్మున్నోడికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

పుణే : పసందైన బుల్లెట్ థాలీని తినే దమ్మున్నోడికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బహుమతిగా ఇస్తామని పుణేలోని ఓ హోటల్ ప్రకటించింది. థాలీయే కదా తినేద్దామనుకుంటే సరిపోదు. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. అవేమిటంటే, ఈ బుల్లెట్ థాలీ నాన్ వెజిటేరియన్ ఆహారం. నాలుగు కేజీల మటన్, ఫిష్‌తో దీనిని తయారు చేస్తారు. 12 రకాల ఆహార పదార్థాలు దీనిలో ఉంటాయి. ఈ థాలీని 60 నిమిషాలలోగా తినేయాలి. అలా తినేసినవారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను బహుమతిగా ఇస్తామని శివరాజ్ హోటల్ ప్రకటించింది.
వడగావ్ మావల్ ఏరియాలో ఈ హోటల్ ఉంది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ హోటల్ యాజమాన్యం ఈ ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఈ సవాలును స్వీకరించాలనుకునేవారు నాలుగు కేజీల థాలీని ఆరగించడానికి సిద్ధమవాలి. డ్రై మటన్, చికెన్ మసాలా, ప్రాన్ బిరియానీ, చికెన్ తందూరీ, ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ సురమాయీ, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా ఉంది. వీటన్నిటినీ తినాలి. అది కూడా 60 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేయాలి.
రూ.2,500 చెల్లించి ఈ బుల్లెట్ థాలీ ఛాలెంజ్‌ని స్వీకరించవచ్చు. కస్టమర్లను ఆకర్షించేందుకు సొగసైన ఐదు రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లను హోటల్ ప్రాంగణంలో ఉంచారు. కస్టమర్లు పెరగడంతో హోటల్ యాజమాన్యం కలలు నెరవేరుతున్నాయి. మరి ఈ బైక్‌లు ఎవరి సొంతం కాబోతున్నాయో!