ప్రియాంకా చోప్రా, విరాట్ కోహ్లీ.. వీళ్లు ఇన్‌స్టాగ్రాంలో పెట్టే ఒక్కో పోస్ట్ విలువ ఇన్ని కోట్లా..!
ABN , First Publish Date - 2021-07-02T20:16:36+05:30 IST
ఆటగాళ్లకు, సినిమా తారలకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు, సినిమా తారలకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. వాళ్లేం చెప్పినా, ఏం చేసినా ఆసక్తి కనబరిచే వారు కోట్లలో ఉంటారు. ఆ ఆదరణను క్యాష్ చేసుకునేందుకు వారికి బోలెడన్ని మార్గాలున్నాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వారి ఆదాయాలు తారస్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. భారీ సంఖ్యలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్న వారు ఒక్క పోస్ట్‌తో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తరఫున ముందు వరసలో ఉన్నాడు.
తాజాగా హెచ్పర్క్యూ సంస్థ 2021 ఇన్స్టాగ్రామ్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. భారత్‌లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను అధిక సంఖ్యలో కలిగి ఉన్న విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు ద్వారా 6,80.000 డాలర్లు(దాదాపు5.08 కోట్లు) అందుకుంటున్నాడు. దీంతో ఈ జాబితాలో కోహ్లీ 19 స్థానంలో నిలిచాడు. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ కూడా కోహ్లినే. ఇక, కోహ్లీ తర్వాత గ్లోబల్ స్టార్ ప్రియాంక ఈ జాబితాలో 27వ స్థానంలో నిలిచింది. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో పోస్ట్‌కు దాదాపు రూ.3 కోట్లు అందుకుంటుంది. మొత్తం 395 మంది సెలబ్రిటీలు ఉన్న ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు వీరిద్దరే.
ఈ జాబితాలో ప్రఖ్యాత ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ పోర్చుగల్ ఆటగాడు ఒక్కో పోస్ట్‌కు దాదాపు 11.9 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. రొనాల్డో తర్వాత హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, అరియానా గ్రాండే, కైలీ జెన్నర్, సెలెనా గోమెజ్ వరుసగా తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.
