ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడని గొడవ.. ఆ గొడవ ఎంత ఘోరానికి కారణమైందంటే..!

ABN , First Publish Date - 2021-12-25T18:27:44+05:30 IST

వారిద్దరూ బంధువులు.. మేనమామ, మేనల్లుడు.. పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తుంటారు..

ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడని గొడవ.. ఆ గొడవ ఎంత ఘోరానికి కారణమైందంటే..!

వారిద్దరూ బంధువులు.. మేనమామ, మేనల్లుడు.. పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తుంటారు.. ఓ స్థలం విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ఒకరంటే ఒకరికి పడదు.. ఇద్దరి మధ్య మనస్పర్థలున్నాయి.. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేనమామ ఇంటి ఎదురుగా మేనల్లుడు బైక్ పార్క్ చేశాడు.. ఆ బైక్ అలా పెట్టినందుకు మేనమామ గొడవ పెట్టుకున్నాడు.. ఆ గొడవ తీవ్రం కావడంతో మేనల్లుడిని మేనమామ ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు.. ఆ కేసులో తీర్పు చెప్పిన న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. రాజస్థాన్‌లోని పాలిలో ఈ ఘటన జరిగింది. 


పాలికి సమీపంలోని నానా నగర్ గ్రామానికి చెందిన భేరారామ్‌కు, అతని మేనమామ ఇంద్రారామ్‌కు మధ్య ఓ స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరాయి. 2018 ఫిబ్రవరి 22వ తేదీన భేరారామ్ బయటి నుంచి వచ్చి తన బైక్‌ను ఇంద్రారామ్ ఇంటి ముందు పార్క్ చేశాడు. ఆ బైక్ తీయమని భేరారామ్‌తో ఇంద్రారామ్ గొడవకు దిగాడు. ఆ గొడవ చాలా తీవ్రంగా మారింది. 


ఆగ్రహానికి గురైన ఇంద్రారామ్ పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని భేరారామ్ తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భేరారామ్ అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంద్రారామ్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ కేసును విచారించిన పాలి కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. ఇంద్రారామ్‌కు జీవిత ఖైదు విధించింది. 


 

Updated Date - 2021-12-25T18:27:44+05:30 IST