అర నిమిషంలోనే ప్రసవం.. బ్రిటన్ మహిళ రికార్డు!
ABN , First Publish Date - 2021-05-08T19:02:20+05:30 IST
బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన అంతా అంతా కాదు.

బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన అంతా అంతా కాదు. కొన్ని సార్లు ఈ నొప్పులు గంటల తరబడి ఉంటాయి. అయితే బ్రిటన్కు చెందిన 29 ఏళ్ల సోఫీ బగ్ మాత్రం ఎలాంటి పురుటి నొప్పులూ లేకుండా కేవలం 27 సెకెండ్లలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది.
హాంప్షైర్లో నివసిస్తున్న సోఫీ బగ్ 38 వారాల నిండు గర్భిణి. ఇటీవల అర్ధరాత్రి ఆమె బాత్రూంకు వెళ్లగా.. పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో సాయం కోసం భర్తను పిలిచింది. భర్త క్రిస్ వచ్చే సరికి బాత్రూం బయట మెట్లపై కూర్చుని ఉంది. భర్త సూచనతో ఒక్క పుష్ ఇచ్చింది. దీంతో కొన్ని క్షణాల్లోనే బిడ్డ బయటకు వచ్చింది. `బాత్రూంకు వెళ్లాక సోఫీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె నన్ను పిలిచింది. నేను వెళ్లే సరికి బాత్రూం బయట సోఫీ కూర్చొని ఉంది. అప్పటికే ప్రసవం అవుతోందని గ్రహించాను. గట్టిగా పుష్ చేయమని చెప్పాను. తను అలాగే చేసింది. దీంతో కేవలం 27 సెకన్లలోనే పాప జన్మించింది. అంతా చాలా వేగంగా జరిగిపోయింద`ని క్రిస్ చెప్పాడు.
వేగంగా ప్రసవించిన మహిళగా సోఫీ రికార్డు సృష్టించింది. ఇంత వేగంగా బిడ్డకు జన్మనివ్వడం సోఫీకి ఇదే మొదటి సారి కాదు. తన మొదటి బిడ్డనూ సోఫీ ఇంతే వేగంగా ప్రసవించింది. బాత్రూంకి వెళ్లిన 12 నిమిషాల్లోనే ఆమె తొలి బిడ్డను ప్రసవించింది. రెండో ప్రసవం కూడా బాత్రూంకి వెళ్లిన 26 నిమిషాల్లో జరగడం విశేషం. తాజాగా మూడో బిడ్డను కేవలం 27 సెకెండ్లలోనే ప్రసవించి రికార్డు సృష్టించింది.