చనిపోయిన 8 రోజులకు ఆమె సమాధిని తవ్వేందుకు ప్రయత్నాలు మొదలు.. వివాహిత కుటుంబానికి ఊహించని షాక్!

ABN , First Publish Date - 2021-08-26T02:54:17+05:30 IST

వివాహిత మరణం.. చనిపోయిన 8 రోజులకు ఆమె సమాధిని తవ్వేందుకు ప్రయత్నాలు మొదలు! అత్తారింటి వారిపై కేసు నమోదు!

చనిపోయిన 8 రోజులకు ఆమె సమాధిని తవ్వేందుకు ప్రయత్నాలు మొదలు.. వివాహిత కుటుంబానికి ఊహించని షాక్!

ఇంటర్నెట్ డెస్క్: రుక్సార్ ఓ వివాహిత. భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆమె తన సోదరితో ఫోన్‌లో మాట్లాడింది. ఆన్‌లైన్‌లో బెడ్ షీట్లు ఆర్డరిస్తున్నానని చెప్పింది.. ఆ తరువాత.. ఇతర పిచ్చాపాటీ విషయాలేవో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. దీంతో.. రుక్సార్ అత్తారింటిలో సంతోషంగానే ఉంటోందని ఆమె కుటుంబసభ్యులు భావించారు. ఆ రాత్రే వారికి రుక్సార్ అత్తారింటి నుంచి ఊహించని కబురు అందింది. ‘అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. ’అంటూ వారు భయంకరమైన వార్త చెప్పారు.


దీంతో ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే వారు రుక్సార్ అత్తారింటికి చేరుకున్నారు.  ఆ తరువాత రుక్సార్ తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో అత్తింటి వారు హడావుడిగా కర్మకాండలు కానిచ్చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత.. ఈ ఉదంతం మరో మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే స్థానిక పోలీసులు  ప్రస్తుతం ఆమె సమాధిని తవ్వి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన రుక్సార్ (29) జహాజ్‌పూర్ మండలం అమర్‌గఢ్ గ్రామంలో నివసిస్తుంటుంది. అమెకు పదేళ్ల క్రితమే రషీద్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే..ఆగస్టు 16న ఆమె మృతి చెందినట్టు అత్తింటి వారు రుక్సార్ సోదరుడు ఫిరోజ్‌కు కబురంపారు. దీంతో..అతడు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన రుక్సార్ ఇంటికి చేరుకున్నాడు. అయితే.. రుక్సార్ ఉరి పోసుకుని మృతి చెందినట్టు అత్తింటి వారు చెప్పారు. కానీ..సోదరి మొహం చూసేందుకు కూడా ఫిరోజ్‌ను అనుమతించలేదు.


అదే రోజు రాత్రి హడావుడిగా అంత్యక్రియలు కానిచ్చేశారు. పోలీసులకు కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. కానీ..ఫిరోజ్‌కు మాత్రం సందేహం కలిగింది. తన సోదరి ఇంజినీరింగ్ పట్టాపుచ్చుకున్న వనిత. అంతేకాదు..ఆ రోజు తన సోదరితో ఫోన్లో మాట్లాడింది. ఆ సమయంలో ఆమె బాధపడుతున్నట్టు సోదరికి అసలేమాత్రం అనిపించలేదు. అతడి మనసులో ఏదో సందేహం. గతంలో రుక్సార్ అత్తారింట్లో ఎదుర్కొన్న వేధింపులన్నీ గుర్తొచ్చాయి. దీంతో.. అతడు పోలీసులను ఆశ్రయించాడు. 


రుక్సార్ నల్లగా ఉందన్న కారణంతో ఆమె అత్తారింట్లో నిత్యం వేధింపులు ఎదుర్కొనేదని ఫిరోజ్ పోలీసులకు తెలిపాడు. పెళ్లైన కొత్తలో ప్రతిక్షణం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో వారు ఆమెపై భౌతిక దాడులకు కూడా దిగారు. ఇలా అత్తారింటి ఆరళ్లు ఎక్కువవడంతో ఒకానొక సమయంలో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అయితే.. భర్త ఆమెను బుజ్జగించి మళ్లీ తనతో తీసుకెళ్లిపోయాడని ఫిరోజ్ పోలీసులకు చెప్పాడు. ఈ వివరాలన్నీ విన్న పోలీసులు.. భర్త, అత్తమామలపై కేసు చేశారు. అంతేకాదు.. రుక్సార్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసేందుకు మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం తరువాత అయినా రుక్సార్ మృతికి కారణమైన వారు కటకటాలపాలు అవ్వాలని కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. 

Updated Date - 2021-08-26T02:54:17+05:30 IST