భలే.. భలే.. బ్రహ్మచారి!

ABN , First Publish Date - 2021-02-05T13:58:14+05:30 IST

ఆహనా పెళ్లి అంట.. ఓహో నా పెళ్లి అంట.. నీకు నాకు చెల్లంట..

భలే.. భలే.. బ్రహ్మచారి!

  • పెళ్లి ఆఫర్‌తో ప్రత్యర్థికి మద్దతు.. 
  • కర్ణాటక పంచాయతీలో రసవత్తర రాజకీయం! 

బెంగళూరు : ‘ ఆహనా పెళ్లి అంట.. ఓహో నా పెళ్లి అంట.. నీకు నాకు చెల్లంట ఠాం..ఠాం..ఠాం..’ అంటూ ఆ వార్డు సభ్యుడు ఆనందతాండవమే చేస్తున్నాడు. పార్టీ లేదు... పచ్చిపులుసు లేదు... పిల్ల నాకు చాలని సిగ్గులొలకపోస్తూ సొంతపార్టీ వారికే ఝలక్‌ ఇస్తున్నాడు. ఇతడి వాలకం చూసిన ఆపార్టీవారు ఔరా పెళ్లి ఇంత పనిచేస్తుందనుకోలేదంటూ తలపట్టుకుని కూర్చున్నారు. విషయానికి వస్తే...కర్ణాటకలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఈనెల 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రె్‌సకు చెందిన వ్యక్తి రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది.


ఇదీ అసలు సంగతి..!

రవి బ్రహ్మచారి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ‘మాకు మద్దతు ఇయ్యి...మంచి వధువును చూసి పెళ్లి చేసే బాధ్యత మాది’ అంటూ రవికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఓహ్‌.. నాకు ఇంకేం కావాలి అంటూ రవి సై అనడంతో జేడీఎస్‌ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ హెచ్చరించారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత కూడా ఫోన్‌ చేయించారు. అయినా రవి ససేమిరా అన్నాడు. నాకు రాజకీయం కంటే పెళ్లిపీటలే ముఖ్యమని తేల్చిచెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడ్డ కుమారస్వామి అతడిపై వేటు వేయాలని సూచించినట్టు, స్థానిక నాయకత్వం ఈనెల 11 దాకా వేచి చూద్దాం అనే ధోరణి లో ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2021-02-05T13:58:14+05:30 IST