పెళ్లయిన 4 నెలలకే భార్య మిస్సింగ్.. పోలీసుల ఎంట్రీతో తెలిసిందో షాకింగ్ నిజం.. పరువు పోయిందని ఆ భర్త ఎంతపని చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-02T12:49:49+05:30 IST

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఇద్దరు మహిళలు ఒక టీ షాపు వద్ద మాట్లాడుకుంటుండగా.. అనుకోకుండా వెనుక నుంచి ఒక బుర్కా ధరించిన మహిళ వచ్చి వారిలో ఒకరిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన అక్టోబర్ 22న జరిగింది...

పెళ్లయిన 4 నెలలకే భార్య మిస్సింగ్.. పోలీసుల ఎంట్రీతో తెలిసిందో షాకింగ్ నిజం.. పరువు పోయిందని ఆ భర్త ఎంతపని చేశాడంటే..

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఇద్దరు మహిళలు ఒక టీ షాపు వద్ద మాట్లాడుకుంటుండగా.. అనుకోకుండా వెనుక నుంచి ఒక బుర్కా ధరించిన మహిళ వచ్చి వారిలో ఒకరిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన అక్టోబర్ 22న జరిగింది. చనిపోయిన యువతి ఒక ముస్లిం, ఆమె పేరు ఆసిఫా. పోలీసులు ఆమె హత్య కేసుని ఛేదించడానికి చాలా కష్టపడ్డారు. సుమారు 400 సీసీటీవి వీడియోలు చూసి, 1500 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ బుర్కాలో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫా కథ మహారాష్ట్రలోని పుణె నగరంలో మొదలైంది.  పుణెలోని ఒక మొబైల్ రిపేరింగ్ షాపులో మహేశ్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఆసిఫా తరుచూ అతని వద్దకు తన మొబైల్ రీచార్జ్, రిపేరింగ్ కోసం వచ్చేది. దీంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పారిపోయి 2020లో ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. మహేశ్ మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి చెందినవాడు. పెళ్లి తరువాత ఆసిఫాను తీసుకొని తిరిగి నాసిక్ వెళ్లిపోయాడు. అక్కడే ఒక మొబైల్ రీచార్జ్ షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు.


నాలుగు నెలలు గడిచిన తరువాత ఒకరోజు అనుకోకుండా ఆసిఫా కనిపించకుడా పోయింది.  దీంతో మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొన్ని రోజుల తరువాత ఆసిఫా ఆచూకీ తెలిసిందని చెప్పడంతో మహేశ్‌ వారితో వెళ్లాడు. ఆసిఫా పుణెలో సాహిల్ అనే యువకుడి ఇంట్లో ఉంటోంది. సాహిల్ వరుసకు ఆసిఫా మేనత్త కొడుకు. అతను ఒక 5 స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. మహేశ్ వెంట వచ్చిన పోలీసులు ఆసిఫాని విచారణ చేయగా.. తాను ఇకనుంచి సాహిల్‌తోనే ఉంటానని, మహేశ్‌తో ఇక ఉండలేనని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహేశ్ మాత్రం అక్కడే ఉన్నాడు. ఆసిఫాని తనతో వచ్చేయమని వేడుకున్నా ఆమె వినలేదు. అసలిదంతా ఎందుకు చేశావు? అని మహేశ్ ప్రశ్నించగా.. "నువ్వు ఒక హిందువువి, నీతో పెళ్లి చేసుకోవడం వల్ల మా ఇంట్లో వాళ్లు నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు. నిన్ను వదిలేసి ఒక ముస్లిం అబ్బాయితో పెళ్లిచేసుకుంటే. మళ్లీ వాళ్లంతా నాకు దెగ్గరవుతారు," అని చెప్పింది. ఇది విన్న తరువాత మహేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


కొద్ది రోజుల తరువాత సాహిల్‌కు కలకత్తాలో ఉద్యోగం రావడంతో ఆసిఫా కూడా అక్కడికి వెళ్లిపోయింది. తన ఫోన్ నెంబర్‌ని కూడా మార్చేసింది. మహేశ్ ఆసిఫాని మరిచిపోలేక మళ్లీ ఆమె కోసం వెళ్లాడు. కానీ ఆసిఫా అతనికి దొరకులేదు. మరోవైపు రాజస్థాన్‌లో ఆసిఫా స్నేహితురాలి తల్లి కామినీ ఉండేది. ఆమెకు ఆసిఫా అంటే చాలా ఇష్టం. మహేశ్‌తో పెళ్లి తరువాత కామినీ వారిద్దరికీ చాలా సహాయం చేసింది. దీంతో మహేశ్ కామినీ వద్దకు రాజస్థాన్ వెళ్లి.. ఒకసారి ఆసిఫాను కలవాలని ఉందని చెప్పాడు. కామినీ వద్ద ఆసిఫా కొత్త నెంబర్ ఉంది. మహేశ్ ఎంతో ప్రాధేయపడడంతో కామినీ వారిద్దినీ కాన్ఫెరెన్స్ ఫోన్ కాల్ చేసి మాట్లాడిచ్చింది. ఆసిఫా ఒకసారి రాజస్థాన్ రావడానికి ఒప్పుకుంది. అలా ఆసిఫా రాజస్థాన్ వచ్చి ఒకరోజు కామినీతో ఒక టీ షాపులో కలిసింది. వారిద్దరూ అక్కడ మాట్లాడుతుండగా.. వెనుక నుంచి ఒక బుర్కా వేసుకున్న మహిళ వచ్చి ఒక్కసారిగా ఆసిఫాను కత్తితో పొడిచేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆసిఫాను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పారు. 


పోలీసులకు కామినీ జరిగినదంతా చెప్పింది. రాజస్థాన్ పోలీసులు ఆ బుర్కాలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 400 సీసీటీవి వీడియోలు వెతకగా.. ఆ బుర్కాలో వచ్చింది మహేశ్ అని కనిపించింది. దీంతో పోలీసులు నాసిక్‌లో దాగి ఉన్న మహేశ్ పట్టుకున్నారు. ఈ కేసులో విచిత్రమేమిటంటే.. ఆసిఫా శవం తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులెవరూ రాలేదు. చివరికి సాహిల్ కూడా రాలేదు.


Updated Date - 2021-11-02T12:49:49+05:30 IST