గర్ల్‌ఫ్రెండ్‌కు సర్‌ఫ్రైజ్ ఇద్దామనుకున్నాడు.. పోలీస్టేషన్‌లో పడ్డాడు!
ABN , First Publish Date - 2021-01-13T01:38:10+05:30 IST
గర్ల్‌ఫ్రెండ్‌కు సర్‌ఫ్రైజ్ ఇద్దామని 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఓ యువకుడు... చివరికి తన ప్రయత్నం బెడిసికొట్టడంతో పోలీస్ స్టేషన్‌లో...

లక్నో: గర్ల్‌ఫ్రెండ్‌కు సర్‌ఫ్రైజ్ ఇద్దామని 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఓ యువకుడు... చివరికి తన ప్రయత్నం బెడిసికొట్టడంతో పోలీస్ స్టేషన్‌లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్ష్మిపూర్ ఖేరిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సదరు యువకుడిని 21 ఏళ్ల సల్మాన్‌గా గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ద్యోరియా జిల్లాకి చెందిన అతడు ప్రస్తుతం బెంగళూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా అతడికి లక్ష్మిపూర్ ఖేరి ప్రాంతానికి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆదివారం ఆమె బర్త్‌డే కావడంతో సరిగ్గా జన్మదిన వేడుకల సమయానికి వెళ్లి ఆమెకు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని సల్మాన్ ఆశించాడు. అనుకున్నదే తడవు ఆమె కోసం కొన్ని బహుమతులు కొనుక్కుని బెంగళూరు నుంచి విమానంలో లక్నోకి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ బస్సులో లక్ష్మిపూర్ ఖేరికి వెళ్లాడు. తీరా గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తల్లిదండ్రులు అతడెవరో తమకు తెలియదంటూ ఇంట్లోకి రానివ్వలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అతడు రాత్రంతా స్టేషన్‌లోనే గడపాల్సి వచ్చింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై కేసు పెట్టేందుకు అంగీకరించలేదనీ.. హెచ్చరించి వదిలేయాలంటూ చెప్పారని కొత్వాల్ పోలీస్టేషన్ ఇంచార్జి సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. దీంతో అతడిని నిన్న సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి.. వ్యక్తిగత పూచీకత్తతో విడుదల చేశారు.