అరేబియా సంద్రంలో అందాల దీవులు!

ABN , First Publish Date - 2021-03-21T21:02:15+05:30 IST

కరోనా కాలం అనంతరం బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలెందరో మాల్దీవుల్లో మెరిసి వచ్చారు. కరోనా కాలంలో మాల్దీవులు అందరికీ హాట్‌ డెస్టినేషన్‌ అయ్యాయి..

అరేబియా సంద్రంలో అందాల దీవులు!

పర్యాటకాన్నే నమ్ముకుని బతుకుతున్న బుల్లిదేశం మాల్దీవులు. పగడపు దీవుల సమూహాలు, శ్వేతవర్ణపు ఇసుకతో నిండిన తీరాలు... ఆ దేశానికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టాయి. అది ఒక దీవి కాదు... అరేబియా సముద్రంలో పరచుకున్న 1200 దీవుల సమూహం. ఆ ప్రత్యేకతే మాల్దీవులను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మార్చింది. కరోనా కాలం అనంతరం బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలెందరో మాల్దీవుల్లో మెరిసి వచ్చారు. కరోనా కాలంలో మాల్దీవులు అందరికీ హాట్‌ డెస్టినేషన్‌ అయ్యాయి.. 


ఒకప్పుడు విదేశీ పర్యాటకం పేరు చెబితే గుర్తొచ్చే ప్రదేశాలు సింగపూర్‌, బ్యాంకాక్‌, థాయిలాండ్‌. ఇప్పుడు ఆ దేశాలను ఓ చిన్న దీవి వెనక్కి నెట్టేసింది. వందల పగడపు దీవుల సమూహంతో ఏర్పడిన మాల్దీవులు... పర్యాటకానికి కేరాఫ్‌ అడ్రస్‌లా మారింది. ప్రకృతి సిద్ధమైన అందాలతో పాటూ, సముద్ర సౌందర్యాన్ని కూడా ఆ దీవులలో అనుభూతి చెందొచ్చు. అంతేకాదు మాల్దీవులు పూర్తిగా పర్యాటకం మీదే ఆధారపడి మనుగడ సాగిస్తున్న దేశం కాబట్టి... విదేశీ పర్యాటకుల కోసం చేసే ఏర్పాట్లు అదిరి పోతాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలోనే అంతర్జాతీయ పర్యాటకుల కోసం ద్వారాలు తెరిచింది అక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్‌ ఎత్తేసి తమ దేశానికి రండంటూ జులై 15, 2020 నుంచే పర్యాటక సేవలు ప్రారంభించింది. కరోనా భయంతో ఎవరూ రాకపోయేసరికి తమదైన పద్ధతిలో ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారానికి మన సెలబ్రిటీలెందరికో మంచి ఆఫర్లు ఇచ్చింది. 


మన సెలబ్రిటీలే ఎందుకు?


మిగతా దేశాలతో పోలిస్తే మాల్దీవులు మనకు దగ్గర్లో ఉన్న దేశం. కరోనాకు ముందు ఏటా మాల్దీవులకు 17 లక్షల మంది పర్యాటకులు వస్తే... వారిలో అయిదు లక్షల మంది భారతీయులే. అందుకే మాల్దీవులకు భారత పర్యాటకులు అమూల్యం. భారత్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేయగానే ‘మా దేశానికి రండి... కరోనా వల్ల వచ్చిన ఒత్తిడిని తగ్గించుకోండి’ అంటూ ప్రచారం చేసింది. ఇందుకు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేసుకుని మరీ వారిని తమ దేశానికి పిలిచింది. ఇలా చేయడం వల్ల మాల్దీవులకు ఏం లాభం అనుకుంటున్నారా? ఆయా సెలబ్రిటీలు మాల్దీవులలో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ఖాతాలలో పోస్టు చేయాలన్న నిబంధనను పెట్టింది. దీనివల్ల సెలబ్రిటీల ఫాలోవర్లు ఆ ఫోటోలను చూస్తారు. వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా భారత్‌లో ప్రచారం చేసుకుంటోంది మాల్దీవుల పర్యాటక శాఖ. లాక్‌డౌన్‌ తరువాత కత్రినా కైఫ్‌, టైగర్‌ ష్రాఫ్‌, వరుణ్‌ధావన్‌, తాప్సీ పన్ను, దిశా పటాని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాక్షి సిన్హా... ఇలా ఎంతో మంది మాల్దీవుల బాట పట్టారు. చాలా మంది టాలీవుడ్‌ సెలబ్రిటీలూ మాల్దీవులను సందర్శించారు. అయితే అందరికీ మాల్దీవుల నుంచి ఉచిత ఆఫర్లు వచ్చాయని చెప్పలేం. తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లి వచ్చిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. 


అదే సరియైన కాలం


మాల్దీవుల అందాన్ని ఆస్వాదించాలంటే డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్యలో వెళ్లడం సరియైున ప్రణాళిక. ఆ సమయంలో అక్కడ 29డిగ్రీల నుంచి 31డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వాతావరణం చలిగాను ఉండదు, వేడిగాను ఉండదు. 


ఎంత ఖర్చవుతుందంటే?


ప్రతి దీవిలో రిసార్టులు, వాటర్‌ గేమ్స్‌, స్పా, బీచ్‌, రెస్టారెంట్‌ ఉంటాయి. రిసార్టును బట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. రిసార్టులను నీళ్ల మధ్యలో కట్టారు. వాటిని చేరుకోవడానికి ‘సీ ప్లేన్‌’లను వాడతారు. ఇవి హెలికాప్టర్‌లాంటివే. కాకపోతే నీటిమీద కూడా నడవగలవు. మాల్దీవుల రాజధాని మాలెకు విమానంలో చేరుకున్నాక సీ ప్లేన్‌, వాటర్‌ బోట్లలో ఎంచుకున్న రిసార్టులకు చేరుస్తారు. కొన్ని రిసార్టులలో మూడు రోజుల ప్యాకేజ్‌ విలువ రూ.2.78 లక్షలు. అదే అయిదు రోజులు ఉండాలనుకుంటే రూ.3.40 లక్షలు చెల్లించాలి. విమాన ప్రయాణ ఖర్చులు అదనం. కొన్ని ప్రైవేటు పర్యాటకసంస్థలు ఒక వ్యక్తికి రూ.30 వేల నుంచి రూ.50 వేల ప్యాకేజీల మధ్య ఆఫర్లు ఇస్తున్నాయి.


కాజల్‌ హనీమూన్‌


పెళ్లవ్వగానే హనీమూన్‌ కోసం మాల్దీవులకే వెళ్లింది కాజల్‌-గౌతమ్‌ కిచ్లూ జంట. సముద్రానికి 16 అడుగుల లోతున ఉన్న అండర్‌వాటర్‌ హోటల్‌ ‘మురాకా లో వారిద్దరూ బస చేశారు. ఆ గది పైకప్పుపై సముద్రం, అందులోని రంగురంగుల చేపలు దర్శనమిస్తాయి. కాజల్‌కు ఇన్‌స్టాలో కోటీ 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కనుక ఆమెకు మురాకా హోటల్‌ నుంచి ఉచిత ఆఫర్‌ వచ్చినట్టు సమాచారం. ఏదేమైనా మాల్దీవులలో కాజల్‌ మరచిపోలేని జ్ఞాపకాలను మూటగట్టుకుంది. 


మాల్దీవులలో మజిలీ 


టాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ సమంత- నాగచైతన్య వారం పాటూ మాల్దీవులలోని ‘జోలీ రిసార్ట్‌’లో బస చేశారు. నాగ చైతన్య 34వ పుట్టినరోజును సామ్‌ అక్కడే సెలబ్రేట్‌ చేసింది. పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, నీలి సముద్రంలో కేరింతలు కొట్టింది ఈ జంట. తన భర్త పుట్టినరోజు సందర్భంగా ‘ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండు’ అని కోరింది సామ్‌. 


కొత్త ఏడాదిలో ...


గతేడాది ఘనంగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న జంట నిహారిక-చైతన్య. అనంతరం హనీమూన్‌ మాల్దీవులకే వెళ్లారు. కొత్తఏడాదికి అక్కడే స్వాగతం పలికారు. తెల్లని ఇసుకతిన్నెల్లో ఫొటోలకు ఫొజిచ్చారు. స్కూబా డైవింగ్‌ చేసిన ఫొటోలను తమ ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. మెగాఫ్యాన్స్‌  ఈ జంటకూ అభిమానులుగా మారారు. 


కాబోయే జంట విహారం


తమిళ నటుడు విష్ణువిశాల్‌కు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట తమ స్నేహితులతో కలిసి ఇటీవలే మాల్దీవులకు వెళ్లొచ్చింది. పనిఒత్తిడిని పక్కన పెట్టడానికే తాము దీవులకు వెళ్లినట్టు ఇన్‌స్టాలో చెప్పింది ఆ జంట. అక్కడ తీసుకున్న అందమైన ఫొటోలతో తమ ఇన్‌స్టా ఖాతాను నింపేశారు. 


కొత్త ఏడాదిలో ...


గతేడాది ఘనంగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న జంట నిహారిక-చైతన్య. అనంతరం హనీమూన్‌ మాల్దీవులకే వెళ్లారు. కొత్తఏడాదికి అక్కడే స్వాగతం పలికారు. తెల్లని ఇసుకతిన్నెల్లో ఫొటోలకు ఫొజిచ్చారు. స్కూబా డైవింగ్‌ చేసిన ఫొటోలను తమ ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. మెగాఫ్యాన్స్‌  ఈ జంటకూ అభిమానులుగా మారారు. 


మెరిసిన కియారా 


భరత్‌ అనే నేను సినిమాలో ఆడి పాడిన కియారా కొత్త ఏడాదికి మాల్దీవుల నుంచే స్వాగతం పలికింది. తన సహనటుడు సిద్దార్థమల్హోత్రాతో కలిసి ఆమె ఈ అందాల దీవులలో సేదదీరేందుకు వెళ్లింది. ఇద్దరూ మాల్దీవుల ఫోటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. కియారకు ఇన్‌స్టాలో కోటీ అరవై లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 


రకుల్‌... వాటర్‌ బేబి


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవులను సందర్శించింది. తల్లి, తండ్రి, తమ్ముడితో దీవుల అందాలను ఆస్వాదించింది. బీచ్‌లలో బికినీతో ఫోటోలు దిగి ఇన్‌స్టాలో పోస్టుచేసింది. ఆ ఫొటోలలో తనను తాను ‘వాటర్‌ బేబి’గా పిలుచుకుంది. ఆమెకు ఇన్‌స్టాలో కోటి 63 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

Updated Date - 2021-03-21T21:02:15+05:30 IST